కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ జీవితం, స్నేహం

కుటుంబ జీవితం, స్నేహం

కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఉన్న అనుబంధాన్ని కాపాడుకోవడం చాలామందికి కష్టంగా అనిపిస్తోంది. ఇతరులతో మీకున్న సంబంధాల్ని మెరుగుపర్చుకోవడానికి సహాయపడే కొన్ని బైబిలు సూత్రాలు పరిశీలించండి.

స్వార్థంగా ఉండకండి

బైబిలు సూత్రం: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:4.

అంటే: వేరేవాళ్లు మనకోసం ఏం చేస్తారు అని కాకుండా, మనం వేరేవాళ్ల కోసం ఏం చేయవచ్చు అని ఆలోచించే వాళ్లకు ఇతరులతో మంచి సంబంధాలు ఉంటాయి. స్వార్థంగా ఉండడం వల్ల, ఇతరులతో మీకున్న సంబంధాలు దెబ్బతింటాయి. ఉదాహరణకు, స్వార్థం గల వ్యక్తులు తమ వివాహజతకు నమ్మకద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, తన దగ్గర ఉన్న వాటి గురించి, తనకు తెలిసిన వాటి గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వ్యక్తితో స్నేహం చేయాలని ఎవరూ కోరుకోరు. అందుకే, ద రోడ్‌ టు క్యారెక్టర్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “తమ గురించే ఆలోచించుకుంటూ, ఇతరుల గురించి ఏమాత్రం ఆలోచించని వ్యక్తులు చాలా సమస్యల్లో చిక్కుకుంటారు.”

మీరేం చేయవచ్చు:

  • ఇతరులకు సహాయం చేయండి. మంచి స్నేహితులు ఎప్పుడూ ఒకరినొకరు నమ్ముతారు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసేవాళ్లు డిప్రెషన్‌తో (కృంగుదలతో) బాధపడే అవకాశాలు తక్కువని, వాళ్లు ఆత్మ గౌరవంతో జీవిస్తారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

  • సహానుభూతి చూపించండి. వేరేవాళ్ల బాధను మన మనసులో అనుభవించడమే సహానుభూతి అని చెప్తుంటారు. మీరు సహానుభూతి చూపించడం అలవాటు చేసుకుంటే, ఇతరులను బాధపెట్టేలా వ్యంగ్యంగా మాట్లాడడం మానుకుంటారు. వ్యంగ్యంగా మాట్లాడే మాటలు సరదాగా అనిపించవచ్చు, కానీ అవి ఎదుటివ్యక్తి మనోభావాల్ని గాయపరుస్తాయి.

    సహానుభూతి చూపించడం అలవాటు చేసుకుంటే, తేడాలు చూపించడం కూడా మానుకుంటారు. అంటే, సహానుభూతి చూపించడం వల్ల మీరు పక్షపాతం, వివక్ష చూపించకుండా అన్ని సంస్కృతుల వాళ్లతో, అన్ని నేపథ్యాల వాళ్లతో స్నేహం చేస్తారు.

  • సమయం గడపండి. మీరు ఇతరులతో ఎంత ఎక్కువ సమయం గడిపితే మీకు వాళ్ల గురించి అంత ఎక్కువ తెలుస్తుంది. మీకు ఒక మంచి స్నేహితుడు కావాలంటే, అతను వేటి గురించి ఆలోచిస్తున్నాడో, అతనికి ఏవి ముఖ్యమైనవో వాటి గురించి మీరు మాట్లాడాలి. కాబట్టి చక్కగా వినండి. మీ స్నేహితుడు చెప్పే వాటిమీద శ్రద్ధపెట్టండి. ఈ మధ్య చేసిన ఒక పరిశోధన ఇలా తెలియజేస్తుంది: “మనసువిప్పి మాట్లాడుకోవడం వల్ల ప్రజలు మరింత సంతోషంగా ఉండగలరు.”

మంచివాళ్లతో స్నేహం చేయండి

బైబిలు సూత్రం: “చెడు సహవాసాలు మంచి నైతిక విలువల్ని పాడుచేస్తాయి.”—1 కొరింథీయులు 15:33, అధస్సూచి.

అంటే: మీరు ఎవరితో స్నేహం చేస్తారో వాళ్ల ప్రభావం మీపై ఖచ్చితంగా పడుతుంది, అది మంచైనా, చెడైనా. ఆ ప్రభావం మీ జీవితంపై కూడా పడుతుందని మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉదాహరణకు, మీ చుట్టూ పొగతాగేవాళ్లు, విడాకులు తీసుకునేవాళ్లు ఉంటే, మీరు కూడా పొగతాగే, విడాకులు తీసుకునే ప్రమాదంలో పడవచ్చు.

మీరేం చేయవచ్చు: మీరు ఎలాంటి లక్షణాల్ని, విలువల్ని ఇష్టపడతారో అవి ఉన్న వాళ్లతోనే స్నేహం చేయండి. ఉదాహరణకు, ఇతరులతో నేర్పుగా, గౌరవంగా నడుచుకుంటూ, ఉదారతను, ఆతిథ్య స్ఫూర్తిని చూపించేవాళ్లతో స్నేహం చేయండి.

ఇంకొన్ని బైబిలు సూత్రాలు

దంపతులకు, యువతకు, పిల్లలకు సహాయం చేసేలా తయారుచేసిన బైబిలు వీడియోల్ని చూడండి

బాధపెట్టే మాటలు అనకండి.

“ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి.”—సామెతలు 12:18, NW.

ఉదారత చూపించండి.

“ఉదారంగా ఇచ్చేవాళ్లు వర్ధిల్లుతారు.”—సామెతలు 11:25, NW.

ఇతరులు మీతో ఎలా ఉండాలని అనుకుంటారో మీరూ వాళ్లతో అలాగే ఉండండి.

“ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించాలి.”—మత్తయి 7:12.