కంటెంట్‌కు వెళ్లు

ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగం ఎవరు?

ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగం ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగం, ప్రపంచ దేశాలను ఏకం చేయాలనే సంకల్పాన్ని, వాటికి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశాన్ని కలిగిన సంస్థకు గుర్తుగా ఉంది. అది మొదట్లో నానాజాతి సమితి రూపంలో ఉండేది, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి రూపంలో ఉంది.

ఎర్రని మృగాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కీలక విషయాలు

  1.   ఇది రాజకీయ సంబంధమైనది. ఈ ఎర్రని మృగానికి ‘ఏడు తలలు’ ఉన్నాయి, అవి ‘ఏడు పర్వతాలకు,’ ‘ఏడుగురు రాజులకు’ లేదా ఏడు పాలనా శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ప్రకటన గ్రంథం చెప్తోంది. (ప్రకటన 17:9, 10) బైబిల్లో పర్వతాలను, మృగాలను ప్రభుత్వాలకు గుర్తులుగా ఉపయోగించారు.—యిర్మీయా 51:24, 25; దానియేలు 2:44, 45; 7:17, 23.

  2.   దీనికి ప్రపంచ రాజకీయ వ్యవస్థ పోలికలు ఉన్నాయి. ఈ ఎర్రని మృగం, ప్రకటన 13వ అధ్యాయంలోని ఏడు తలల మృగానికి ప్రతిబింబం. ఆ ఏడు తలల మృగం ప్రపంచ రాజకీయ వ్యవస్థను సూచిస్తుంది. ఆ ఏడు తలల మృగానికి ఉన్నట్లే ఈ ఎర్రని మృగానికి కూడా ఏడు తలలు, పది కొమ్ములు, దేవుణ్ణి దూషించే పేర్లు ఉన్నాయి. (ప్రకటన 13:1; 17:3) ఈ పోలికలు చూస్తుంటే, ఏదో అనుకోకుండా కలిసినవాటిలా అనిపించడం లేదు. ఈ ఎర్రని మృగం, ప్రపంచ రాజకీయ వ్యవస్థకు ప్రతిబింబం లేదా సారూప్యం.—ప్రకటన 13:15.

  3.   ఇతర పాలకుల నుండి అధికారం పొందింది. ఈ ఎర్రని క్రూరమృగం ఇతర పరిపాలనా శక్తుల్లో నుండి ‘వస్తుంది,’ లేదా వాటి వల్ల ఉనికిలో ఉంటుంది.—ప్రకటన 17:11, NW; 17:17.

  4.   దీనికి మతంతో సంబంధం ఉంది. ప్రపంచంలోని అబద్ధ మతాలన్నిటికీ ప్రతీక అయిన మహాబబులోను ఈ ఎర్రని మృగం మీద కూర్చుంది. అంటే, మత గుంపుల ప్రభావం ఈ మృగం మీద ఉంటుందని తెలుస్తోంది.—ప్రకటన 17:3-5.

  5.   దేవుణ్ణి అవమానిస్తుంది. ఈ మృగం “దేవదూషణ నామములతో నిండుకొని” ఉంది.—ప్రకటన 17:3.

  6.   తాత్కాలికంగా చచ్చుబడిపోతుంది. ఎర్రని మృగం కొంతకాలం “అగాధ జలములో” a లేదా నిష్క్రియా స్థితిలో ఉంటుంది, కానీ మళ్లీ బయటకు వస్తుంది.—ప్రకటన 17:8.

బైబిలు ప్రవచన నెరవేర్పు

 ఎర్రని మృగం గురించి బైబిలు చెప్పిన ప్రవచనం, ఐక్యరాజ్య సమితి, దానికి ముందున్న నానాజాతి సమితి విషయంలో ఎలా నెరవేరిందో చూడండి.

  1.   ఇది రాజకీయ సంబంధమైనది. ఐక్యరాజ్య సమితి, ‘దానిలో సభ్యత్వం ఉన్న అన్ని రాజ్యాల సార్వభౌమ సమానతకు’ b ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయ వ్యవస్థకు మద్దతిస్తుంది.

  2.   దీనికి ప్రపంచ రాజకీయ వ్యవస్థ పోలికలు ఉన్నాయి. 2011లో ఐక్యరాజ్య సమితి, తన 193వ సభ్యదేశాన్ని చేర్చుకుంది. ఆ విధంగా ప్రపంచంలోని అనేక దేశాలకు, ప్రజలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని అది చూపించుకుంటోంది.

  3.   ఇతర పాలకుల నుండి అధికారం పొందింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దేశాల వల్లే అది ఉనికిలో ఉంది. ఆ దేశాలు దానికి ఎంత అధికారం ఇస్తే అంత అధికారమే దానికి ఉంటుంది.

  4.   దీనికి మతంతో సంబంధం ఉంది. నానాజాతి సమితికి, ఐక్యరాజ్య సమితికి ఈ రెండింటికీ ప్రపంచ మతాలు మద్దతునిస్తూ వచ్చాయి. c

  5.   దేవుణ్ణి అవమానిస్తుంది. “అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడడానికి” ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. d ఈ లక్ష్యం గొప్పగానే కనిపిస్తోంది గానీ, దేవుని రాజ్యం మాత్రమే సాధిస్తుందని దేవుడు చెప్పినవాటిని, తానే చేస్తానని చెప్పుకుంటూ ఐక్యరాజ్య సమితి నిజానికి దేవుణ్ణి అవమానిస్తుంది.—కీర్తన 46:9; దానియేలు 2:44.

  6.   తాత్కాలికంగా చచ్చుబడిపోతుంది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కొద్దికాలానికి, శాంతిని కాపాడడానికి స్థాపించబడిన నానాజాతి సమితి అంతర్జాతీయ ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అది పనిచేయడం ఆగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో ఐక్యరాజ్య సమితి రూపొందింది. ఉద్దేశాల్లో, పద్ధతుల్లో, నిర్మాణంలో ఐక్యరాజ్య సమితి నానాజాతి సమితికి అద్దంపట్టింది.

a వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ప్రకారం, “అగాధ జలము” అని అనువదించబడిన గ్రీకు పదానికి “కొలవలేని లోతు” అనే అర్థముంది. కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ అయితే “అడుగులేని గొయ్యి” అనే పదాన్ని ఉపయోగించింది. బైబిల్లో ఈ పదం, నిర్బంధంలోనూ, పూర్తిగా నిష్క్రియగానూ ఉండే స్థితిని లేదా ప్రదేశాన్ని సూచిస్తుంది.

b ఐక్యరాజ్య సమితి ఛార్టర్‌లో 2వ ఆర్టికల్‌ చూడండి.

c ఉదాహరణకు, 1918లో అమెరికాలోని కొన్ని ప్రొటెస్టెంట్‌ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఒక సలహా సంఘం, నానాజాతి సమితి “ఈ భూమ్మీద, దేవుని రాజ్యానికి రాజకీయపరమైన ప్రతీకగా” ఉంటుందని ప్రకటించింది. 1965లో బౌద్ధ, క్యాతలిక్‌, ఈస్ట్రన్‌ ఆర్థడాక్స్‌, హిందూ, ముస్లిం, యూదా, ప్రొటెస్టెంట్‌ మతాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితికి మద్దతివ్వడానికి, దానికోసం ప్రార్థనలు చేయడానికి శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. ఇక 1979లో పోప్‌ జాన్‌ పాల్‌ II, ఐక్యరాజ్య సమితి “శాంతికి, న్యాయానికి సర్వోన్నత వేదికగా ఎప్పటికీ నిలిచిపోతుందని” తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

d ఐక్యరాజ్య సమితి ఛార్టర్‌లో మొదటి ఆర్టికల్‌ చూడండి.