కంటెంట్‌కు వెళ్లు

శాశ్వతకాలం జీవించాలంటే ఏమి చేయాలి?

శాశ్వతకాలం జీవించాలంటే ఏమి చేయాలి?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిలు ఇలా మాటిస్తోంది: “దేవుని ఇష్టం నెరవేర్చే వ్యక్తులు శాశ్వతంగా జీవిస్తారు.” (1 యోహాను 2:17, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మరి మీరు ఏమి చేస్తే దేవుడు ఇష్టపడతాడు?

  •   దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసు గురించి తెలుసుకోవాలి. దేవునికి ప్రార్థన చేస్తూ యేసు ఇలా అన్నాడు, “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) దేవున్ని, ఆయన కుమారుణ్ణి ఎలా ‘తెలుసుకోవచ్చు?’ బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా, అందులోని సందేశాన్ని మన జీవితంలో పాటించడం ద్వారా వాళ్లను మనం తెలుసుకోవచ్చు. a మనకు ప్రాణాన్ని ఇచ్చిన మన సృష్టికర్త అయిన యెహోవా దేవుని ఆలోచనా విధానాన్ని బైబిలు తెలియజేస్తుంది. (అపొస్తలుల కార్యాలు 17:24, 25) అంతేకాదు, “శాశ్వత జీవితాన్నిచ్చే మాటల్ని” బోధించిన ఆయన కుమారుడైన యేసు గురించి కూడా బైబిలు తెలియజేస్తుంది.—యోహాను 6:67-69.

  •   యేసు అర్పించిన విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచాలి. యేసు, “సేవచేయడానికి, ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి” భూమ్మీదకు వచ్చాడు. (మత్తయి 20:28) ఆయన అర్పించిన విమోచన క్రయధనం వల్ల, మనుషులు భూమ్మీద పరదైసులో శాశ్వతం జీవించడానికి మార్గం తెరుచుకుంది. b (కీర్తన 37:29) యేసు ఇలా అన్నాడు, “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహాను 3:16) ఈ మాటల్ని బట్టి కేవలం యేసును నమ్మితే సరిపోదని అర్థమౌతుంది. మనం ‘ఆయన మీద విశ్వాసం ఉంచాలి.’ అంటే ఆయన బోధల ప్రకారం, ఆయన తండ్రి ఇష్టం ప్రకారం జీవించాలి.—మత్తయి 7:21; యాకోబు 2:17.

  •   దేవునితో బలమైన స్నేహాన్ని పెంచుకోవాలి. మనం తనకు దగ్గరవ్వాలని, తనకు స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. (యాకోబు 2:23; 4:8) దేవునికి మరణం లేదు. ఆయన శాశ్వతకాలం ఉంటాడు, తన స్నేహితులు కూడా శాశ్వతకాలం జీవించాలనేది ఆయన కోరిక. తనను వెదికేవాళ్లందరూ ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో తన వాక్యమైన బైబిలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు: “మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.”—కీర్తన 22:26.

శాశ్వతకాలం జీవించడం గురించి ఉన్న అపోహలు

 అపోహ: మనుషుల కృషి వల్ల మరణం లేని జీవితాన్ని సాధించగలుగుతాం.

 నిజం: వైద్య రంగం సాధిస్తున్న ప్రగతి సహాయంతో మనుషుల ఆయుష్షును పెంచుతామని చెప్తున్నప్పటికీ, అలాంటి కృషి మరణం లేని జీవితాన్ని సాధించలేదు. దేవుడు మాత్రమే మనకు శాశ్వత జీవితాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన దగ్గరే “జీవపు ఊట” ఉంది. (కీర్తన 36:9) అంతేకాదు ‘మరణాన్ని మింగేస్తాననీ,’ నమ్మకంగా జీవించే మనుషులందరికీ శాశ్వత జీవితాన్ని ఇస్తాననీ ఆయన మాటిస్తున్నాడు.—యెషయా 25:8; 1 యోహాను 2:25.

 అపోహ: కొన్ని జాతులవాళ్లు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు.

 నిజం: దేవుడు పక్షపాతం చూపించడు. బదులుగా, “ప్రతీ దేశంలో, దేవునికి భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” (అపొస్తలుల కార్యాలు 10:34, 35) ఏ దేశానికి చెందిన వాళ్లయినా, ఏ సంస్కృతికి చెందిన వాళ్లయినా దేవుని మాట వింటే శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

 అపోహ: శాశ్వత జీవితం విసుగు పుట్టిస్తుంది.

 నిజం: మనకు శాశ్వత జీవితాన్ని ఇస్తానని మాటిస్తున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. (యాకోబు 1:17; 1 యోహాను 4:8) కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే మనకు సంతృప్తినిచ్చే పని ఉండాలని ఆయనకు తెలుసు. (ప్రసంగి 3:12) భూమ్మీద శాశ్వతకాలం జీవించేవాళ్లకు సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని ఉంటుందనీ, అది వాళ్లకూ వాళ్ల ప్రియమైనవాళ్లకూ ప్రయోజనాల్ని తెస్తుందనీ దేవుడు మాటిస్తున్నాడు.—యెషయా 65:22, 23.

 అంతేకాదు, శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకున్నవాళ్లు తమ సృష్టికర్త గురించి, ఆయన చేసిన అద్భుతమైన సృష్టి గురించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. దేవుడు మనుషులను శాశ్వతకాలం జీవించాలనే, తన గురించి తెలుసుకోవాలనే కోరికతో తయారుచేశాడు. “అయినా దేవుని క్రియాకలాపాలను మనుషులు పూర్తిగా తెలుసుకోలేరు.” (ప్రసంగి 3:10-11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కాబట్టి శాశ్వతకాలం జీవించేవాళ్లు నేర్చుకోవడానికి, చేయడానికి ఆసక్తికరమైన విషయాలు ఎల్లప్పుడూ ఉంటాయి.

a యెహోవాసాక్షులు బైబిలు గురించి ఉచితంగా నేర్పిస్తారు. మరింత సమాచారం కోసం బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.

bయేసు రక్షిస్తాడు—ఎలా?” అనే ఆర్టికల్‌ చూడండి.