కంటెంట్‌కు వెళ్లు

మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 చివరి రోజుల్లో పెద్దపెద్ద అంటువ్యాధులు (తెగుళ్లు లేదా మహమ్మారులు) వస్తాయని బైబిలు ముందే చెప్పింది. (లూకా 21:11) అలాంటి మహమ్మారులతో దేవుడు ప్రజల్ని శిక్షించడం లేదు. నిజానికి, దేవుడు త్వరలోనే తన రాజ్యం ద్వారా మహమ్మారులను, ఇతర అనారోగ్య సమస్యలను పూర్తిగా తీసేస్తాడు.

 మహమ్మారుల గురించి బైబిలు ముందే చెప్పిందా?

 కోవిడ్‌-19, ఎయిడ్స్‌, స్పానిష్‌ ఫ్లూ వంటి మహమ్మారుల లేదా జబ్బుల గురించి బైబిలు ముందే చెప్పలేదు. అయితే “పెద్దపెద్ద అంటువ్యాధులు,” “ప్రాణాంతకమైన జబ్బు” గురించి అది ముందే చెప్పింది. (లూకా 21:11; ప్రకటన 6:8) అవి “చివరి రోజుల” గురించిన సూచనలో ఒక భాగం, ఆ కాలాన్నే బైబిలు “ఈ వ్యవస్థ ముగింపు” అని కూడా పిలుస్తుంది.—2 తిమోతి 3:1; మత్తయి 24:3.

 దేవుడు ఎప్పుడైనా ప్రజల్ని జబ్బులతో శిక్షించాడా?

 దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రజల్ని జబ్బులతో శిక్షించాడని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, ఆయన కొంతమందిని కుష్ఠువ్యాధితో శిక్షించాడు. (సంఖ్యాకాండం 12:1-16; 2 రాజులు 5:20-27; 2 దినవృత్తాంతాలు 26:16-21) అయితే అవి అమాయక ప్రజలకు కూడా వ్యాపించే మహమ్మారుల లాంటివి కావు. అవి దేవుని తీర్పులు, ఆయనకు ఎదురుతిరిగిన ఆయా వ్యక్తుల మీదికి అవి వచ్చాయి.

 ఈ రోజుల్లో దేవుడు మహమ్మారులతో ప్రజల్ని శిక్షిస్తున్నాడా?

 లేదు. దేవుడు మహమ్మారులతో, జబ్బులతో ఇప్పుడు ప్రజల్ని శిక్షిస్తున్నాడని కొంతమంది అంటారు. అయితే బైబిలు అలా చెప్పట్లేదు. ఈ విషయం మనకెలా తెలుసు?

 గతంలో అలాగే ఇప్పుడు దేవుని సేవకుల్లో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఉదాహరణకు, దేవునికి నమ్మకంగా సేవచేసిన తిమోతి ‘తరచూ వచ్చే జబ్బుతో’ బాధపడ్డాడు. (1 తిమోతి 5:23) అయితే తిమోతి మీద దేవుని అనుగ్రహం లేకపోవడం వల్లే అలా జబ్బు వచ్చిందని బైబిలు చెప్పట్లేదు. అలాగే ఈ రోజుల్లో కూడా దేవున్ని నమ్మకంగా సేవించే కొంతమందికి అనారోగ్యం రావచ్చు లేదా అంటువ్యాధులు సోకవచ్చు. ఎక్కువ సందర్భాల్లో దానికి కారణం, వాళ్లు ఉండకూడని సమయంలో ఉండకూడని చోట ఉండడమే.—ప్రసంగి 9:11.

 అంతేకాదు, దేవుడు చెడ్డవాళ్లను శిక్షించే సమయం ఇంకా రాలేదని బైబిలు బోధిస్తుంది. ఇప్పుడు మనం ‘రక్షణ రోజులో,’ అంటే తనకు దగ్గరై రక్షణ పొందమని దేవుడు మనుషులందర్నీ ప్రేమగా ఆహ్వానిస్తున్న సమయంలో జీవిస్తున్నాం. (2 కొరింథీయులు 6:2) ఆయన అలా ఆహ్వానిస్తున్న ఒక మార్గం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న “రాజ్య సువార్త” ప్రకటనా పని. అది నిజానికి చాలా మంచివార్త.—మత్తయి 24:14.

 మహమ్మారులే లేని రోజు ఎప్పటికైనా వస్తుందా?

 వస్తుంది. అతి తర్వలోనే ఏ ఒక్కరూ అనారోగ్యం పాలవ్వని రోజు వస్తుందని బైబిలు చెప్తుంది. దేవుడు తన రాజ్య పరిపాలనలో అనారోగ్య సమస్యలన్నిటినీ తీసేస్తాడు. (యెషయా 33:24; 35:5, 6) ఆయన బాధల్ని, నొప్పిని, మరణాన్ని పూర్తిగా తీసేస్తాడు. (ప్రకటన 21:4) అంతేకాదు, చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు, అప్పుడు వాళ్లు మంచి ఆరోగ్యంతో చాలా సంతోషకరమైన పరిస్థితుల్లో జీవిస్తారు.—కీర్తన 37:29; అపొస్తలుల కార్యాలు 24:15.

 అనారోగ్యం గురించి చెప్పే బైబిలు వచనాలు

 మత్తయి 4:23: “[యేసు] గలిలయ అంతటా ప్రయాణిస్తూ సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, ప్రజలకున్న ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేస్తూ ఉన్నాడు.”

 దాని భావం: యేసు చేసిన అద్భుతాలు, దేవుని రాజ్యం త్వరలో మనుషులందరి కోసం ఏం చేస్తుందో చూపించే ఒక చిన్న ఉదాహరణ లాంటివి.

 లూకా 21:11: “పెద్దపెద్ద అంటు​వ్యాధులు వస్తాయి.”

 దాని భావం: అనారోగ్య సమస్యలు ఎక్కువవ్వడం చివరి రోజుల సూచనలో ఒక భాగం.

 ప్రకటన 6:8: “ఇదిగో, పాలిపోయిన ఒక గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి ‘మరణం’ అనే పేరు ఉంది. సమాధి అతని వెనకాలే వెళ్తూ ఉంది. ప్రాణాంతకమైన జబ్బుతో ప్రజల్ని చంపేలా వాళ్లకు అధికారం ఇవ్వబడింది.”

 దాని భావం: ప్రకటన పుస్తకంలోని నలుగురు గుర్రపురౌతుల ప్రవచనం, మన కాలంలో మహమ్మారులు వస్తాయని సూచిస్తుంది.