కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే . . .

ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

మీ కుటుంబం ఎప్పుడూ గొడవలు, పోట్లాటల్లో మునిగిపోయి ఉంటే ఏం చేయాలి? రోజురోజుకి గొడవలు పెద్దవి అవుతున్నాయి, లేదా ఎక్కువసార్లు గొడవలు వస్తున్నాయి, అసలు అవి ఎలా వస్తున్నాయో కూడా బహుశా మీకు తెలియడం లేదు. కానీ, మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం మీకు ఇష్టం లేదు.

ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ అభిప్రాయాలు కలవకపోతే దానర్థం మీ కుటుంబ జీవితం ముక్కలైపోతుందని కాదు. అభిప్రాయాల్లో తేడాలు ఉండడం వల్ల కాదుగానీ, ఆ తేడాలను పరిష్కరించుకోవడం రాకపోవడం వల్లే ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. గొడవలు, పోట్లాటలు రాకుండా మనమేమి చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

1. మాటకు మాట చెప్పడం మానండి.

ఇద్దరూ వాదించుకుంటేనే పోట్లాట జరుగుతుంది. కానీ ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు వినడం మొదలు పెడితే పెద్ద గొడవ కూడా ఆగిపోతుంది. కాబట్టి మాటలతో రెచ్చగొట్టినా వెంటనే కోపంతో ఎదురు చెప్పకండి. మిమ్మల్ని మీరు ఆపుకుని మీ ఆత్మ గౌరవాన్ని, విలువని పెంచుకోండి. ఎవరు, ఎవరి నోరు మూయించారు అనే దానికన్నా కుటుంబంలో ప్రశాంతత ముఖ్యం.

“కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.”సామెతలు 26:20.

2. మీవాళ్ల మనసుని అర్థం చేసుకోండి.

మాటల మధ్యలో ఆపకుండా, ముందే ఒక నిర్ణయానికి రాకుండా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వింటే కోపాన్ని తగ్గించుకుని గొడవ జరగకుండా చూసుకోవచ్చు. ఊరికే నిందలు మోపకుండా వాళ్ల మనసును సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏదో పొరపాటున జరిగిన వాటిని కావాలని చేసినట్లు భావించకండి. కఠినమైన మాటలు ఎక్కువగా అనుకోకుండా లేదా బాధలో వస్తాయి గాని చెడు ఉద్దేశంతోనో, కక్షతోనో కాకపోవచ్చు.

“మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.”కొలొస్సయులు 3:12.

3. కోపం తగ్గాక మాట్లాడండి, అవసరమైతే కొంత సమయం తీసుకోండి.

మీకు విసుగ్గా ఉంటే, మర్యాదగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది. కోపం తగ్గించుకోవడానికి కొంతసేపు వేరే గదిలోకి గానీ, అలా బయటకు గానీ వెళ్లవచ్చు. ఇలా చేస్తే అవతలి వాళ్లను మాట్లాడనీయకుండా ఆపినట్లు, సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నట్లు కాదు. ఇంక మాట్లాడను అన్నట్లు అలగడానికి అంతకన్నా కాదు. సహనం, జ్ఞానం, అర్థం చేసుకునే తెలివి ఇవ్వమని దేవునికి ప్రార్థన చేసుకోవడానికి ఇది మంచి సమయం.

“వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.”సామెతలు 17:14.

4. ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.

మాటకు మాటతో ఎలా దెబ్బ కొట్టాలి అనే ఆలోచిస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారౌతుంది. కాబట్టి బాధను తగ్గించే మాటలు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు అనుకున్నట్లే అవతలి వాళ్లు కూడా అనుకోవాలి అని పట్టుబట్టే బదులు వాళ్లకెందుకు అలా అనిపిస్తుందో వినయంగా అడగండి. మీకు ఏదైనా చెప్పినా, సలహా ఇచ్చినా కృతజ్ఞతలు చెప్పండి.

“కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.”సామెతలు 12:18.

5. అరవకుండా గొడవ తగ్గేలా మాట్లాడండి.

ఇంట్లో ఒకరు సహనం కోల్పోతే మిగతా వాళ్లకు కూడా కోపం రావచ్చు. అప్పుడు మీకు ఎంత బాధ కలిగినా వెక్కిరిస్తూ మాట్లాడాలని, అవమానించాలని, అరవాలని మాత్రం అనుకోకండి. “నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవు,” “నేను చెప్పేది ఎప్పుడూ వినవు” అని బాధ కలిగేలా నిందించకండి. ఆప్యాయంగా మీ భర్త లేదా భార్య చేసిన పనులు మీకు ఎలా అనిపించాయో చెప్పండి (“నువ్విలా అన్నప్పుడు నాకు బాధేసింది . . . ”). తోసుకోవడం, చెంపలు మీద కొట్టడం, తన్నడం లాంటివి చాలా తప్పు. పేర్లు పెట్టి వెక్కిరించడం, అవమానించేలా మాట్లాడడం, బెదిరించడం కూడా తప్పే.

“సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.”ఎఫెసీయులు 4:31.

6. త్వరగా క్షమాపణ అడగండి. పరిస్థితిని చక్కపర్చడానికి మీరు ఏమి చేస్తారో వివరించండి.

చిరాకు, కోపం లాంటివి సమాధానంగా ఉండాలనే మీ ముఖ్య ఉద్దేశాన్ని పాడు చేయనివ్వకండి. మీరు ఎవరితో అయినా గొడవపడితే మీ ఇద్దరూ ఓడిపోయినట్లే అని గుర్తు పెట్టుకోండి. మీరు శాంతి సమాధానాన్ని తీసుకొస్తే మీ ఇద్దరూ గెలిచినట్లే. కాబట్టి గొడవ రావడానికి మీరు కూడా బాధ్యులే అని ఒప్పుకోండి. మీరు ఏ తప్పూ చేయలేదని మీకు అనిపించినా, చిరాకుపడి, తెలియకుండా గొడవ పెంచినందుకు క్షమాపణ అడగండి. అహంకారం కన్నా, గెలవడం కన్నా మంచి సంబంధాలు చాలా ముఖ్యం. మిమ్మల్ని ఎవరైనా క్షమాపణ అడిగితే వెంటనే క్షమించేయండి.

“నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము.”సామెతలు 6:3.

గొడవ జరిగాక కుటుంబంలో శాంతిని తీసుకురావడానికి మీరేమి చేయవచ్చు? ఈ విషయాన్ని తర్వాత అంశంలో చూద్దాం. (g15-E 12)