కంటెంట్‌కు వెళ్లు

మహాబబులోను అంటే ఏమిటి?

మహాబబులోను అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రకటన గ్రంథం వర్ణించిన మహాబబులోను ప్రపంచమంతటా ఉన్న అబద్ధమతాల సముదాయం. వీటిని దేవుడు తిరస్కరిస్తున్నాడు. a (ప్రకటన 14:8; 17:5; 18:21) ఆ మతాలన్నీ చాలా విషయాల్లో వేరువేరుగా ఉన్నా, ఏదోరకంగా అవన్నీ ప్రజల్ని సత్యదేవుడైన యెహోవా ఆరాధనకు దూరం చేసేస్తున్నాయి.—ద్వితీయోపదేశకాండము 4:35.

మహాబబులోనును ఎలా గుర్తించవచ్చు?

  1.   మహాబబులోను ఒక గుర్తు. బైబిలు దాన్ని “స్త్రీ” అని, “మహా వేశ్య” అని వర్ణిస్తూ, ఆమె పేరు ఒక రహస్యమని, అది “మహాబబులోను” అని చెప్తుంది. (ప్రకటన 17:1, 3, 5) ప్రకటన గ్రంథంలోని విషయాలు ‘సూచనల’ లేదా గుర్తుల రూపంలో ఉంటాయి కాబట్టి మహాబబులోను అనేది నిజంగా ఒక స్త్రీ కాదని, ఒక గుర్తనే నిర్ధారణకు రావడం సరైనది. (ప్రకటన 1:1) అంతేకాదు, ఆమె “విస్తార జలములమీద” కూర్చుని ఉంది, ఆ నీళ్లు “ప్రజలను, జనసమూహములను, జనములను ఆ యా భాషలు మాటలాడువారిని” సూచిస్తున్నాయి. (ప్రకటన 17:1, 15) ఒక మామూలు స్త్రీ వాటిమీద కూర్చోలేదు కదా!

  2.   మహాబబులోను ఒక అంతర్జాతీయ సంస్థను సూచిస్తోంది. బైబిలు ఆమెను “భూరాజులనేలు ఆ మహాపట్టణమే” అంటుంది. (ప్రకటన 17:18) అంటే ఆమె అన్ని దేశాల మీద తన అధికారాన్ని, ప్రభావాన్ని చూపుతుంది.

  3.   మహాబబులోను రాజకీయ సంస్థో, వ్యాపార సంస్థో కాదు ఒక మత సంస్థ. ఒకప్పటి బబులోను పట్టణం గొప్ప మతసంబంధ పట్టణం. అది మంత్రాలకు, మంత్రవిద్యకు ప్రసిద్ధి. (యెషయా 47:1, 12, 13; యిర్మీయా 50:1, 2, 38) నిజానికి, అక్కడి ప్రజలు నిజ దేవుడైన యెహోవాను వ్యతిరేకిస్తూ అబద్ధమత ఆరాధన చేశారు. (ఆదికాండము 10:8, 9; 11:2-4, 8) పొగరుబోతులైన బబులోను పాలకులు తమనుతాము యెహోవా కంటే, ఆయన ఆరాధన కంటే గొప్పవాళ్లుగా చేసుకున్నారు. (యెషయా 14:4, 13, 14; దానియేలు 5:2-4, 23) అలాగే, మహాబబులోను కూడా ‘మాయమంత్రాలకు’ పేరుగాంచింది. దీన్నిబట్టి మనకు అది మత సంస్థ అని అర్థమవుతుంది.—ప్రకటన 18:22, 23.

     మహాబబులోను రాజకీయ సంస్థ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఆమె నాశనాన్ని చూసి “భూరాజులు” ఏడుస్తారు. (ప్రకటన 17:1, 2; 18:9) అది వ్యాపార సంస్థ అయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే బైబిలు దాన్ని, ‘లోకంలోని వర్తకులను’ వేరుచేసి మాట్లాడుతోంది.—ప్రకటన 18:11, 15.

  4. సిన్‌, షామాష్‌, ఇష్టార్‌ అనే ముగ్గురు దేవుళ్ల త్రిత్వ గుర్తులతో బబులోను రాజు నెబోనైడస్‌ ఉన్న శిలాఫలకం

      మహాబబులోను అబద్ధమత ఆనవాళ్లకు చక్కగా సరిపోతుంది. అబద్ధమతం ప్రజలకు నిజ దేవుడైన యెహోవాకు దగ్గరవ్వడం ఎలాగో నేర్పించకుండా, వేరే దేవుళ్లను ఆరాధించేలా వాళ్లను నడిపిస్తుంది. బైబిలు దీన్ని “ఆధ్యాత్మిక వ్యభిచారం” అంటోంది. (లేవీయకాండము 20:6, NW; నిర్గమకాండము 34:15, 16) త్రిత్వం, ఆత్మకు చావుండదు వంటి బోధలు, విగ్రహాలను ఆరాధించడం వంటి ఆచారాలు ప్రాచీన బబులోనులోనే పుట్టాయి, అబద్ధమతంలో పెరుగుతున్నాయి. ఈ మతాలు లోకం మీద తమకున్న ప్రేమను ఆరాధనలో కలుపుతున్నాయి. బైబిలు ఇలాంటి నమ్మకద్రోహాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారం అంటుంది.—యాకోబు 4:4.

     మహాబబులోను గురించి వర్ణిస్తూ, అది “ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడి” ఉందని బైబిలు చెప్తుంది. ఇప్పుడు అబద్ధమతానికున్న సంపద, డాబు దర్పం బైబిల్లోని ఆ వర్ణనకు సరిగ్గా సరిపోతుంది. (ప్రకటన 17:4) మహాబబులోను “భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లి.” ఇంకోమాటలో చెప్పాలంటే దాని బోధలు, పనులు నిజానికి దేవున్ని అవమానిస్తున్నాయి. (ప్రకటన 17:5) ఈ అబద్ధమతంలోని సభ్యులే మహాబబులోనుకు సహకరించే ‘ప్రజలు, జనసమూహాలు, జనాలు, ఆయా భాషలు మాటలాడేవాళ్లు.’—ప్రకటన 17:15.

 “భూమిమీద వధింపబడిన వారందరి” చావులకు కారణం మహాబబులోనే. (ప్రకటన 18:24) చరిత్ర పొడవునా అబద్ధమతం యుద్ధాలను రగిలించింది, ఉగ్రవాదానికి ఆజ్యం పోసింది. అంతేకాదు ప్రేమామయుడైన యెహోవా దేవుని గురించిన సత్యాన్ని ప్రజలకు ఎంతమాత్రం బోధించలేకపోయింది. (1 యోహాను 4:8) దాని వైఫల్యం వల్ల రక్తం ఏరులై పారింది. అందుకే దేవున్ని సంతోషపెట్టాలనుకునే వాళ్లు మాత్రం అబద్ధమతాన్ని విడిచిపెట్టి దానికి దూరంగా వచ్చేయాలి. అదే మంచి పని.—ప్రకటన 18:4; 2 కొరింథీయులు 6:14-17.

aHow Can I Find the True Religion” అనే ఆర్టికల్‌ చూడండి.