కంటెంట్‌కు వెళ్లు

“కంటికి కన్ను” అంటే ఏమిటి?

“కంటికి కన్ను” అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవుడు మోషే ద్వారా ప్రాచీన ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో “కంటికి కన్ను” అనే నియమం ఉండేది. యేసు కూడా కొండమీద ప్రసంగంలో ఈ నియమాన్ని ప్రస్తావించాడు. (మత్తయి 5:38; నిర్గమకాండము 21:24, 25; ద్వితీయోపదేశకాండము 19:21) నేరస్తునికి విధించే శిక్ష, అతను చేసిన తప్పుకు సరిపోయేలా ఉండాలనేది ఈ నియమం ఉద్దేశం. a

 ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని తలపెట్టిన వ్యక్తులకు ఈ నియమం వర్తిస్తుంది. అలాంటి వ్యక్తులకు విధించే శిక్ష గురించి మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, “విరుగ గొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికిపల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.”—లేవీయకాండము 24:20.

 “కంటికి కన్ను” అనే నియమం ఉద్దేశం ఏమిటి?

 “కంటికి కన్ను” అనే నియమం, ఎవరికి వాళ్లే పగ తీర్చుకోవడాన్ని ప్రోత్సహించట్లేదు. బదులుగా న్యాయాధిపతులు నేరస్తులకు సరైన శిక్ష విధించడానికి ఆ నియమం ఉపయోగపడింది. అంటే బాగా కఠినమైన శిక్ష లేదా తేలికైన శిక్ష కాకుండా, తప్పుకు సరిపడా శిక్ష విధించడానికి సహాయపడింది.

 అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని తలపెట్టేవాళ్లకు, లేదా హాని తలపెట్టేందుకు కుట్ర పన్నేవాళ్లకు ఈ నియమం హెచ్చరికగా ఉండేది. ధర్మశాస్త్రం ఇలా వివరించింది, “మిగిలినవారు విని [దేవుని తీర్పు అమలు చేయబడడం వినేవాళ్లు] భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.”—ద్వితీయోపదేశకాండము 19:20.

 “కంటికి కన్ను” అనే నియమాన్ని క్రైస్తవులు పాటించాలా?

 లేదు, ఈ నియమం క్రైస్తవులకు వర్తించదు. యేసు మరణం ద్వారా, ఈ నియమం ఉన్న మోషే ధర్మశాస్త్రం ముగింపుకొచ్చింది.—రోమీయులు 10:4.

 అయినప్పటికీ, దేవుని ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోవడానికి ఈ నియమం సహాయపడుతుంది. ఉదాహరణకు, దేవుడు న్యాయాన్ని విలువైనదిగా ఎంచుతాడని అది తెలియజేస్తుంది. (కీర్తన 89:14) అంతేకాదు, నేరస్తులకు “మితముగా” లేదా తగిన మోతాదులో శిక్షపడాలనే ఆయన న్యాయప్రమాణాన్ని కూడా అది తెలియజేస్తుంది.—యిర్మీయా 30:11.

 “కంటికి కన్ను” అనే నియమం గురించి అపోహలు

 అపోహ: “కంటికి కన్ను” అనేది చాలా కఠినమైన నియమం.

 నిజం: న్యాయాన్ని కఠినమైన లేదా క్రూరమైన రీతిలో అమలు చేయాలనేది ఈ నియమం ఉద్దేశం కాదు. బదులుగా, అర్హులైన న్యాయాధిపతులు ఏదైనా తప్పుకు శిక్ష విధించేముందు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు జరిగింది, ఉద్దేశపూర్వకంగా ఆ తప్పు చేశారా వంటి విషయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత శిక్ష విధించాలనే ఉద్దేశంతో ఆ నియమం ఇవ్వబడింది. (నిర్గమకాండము 21:28-30; సంఖ్యాకాండము 35:22-25) ఒక విధంగా చెప్పాలంటే, కఠినమైన శిక్షలు విధించకుండా ఈ నియమం హద్దులు పెట్టింది.

 అపోహ: “కంటికి కన్ను” అనే నియమం అంతులేని వ్యక్తిగత ప్రతీకారాన్ని ప్రోత్సహించింది.

 నిజం: ‘కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపం ఉంచుకోకూడదు’ అని మోషే ధర్మశాస్త్రం తెలియజేసింది. (లేవీయకాండము 19:18) ధర్మశాస్త్రం వ్యక్తిగత కక్షల్ని ప్రోత్సహించలేదు. బదులుగా, దేవుని మీద అలాగే తప్పుల్ని సరిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంచమని ప్రజల్ని ప్రోత్సహించింది.—ద్వితీయోపదేశకాండము 32:35.

a కొన్నిసార్లు ఈ న్యాయ సూత్రాన్ని లెక్స్‌​ టాలియోనిస్‌​ అనే లాటిన్‌​ పదంతో కూడా పిలుస్తారు. ఈ సూత్రం ఇతర ప్రాచీన న్యాయ వ్యవస్థల్లో కూడా ఉంది.