కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి

“బస్సు బయలుదేరవచ్చు, కానీ చైనీస్‌ అతను ఇక్కడే ఉండాలి!” అలెగ్జాండ్రా బస్సులో కూర్చుని ఆ మాటలు వింది. ఆ బస్సు దక్షిణ అమెరికాలో రెండు దేశాల మధ్య సరిహద్దును దాటడానికి సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దామని ఆమె బస్సు దిగింది. ఆ చైనీస్‌ యువకుడు వచ్చీరాని స్పానిష్‌ భాషలో బార్డర్‌ దగ్గర ఉన్న గార్డుకు ఆయన పరిస్థితి వివరించడానికి అవస్థ పడుతున్నాడు. అలెగ్జాండ్రా యెహోవాసాక్షుల చైనీస్‌ భాష మీటింగ్స్‌కు వెళ్లేది కాబట్టి ఆ భాషలో మాట్లాడి అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.

చట్టపరంగా ఇక్కడ ఉండడానికి తనకు అర్హత ఉందని, కానీ అతని డాక్యుమెంట్లను, డబ్బును ఎవరో దోచుకున్నారని ఆ యువకుడు చెప్పాడు. మొదట్లో అధికారి ఆయన చెప్పే విషయాన్ని నమ్మలేదు, అలెగ్జాండ్రా కూడా మనుషులను అమ్మే వ్యాపారం చేస్తుందని అనుమానించాడు. చివరికి, ఆ యువకుడు చెప్పే విషయాన్ని అధికారి నమ్మాడు, అయితే సరైన డాక్యుమెంట్లు లేనందుకు అతను ఫైన్‌ కట్టాల్సి వచ్చింది. అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో అలెగ్జాండ్రా అతనికి 20 డాలర్లు ఇచ్చింది. అతను చాలా కృతజ్ఞతతో 20 కన్నా ఎక్కువ డాలర్లు ఇస్తానని చెప్పాడు. అప్పుడు అలెగ్జాండ్రా ఏదో ఆశించి సహాయం చేయలేదని, అలా చేయడం సరైనదని తనకు అనిపించి సంతోషంగా సహాయం చేసిందని వివరించింది. అతనికి బైబిలు సాహిత్యం ఇచ్చి యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోమని చెప్పింది.

పరిచయం లేనివాళ్ల పట్ల ఎవరైన ఉదారత చూపించారని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిస్సందేహంగా అన్నీ మతాల వాళ్లు, అసలు మతమంటే ఇష్టం లేనివాళ్లు కూడా ఇలాంటి ఉదారత చూపిస్తారు. ఏమి ఆశించకుండా వేరేవాళ్లకు ఇవ్వడం మీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న గురించి మనం ఆలోచించాలి, ఎందుకంటే యేసు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 20:35) సైన్సు కూడా దీని గురించి ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇవ్వడం మనకే మంచిదని పరిశోధకులు తెలుసుకున్నారు. ఎలా మంచిదో చూద్దాం.

‘సంతోషంగా ఇచ్చేవాళ్లు’

సంతోషం, ఇవ్వడం రెండూ ఒకే దగ్గర ఉంటాయని అనుభవాలు చూపిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు “సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని రాశాడు. తోటి విశ్వాసులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ధారాళంగా విరాళాలు ఇచ్చిన క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. (2 కొరింథీయులు 8:4; 9:7) వాళ్లు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇచ్చారని పౌలు చెప్పలేదు కానీ వాళ్లు ఇచ్చారు కాబట్టి సంతోషంగా ఉన్నారని చెప్పాడు.

ఇవ్వడం వల్ల “మెదడులో సంతోషం, ఇతరులతో సంబంధాలు, నమ్మకం, వంటి వాటికి సంబంధించిన భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. దానివల్ల సంతృప్తికరమైన అనుభూతి కలుగుతుంది” అని ఒక అధ్యయనంలో తేలింది. ఇంకో అధ్యయనం “తమ కోసం డబ్బు ఖర్చు పెట్టుకున్నప్పుడు కలిగే సంతోషం కన్నా వేరే వాళ్లకు డబ్బు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వాళ్లకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది” అని చెప్తుంది.

మీ పరిస్థితుల వల్ల పెద్దగా ఏమి ఇవ్వలేకపోతున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నిజం ఏంటంటే, ప్రతీ ఒక్కరూ ‘సంతోషంగా ఇస్తూ’ ఉంటే ఆనందాన్ని పొందవచ్చు. మంచి ఉద్దేశంతో ఇస్తే, ఇచ్చేది పెద్ద మొత్తం కాకపోయినా ఫర్వాలేదు. ఒక యెహోవాసాక్షి ఈ పత్రిక ప్రచురణకర్తలకు విరాళం పంపుతూ ఇలా రాసింది: “ఇన్ని సంవత్సరాలు మీటింగ్‌ హాల్లో కొంత డబ్బు విరాళంగా ఇవ్వడం తప్ప నేను ఏమి ఇవ్వలేకపోయాను.” అయితే ఆమె ఇంకా ఇలా అంటోంది, “నేను ఇచ్చిన దానికన్నా ఎన్నోరెట్లు యెహోవా నాకు ఇచ్చాడు. . . . ఇలా ఇవ్వగలిగే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే, అది నాకు సంతృప్తిని ఇచ్చింది.”

మనం ఇవ్వగలిగింది కేవలం డబ్బే కాదు. ఇవ్వడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఇవ్వడం మీ ఆరోగ్యానికి మంచిది

ఇవ్వడం మీకు, ఇతరులకు మంచి చేస్తుంది

బైబిలు ఇలా చెప్తుంది: “దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును.” (సామెతలు 11:17) దయగలవాళ్లు ఉదారంగా ఉంటారు. సమయాన్ని, శక్తిని ఇస్తూ ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తూ ఇలాంటివి ఎన్నో చేస్తూ తమకున్న వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో దీన్ని అలవాటు చేసుకుంటే చాలా విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా అది మన ఆరోగ్యానికి మంచిది.

ఇతరులకు సహాయం చేస్తూ ఉండే వాళ్లకు బాధలు, నొప్పులు, డిప్రెషన్‌ తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మొత్తం మీద వాళ్లకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఉదారంగా ఇచ్చే కొంతమందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటే మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, హెచ్‌ఐవి లాంటివి ఉన్నా వాళ్ల ఆరోగ్యం మెరుగౌతుంది. తాగుడు మానుకోవాలని అనుకునేవాళ్లు ఇతరులకు సహాయం చేస్తే ఎక్కువగా కృంగిపోకుండా, మళ్లీ తాగుడుకు అలవాటు పడిపోకుండా ఉండగలుగుతారు.

ఎందుకంటే, “దయ, ఔదార్యం, కనికరంతో ఆలోచిస్తే ప్రతికూల ఆలోచనలు తక్కువగా ఉంటాయి.” ఇచ్చే అలవాటు ఉంటే ఒత్తిడి లేదా టెన్షన్‌, బి.పి. కూడా తగ్గవచ్చు. వివాహ జతను కోల్పోయిన వాళ్లు ఇతరులకు సహాయం చేయడం వల్ల డిప్రెషన్‌ లక్షణాల నుండి త్వరగా కోలుకున్నారు.

సందేహమే లేదు. ఇతరులకు ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది.

మీరు ఇస్తూ ఉంటే ఇతరులు కూడా ఇవ్వడం నేర్చుకుంటారు

యేసు తన అనుచరులను: “ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు. వాళ్లు మంచి కొలతతో మీ ఒళ్లో పోస్తారు; వాటిని అదిమి, కుదిపి, పొర్లిపోయేంతగా పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో, వాళ్లూ మీకు అదే కొలతతో కొలుస్తారు” అని చెప్పాడు. (లూకా 6:38) మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు వాళ్లు మీ ఉదారతకు కృతజ్ఞత చూపిస్తారు, వాళ్లు కూడా ఉదారంగా ఇవ్వడం నేర్చుకుంటారు. ఇవ్వడం వల్ల సహకారం, స్నేహం పెరుగుతాయి.

ఇవ్వడం వల్ల సహకారం, స్నేహం పెరుగుతాయి

మనుషుల మధ్య బంధాలను అధ్యయనం చేసే పరిశోధకులు ఈ విషయాన్ని గమనించారు: “ఇచ్చే అలవాటు ఉన్నవాళ్లు ఇతరులు కూడా అలా ఇచ్చేలా ప్రోత్సహిస్తారు. కనికరంతో ఇతరులకు ఇచ్చిన అసాధారణ కార్యాల గురించి చదివి కూడా ధారాళంగా ఇచ్చే అలవాటును పెంచుకుంటారు.” ఒక అధ్యయనం ప్రకారం, “మనుషుల మధ్య ఉన్న పరిచయాల వల్ల ఒక వ్యక్తి తనకు తెలిసిన వాళ్లను, తెలియని వాళ్లను, చాలామందిని, బహుశా వందల మందిని కూడా ప్రభావితం చేయగలడు.” మరో మాటలో చెప్పాలంటే, నీటిలో ఏర్పడే ఒక చిన్న కదలిక మొత్తం నీరంతా వ్యాపించినట్లే ఉదారంగా చేసిన ఒకే ఒక పని ఒకరి ద్వారా ఇంకొకరిని ప్రభావితం చేస్తూ, పూర్తి సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. అలాంటి సమాజంలో జీవించాలని మీరు కోరుకోవడం లేదా? అవును, అందరూ ఇవ్వడం నేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

దీన్ని వివరించే ఒక అనుభవాన్ని చూడండి, ఇది అమెరికాలో ఫ్లోరిడా అనే ప్రాంతంలో జరిగింది. పెద్ద తుఫాను వచ్చిన తర్వాత, కొంతమంది యెహోవాసాక్షులు సహాయక చర్యలు చేయడానికి వచ్చారు. వాళ్లు బాగు చేయాల్సిన ఇంటి దగ్గర సామాన్ల కోసం ఎదురు చూస్తుండగా పక్కనే ఉన్న ఒక ఇంటి ఫెన్స్‌ పాడైనట్టు గమనించి దాన్ని బాగు చేస్తామని అడిగారు. ఆ ఇంటి వ్యక్తి కొంతకాలం తర్వాత యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయానికి ఇలా లెటర్‌ రాశాడు: “నేను ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి. నేను ఇప్పటి వరకు కలిసిన వాళ్లలో ఇంత మంచి వాళ్లను ఎప్పుడూ చూడలేదు.” యెహోవాసాక్షులు గొప్ప పని చేస్తున్నారని చెప్పి కృతజ్ఞతగా ఆ పనికి ఉపయోగపడేలా ఉదారంగా విరాళం ఇచ్చాడు.

ఇతరులకు ఇచ్చే విషయంలో అతి గొప్ప మాదిరిని అనుకరించండి

సైన్స్‌ పరిశోధనలో తేలిన అద్భుతమైన విషయం ఏంటంటే “ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన స్వతహాగా మనిషిలో ఉంది.” పిల్లల గురించి ఆ అధ్యయనం “మాటలు రాకముందే ఇతరులకు సహాయం చేయాలనే లక్షణం వాళ్లలో ఉంటుంది” అని చెప్తుంది. ఎందుకు? దానికి జవాబు బైబిలు వివరిస్తుంది. మనిషి “దేవుని స్వరూపంలో” సృష్టించబడ్డాడు, అంటే, దేవునికి ఉన్న లక్షణాలే మనిషికి కూడా ఉన్నాయి.—ఆదికాండము 1:27.

మన సృష్టికర్తయైన యెహోవా దేవునికి ఉన్న అద్భుతమైన లక్షణాల్లో ఉదారత ఒకటి. ఆయన మనకు ప్రాణాన్ని, సంతోషంగా ఉండడానికి అవసరమైన ప్రతీ దాన్ని ఇచ్చాడు. (అపొస్తలుల కార్యాలు 14:17; 17:26-28) మన పరలోక తండ్రిని బాగా తెలుసుకోవడానికి, ఆయన మనకోసం ప్రేమతో చేసిన సంకల్పాలను తెలుసుకోవడానికి ఆయన వాక్యమైన బైబిలును లోతుగా చదవాలి. భవిష్యత్తులో మనం సంతోషంగా ఉండడానికి ఆయన ఏర్పాట్లు చేశాడని కూడా ఆ పుస్తకం వెల్లడి చేస్తుంది. a (1 యోహాను 4:9, 10) యెహోవా దేవుడు ఉదారతకు మూలం, పైగా మీరు ఆయన స్వరూపంలో సృష్టించబడ్డారు కాబట్టి దేవుణ్ణి అనుకరించే వాళ్లుగా ఇవ్వాలనే లక్షణం మీకు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఉదారత చూపించినప్పుడు మీకే మంచి జరుగుతుంది, దేవుని ఆమోదం కూడా పొందుతారు.—హెబ్రీయులు 13:16.

ఈ ఆర్టికల్‌ మొదట్లో మాట్లాడుకున్న అలెగ్జాండ్రా మీకు గుర్తుందా? ఆమె కథ ఎలా మలుపు తిరిగింది? ఇక ఆమె డబ్బులు పోయినట్టే అని తోటి ప్రయాణికుడు ఆమెతో చెప్పాడు. కానీ చివరికి బస్సు ఆగినప్పుడు ఆ చైనీస్‌ అతను తన స్నేహితులను కలిసి ఆమె ఇచ్చిన 20 డాలర్లను వెంటనే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు, అలెగ్జాండ్రా చెప్పినట్లు అతను బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. మూడు నెలల తర్వాత, పెరూలో చైనీస్‌ భాషలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశంలో ఆమె అతణ్ణి చూసి చాలా సంతోషించింది. అలెగ్జాండ్రా చేసిన దానంతటికీ కృతజ్ఞతగా ఆమెను, ఆమెతో సమావేశానికి ప్రయాణించి వచ్చిన వాళ్లను తన రెస్టారెంట్‌కు ఆహ్వానించాడు.

ఇతరులకు ఇవ్వడం, సహాయం చేయడం ఎంతో సంతోషాన్ని తెస్తుంది. అంతేకాదు, ప్రతీ మంచి బహుమానానికి మూలమైన యెహోవా దేవుణ్ణి బాగా తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేస్తే మీ సంతోషం ఇంకా పెరుగుతుంది. (యాకోబు 1:17) ఇలా ఇతరులకు ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలను మీరు పొందుతున్నారా?

a ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం చూడండి. ఈ పుస్తకం www.pr418.com/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది. ప్రచురణలు > పుస్తకాలు & బ్రోషుర్‌లు చూడండి.