కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చనిపోవాలనుకున్నాను కానీ నమ్మకంతో బ్రతుకుతున్నాను

చనిపోవాలనుకున్నాను కానీ నమ్మకంతో బ్రతుకుతున్నాను

నీళ్లలో బోర్లాపడిపోయి, ఊపిరాడక గాలి పీల్చుకోవాలని తల ఎత్తడానికి ప్రయత్నిస్తున్నా కానీ మెడ కదలట్లేదు. చాలా భయమేసింది, తిరగడానికి ప్రయత్నిస్తున్నా కానీ కాళ్లు చేతులు కదపలేకపోతున్నాను. ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్లిపోతున్నాయి. ఆ రోజుతో నా జీవితం పూర్తిగా మారిపోయింది.

హంగేరి దేశానికి ఈశాన్యంలో ఉన్న సెరెంచ్‌ పట్టణంలో నేను పుట్టాను, టీసలదాన్యె అనే గ్రామంలో పెరిగాను. 1991 జూన్‌లో, కొంతమంది స్నేహితులతో కలిసి టీసా నదిలో మాకు తెలియని చోటుకి వెళ్లాం. నీళ్లు బాగా లోతున్నాయనుకుని ఈత కొట్టడానికి దూకాను. పెద్ద ప్రమాదం జరిగింది. మెడలో మూడు ఎముకలు విరిగి, వెన్నుపూస దెబ్బతింది. నా స్నేహితుల్లో ఒకరు నేను కదలట్లేదని గమనించి, మునిగిపోకుండ నన్ను జాగ్రత్తగా బయటికి లాగారు.

నేను స్పృహలోనే ఉన్నాను, ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని అర్థమైంది. ఎవరో ఎమర్జెన్సీ నెంబరుకు ఫోన్‌ చేశారు, వెంటనే నన్ను హెలికాఫ్టర్‌లో ఎక్కించి హాస్పిటల్లో చేర్చారు. వెన్నుపూస ఇంకా పాడవకుండా డాక్టర్లు నాకు ఆపరేషన్‌ చేశారు. తర్వాత, కోలుకోడానికి బుడాపెస్ట్‌ నగరంలో ఉన్న హాస్పిటల్‌కు పంపించారు. అక్కడ మూడు నెలలు మంచం మీదే ఉన్నాను. తల కదిలించగలను కాని భుజాల దగ్గర నుండి కింది భాగం కదిలించలేను. 20 సంవత్సరాల వయసుకే పూర్తిగా వేరే వాళ్ల సహాయం కావాల్సివచ్చింది. ఎంత బాధేసిందంటే, చచ్చిపోవాలనిపించింది.

చివరికి ఇంటికి పంపించారు. నన్ను ఎలా చూసుకోవాలో అన్నీ మా అమ్మానాన్నలకు చెప్పారు. కానీ వాళ్లు శారీరకంగా మానసికంగా నాకోసం చాలా కష్టపడాల్సివచ్చింది. సంవత్సరం గడిచాక నేను మానసికంగా బాగా దెబ్బతిన్నాను. డాక్టర్లు సలహాలిచ్చాక పరిస్థితులను అర్థం చేసుకుని బాధపడడం తగ్గించాను.

జీవితం గురించి కూడా చాలా ఆలోచించడం మొదలుపెట్టాను. జీవితానికి అర్థం ఉందా? నాకెందుకు ఇలా జరిగింది? అని తెలుసుకోడానికి పుస్తకాల్లో, పత్రికల్లో వెతికాను. బైబిలు చదవడానికి కూడా ప్రయత్నించాను కానీ అర్థం చేసుకోవడం కష్టంగా ఉండి తీసి లోపల పెట్టేశాను. ఒక పాస్టర్‌తో కూడా మాట్లాడాను, కానీ సరైన జవాబు దొరకలేదు.

అప్పుడు 1994లో ఇద్దరు యెహోవాసాక్షులు వచ్చి మా నాన్నను కలిసారు. ఆయన వాళ్లను నాతో మాట్లాడమన్నాడు. లోకాన్ని అందంగా మార్చి రోగాలు, బాధలు తీసేయాలనే దేవుని ఉద్దేశం గురించి వాళ్లు చెప్తుంటే విన్నాను. వినడానికి బాగుంది కాని నమ్మబుద్ధి కాలేదు. అయినా వాళ్లిచ్చిన రెండు పుస్తకాలు తీసుకుని చదివాను. వారానికి ఒకసారి వచ్చి బైబిలు విషయాలు మాట్లాడతామంటే ఒప్పుకున్నాను. వాళ్లు ప్రార్థన చేయడం కూడా అలవాటు చేసుకోమన్నారు.

దేవుడు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదని, నన్ను చూసుకుంటున్నాడనే నమ్మకం కలిగింది

వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకున్న చాలా సందేహాలకు జవాబు బైబిల్లో దొరికింది. దేవుడు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదని, నన్ను చూసుకుంటున్నాడనే నమ్మకం కలిగింది. రెండు సంవత్సరాలు బైబిలును బాగా తెలుసుకున్నాను. 1997 సెప్టెంబరు 13న ఇంట్లో నీళ్ల టబ్‌లో బాప్తిస్మం తీసుకున్నాను. నా జీవితంలో సంతోషంగా ఉన్న రోజుల్లో అది ఒకటి.

2007లో నుండి బుడాపెస్ట్‌లో వికలాంగుల గృహంలో ఉంటున్నాను. ఇక్కడికి రావడం చాలా మంచిదైంది ఎందుకంటే నేను నేర్చుకున్న మంచి విషయాలను వేరేవాళ్లకు చెప్పే అవకాశం దొరికింది. వాతావరణం బాగున్నప్పుడు మోటారుతో నడిచే చక్రాల కుర్చీని నా తలతో నడిపిస్తూ బయటకు వెళ్లి అందరితో మాట్లాడుతుంటాను.

మా సంఘంలో ఒక కుటుంబం చేసిన సాయంతో లాప్‌టాప్‌ కొనుక్కున్నాను. నా వేళ్లు కదపలేను కాబట్టి ఆ లాప్‌టాప్‌ నా వేళ్లకు బదులు తల కదిలికలతో పనిచేస్తుంది. లాప్‌టాప్‌తో ఇంటర్నెట్‌ ఉపయోగించి ఫోన్లు చేస్తాను, మా సంఘ సభ్యులు వెళ్లినప్పుడు ఇంట్లో లేని వాళ్లకు ఉత్తరాలు రాస్తాను. ఇలా చేస్తుండడం వల్ల ఇతరులతో చక్కగా మాట్లాడడం నేర్చుకున్నాను, అంతేకాదు నా గురించే ఎక్కువగా ఆలోచించడం, బాధపడడం ఆపేశాను.

నా తల కదిలికలతో పనిచేసే లాప్‌టాప్‌తో ఇంటర్నెట్‌ ఉపయోగించి నేను తెలుసుకున్న వాటిని వేరేవాళ్లకు చెబుతుంటాను

ఆరాధించడానికి కూడా వెళ్తాను. అక్కడ సహోదరులు జాగ్రత్తగా నా చక్రాల కుర్చీని ఎత్తుకుని నన్ను మొదటి అంతస్తుకి తీసుకెళ్తారు. మీటింగ్‌లో అందరిలా నేను కూడా జవాబులు చెప్పడానికి నా పక్కన కూర్చున్న సహోదరుడు నా బదులు చెయ్యి ఎత్తుతాడు. నేను చెప్తున్నప్పుడు బైబిల్నిగాని పుస్తకాన్నిగాని పైకి పట్టుకుని చూపిస్తుంటాడు.

ఎప్పుడూ నొప్పిగా ఉంటుంది, ఎవరో ఒకరు దగ్గరుండి అన్నీ చేయాలి. నా పరిస్థితి వల్ల మనసులో తట్టుకోలేనంత బాధేస్తుంది. కానీ యెహోవా ఒక స్నేహితునిగా నేను చెప్పుకునేవన్నీ వింటాడని తెలుసు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. రోజూ బైబిలు చదవడం వల్ల, నాతోపాటు దేవున్ని ఆరాధించేవాళ్ల వల్ల బలం తెచ్చుకుంటాను. వాళ్ల స్నేహం, వాళ్లిచ్చిన మానసిక ధైర్యం, నాకోసం చేసే ప్రార్థనలు వీటన్నిటిని బట్టి అన్నిటిని తట్టుకుని నిలబడగలుగుతున్నాను.

నాకు సరిగ్గా అవసరమైనప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు. అంతేకాదు ఆయన తీసుకొచ్చే కొత్తలోకంలో మంచి ఆరోగ్యంతో ఉంటాననే నమ్మకం ఇచ్చాడు. నేను “నడుచుచు గంతులు వేయుచు” ఆయన ప్రేమ, జాలిని బట్టి “దేవుని స్తుతించే” కాలం కోసం చాలా ఎదురుచూస్తున్నాను.—అపొస్తలుల కార్యములు 3:6-9. ◼ (g14-E 11)