కంటెంట్‌కు వెళ్లు

పగ తీర్చుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

పగ తీర్చుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 ఒక వ్యక్తికి పగ తీర్చుకోవడం న్యాయమే అనిపించినా అది బైబిలు ఇస్తున్న ఈ సలహాకు విరుద్ధం: “‘అతను నాకు చేసినట్టే అతనికి చేస్తాను; అతను చేసినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను’ అని అనకు.” (సామెతలు 24:29) ఇతరుల మీద పగ తీర్చుకోకుండా ఒక మెట్టు వెనక్కి తగ్గడానికి బైబిలు సలహాలు చాలామందికి సహాయం చేశాయి.

ఈ ఆర్టికల్‌లో

 పగ తీర్చుకుంటే తప్పేంటి?

 ఎవరైనా మనల్ని బాధపెట్టినా లేదా మనకు హాని చేసినా కోపం రావడం సహజమే. అప్పుడు అవతలి వ్యక్తికి ఎలాగైనా శిక్షపడాలి అని అనుకోవచ్చు. అయితే పగ తీర్చుకోవడం తప్పు అని బైబిలు చెప్తుంది. ఎందుకు?

 మనుషులు పగ తీర్చుకున్నప్పుడు దేవునికి నచ్చదు. బైబిల్లో యెహోవా a ఇలా చెప్తున్నాడు: “పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని.” (రోమీయులు 12:19) ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు దెబ్బకుదెబ్బ తీసే బదులు, సమస్యను సాధ్యమైనంతవరకు శాంతిగా తేల్చుకోవాలని బైబిలు చెప్తుంది. (రోమీయులు 12:18) శాంతిగా తేల్చుకునే దారులన్నీ మూసుకుపోతే లేదా ప్రయత్నించి-ప్రయత్నించి అలసిపోతే అప్పుడేంటి? తప్పుల్ని సరిచేసే యెహోవా మీద నమ్మకం ఉంచాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి.—కీర్తన 42:10, 11.

 దేవుడు ఎలా శిక్షిస్తాడు?

 ఇప్పుడైతే తప్పుచేసినవాళ్లను శిక్షించడానికి ప్రభుత్వాలకు దేవుడు అధికారం ఇచ్చాడు. (రోమీయులు 13:1-4) కానీ త్వరలో తప్పుచేసిన ఏ ఒక్కరూ, తప్పించుకోకుండా ఆయన ఖచ్చితంగా తీర్పుతీరుస్తాడు. అలాగే అన్యాయాన్ని కూకటివేళ్లతోసహా పెరికేస్తాడు.—యెషయా 11:4.

 పగతో రగిలిపోకుండా ఎలా ఉండవచ్చు?

  •   ఓ క్షణం ఆగి అడుగేయండి. (సామెతలు 17:27) కొంతమంది కోపంలో ఏదోకటి చేసేసి తర్వాత బాధపడతారు. కానీ ఎవరైతే కొంచెం ఆగి, ఆలోచించి, ముందడుగు వేస్తారో వాళ్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.—సామెతలు 29:11.

  •   వాస్తవాలు తెలుసుకోండి. (సామెతలు 18:13) ఎవరైనా మిమ్మల్ని నొప్పిస్తే ఇలా ఆలోచించండి: ‘అతను అలా చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? అతను ఏదైనా ఒత్తిడిలో ఉన్నాడా లేదా తెలీకుండా చేశాడా?’ ఇలా ఆలోచించినప్పుడు, ఎదుటివ్యక్తి కావాలని కాదుగానీ అనుకోకుండా మిమ్మల్ని నొప్పించాడని మీకు అర్థమవ్వొచ్చు.

 పగ గురించి అపోహలు

 అపోహ: “కంటికి కన్ను” అని బైబిల్లో ఉంది కాబట్టి పగ తీర్చుకోమని బైబిలే చెప్తుంది.—లేవీయకాండం 24:20.

 నిజం: “కంటికి కన్ను” అంటున్నప్పుడు మనకు ఎవరైనా హాని చేస్తే, పగ తీర్చుకోమని కాదు. సాధారణంగా, తప్పు చేసినవాళ్లకు సరైన శిక్ష విధించడానికి న్యాయాధిపతులకు ఈ నియమం సహాయం చేసింది. bద్వితీయోపదేశకాండం 19:15-21.

 అపోహ: బైబిలు పగతీర్చుకోకూడదు అని చెప్తుంది కాబట్టి ఎవరైనా మనమీద దాడి చేసినా చేతులు కట్టుకుని కూర్చోవాలి.

 నిజం: ఎవరైనా దాడిచేస్తే తనను తాను రక్షించుకునే లేదా అధికారుల సహాయాన్ని తీసుకునే హక్కు ఒక వ్యక్తికి ఉంది. అయితే, సాధ్యమైనంతవరకు గొడవలకు దూరంగా ఉండమని బైబిలు చెప్తుంది.—సామెతలు 17:14.

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.

b ఈ నియమం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి “‘కంటికి కన్ను’ అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.