కంటెంట్‌కు వెళ్లు

క్రైస్తవత్వంలో ఎందుకు ఇన్ని శాఖలు ఉన్నాయి?

క్రైస్తవత్వంలో ఎందుకు ఇన్ని శాఖలు ఉన్నాయి?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రజలు యేసు బోధలను ఉపయోగించుకొని రకరకాల “క్రైస్తవ” శాఖలను మొదలుపెట్టారు. కానీ, నిజమైన క్రైస్తవమతం ఒక్కటే ఉందని బైబిలు చెప్తుంది. ఇది నిజమని చెప్పడానికి ఈ మూడు కారణాలను పరిశీలించండి.

  1.   తాను బోధించింది “సత్యము” అని యేసు చెప్పాడు, అలాగే తొలి క్రైస్తవులు తమది సత్య మతమని చెప్పారు. (యోహాను 8:32; 2 పేతురు 2:2; 2 యోహాను 4; 3 యోహాను 3) కాబట్టి ఎవరైతే యేసు చేసిన బోధలతో పొంతనకుదరని సిద్ధంతాలను ప్రోత్సహిస్తారో వాళ్లది నిజమైన క్రైస్తవ మతం కాదు.

  2.   క్రైస్తవులు “ఏకభావముతో మాటలాడవలెను” అని బైబిలు బోధిస్తోంది. (1 కొరింథీయులు 1:10) కానీ చాలా క్రైస్తవమత శాఖల్లో ‘క్రైస్తవునిగా ఉండడమంటే ఏమిటి?’ వంటి ప్రాథమిక బోధల విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. అలాంటి శాఖలన్నీ నిజమైనవి కావు.—1 పేతురు 2:21.

  3.   చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటారేగానీ తన బోధలను పాటించరనీ అలాంటివాళ్లను తాను ఒప్పుకోననీ యేసు ముందే చెప్పాడు. (మత్తయి 7:21-23; లూకా 6:46) లాభం పొందడం కోసం సత్యారాధనను కలుషితం చేసే మతనాయకుల వల్ల కొంతమంది మోసపోతారు. (మత్తయి 7:15) అయితే, అబద్ధ క్రైస్తవశాఖలను కొంతమంది ఎందుకు అనుసరిస్తున్నారంటే, అవి వాళ్లకు బైబిల్లోని సత్యాన్ని కాదుగానీ వాళ్లు వినడానికి ఇష్టపడే విషయాల్ని చెప్తాయి కాబట్టి.—2 తిమోతి 4:3, 4.

 గోధుమల గురుగుల ఉపమానం గురించి చెప్తూ నిజమైన క్రైస్తవమతంలో గొప్ప భ్రష్టత్వం మొదలవుతుందని యేసు ప్రవచించాడు. (మత్తయి 13:24-30, 36-43) చాలాకాలంపాటు నిజ క్రైస్తవులు ఎవరో, అబద్ధ క్రైస్తవులు ఎవరో గుర్తుపట్టడం కష్టమౌతుంది. యేసు చెప్పినట్టే అపొస్తలులు చనిపోయిన తర్వాత మతభ్రష్టత్వం ఎక్కువైంది. (అపొస్తలుల కార్యములు 20: 29, 30) మతభ్రష్ట బోధలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, రకరకాల అబద్ధ క్రైస్తవ శాఖలన్నీ సత్యము నుండి తప్పిపోయాయి.—2 తిమోతి 2:17, 18.

 అబద్ధ మతానికి, నిజమైన మతానికి ఉన్న తేడా మెల్లమెల్లగా స్పష్టమౌతుందని కూడా యేసు ముందే చెప్పాడు. ఇది మన కాలంలో అంటే “యుగసమాప్తి” కాలంలో జరిగింది.—మత్తయి 13:30, 39.