కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?

ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?

ఒత్తిడి నుండి బయటపడాలంటే మీ ఆరోగ్యం గురించి, ఇతరులతో మీరెలా వ్యవహరిస్తారనే దానిగురించి, జీవితంలో మీ లక్ష్యాల గురించి, మీకు ముఖ్యమైనవాటి గురించి ఆలోచించాలి. ఈ ఆర్టికల్‌లో మీకు ఉపయోగపడే కొన్ని సూత్రాల్ని పరిశీలిస్తాం. వాటిని తెలుసుకుంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేయాలో, దాన్ని ఎలా తగ్గించుకోవాలో మీకు అర్థమౌతుంది.

రేపటి గురించి ఇవాళే ఆందోళనపడడం మానేయండి

“రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి.”—మత్తయి 6:34.

అంటే: మనకు ఏవోక ఆందోళనలు ప్రతీరోజు ఉంటూనే ఉంటాయి. అయితే, రేపటి ఆందోళనల గురించి ఆలోచించి ఈరోజు ఉన్న ఆందోళనల్ని పెంచుకోకండి. బదులుగా, ఏ రోజు గురించి ఆ రోజే ఆలోచించడానికి ప్రయత్నించండి.

  • ఒత్తిడి వల్ల ఆందోళన కలగవచ్చు. కాబట్టి ఇలా చేసి చూడండి: మొదటిగా, కొంతవరకు ఒత్తిడి ఉండడం మామూలే అని గుర్తించండి. మీరు ఏమీ చేయలేని విషయాల గురించి అదే పనిగా ఆలోచించడం వల్ల మీ ఒత్తిడి ఎక్కువౌతుంది. రెండోదిగా, అన్నిసార్లూ మనం భయపడినట్టుగా జరగకపోవచ్చని గుర్తుంచుకోండి.

మీ నుండి, ఇతరుల నుండి మరీ ఎక్కువ ఆశించకండి

‘పరలోకం నుండి వచ్చే తెలివి సహేతుకమైనది.’—యాకోబు 3:17, అధస్సూచి.

అంటే: ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండాలని అనుకోకండి. మీరు చేయగలిగినవే చేయండి, అలాగే ఇతరుల విషయంలో కూడా ఎక్కువ ఆశించకండి.

  • మీరేమి చేయగలరో ఏమి చేయలేరో గుర్తించండి, పాటించగల ప్రమాణాల్నే పెట్టుకోండి. మీ పరిమితులు, ఇతరుల పరిమితులు తెలుసుకోండి. అప్పుడు మీకూ అలాగే ఇతరులకూ ఒత్తిడి తగ్గుతుంది, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొన్నిసార్లు మీరు చమత్కారంగా ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా అలా ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, మీ మనసు కాస్త తేలికపడుతుంది.

మీకు వేటివల్ల ఒత్తిడి కలుగుతుందో తెలుసుకోండి

“వివేచన గలవాడు ప్రశాంతంగా ఉంటాడు.”—సామెతలు 17:27.

అంటే: కోపం, కంగారు, అసహనం వంటి వాటివల్ల మనం సరిగ్గా ఆలోచించలేకపోతాం, కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి.

  • మీకు ఏవి ఒత్తిడి కలిగిస్తున్నాయో తెలుసుకొని, వాటికి మీరెలా స్పందిస్తున్నారో గుర్తించండి. ఉదాహరణకు, ఒత్తిడిగా అనిపించినప్పుడు మీ ఆలోచనలు, భావాలు, ప్రవర్తన ఎలా ఉన్నాయో గమనించండి, వీలైతే వాటిని ఎక్కడైనా రాసుకోండి. ఒత్తిడి కలిగినప్పుడు మీరు స్పందించే తీరు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఒత్తిడి కలిగినప్పుడు ఏం చేయాలో అంత బాగా అర్థమౌతుంది. మీకు ఒత్తిడి కలిగించేవాటికి ఎలా దూరంగా ఉండవచ్చో కూడా ఆలోచించండి. వాటికి దూరంగా ఉండడం కుదరదు అనిపిస్తే, కనీసం వాటి ప్రభావం మీమీద ఎక్కువ పడకుండా చూసుకునే మార్గాల్ని వెదకండి. ఉదాహరణకు, ఏదైనా పనిని ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నించండి, సమయం వృథా అవ్వకుండా చూసుకోండి.

  • విషయాల్ని కొత్త కోణంలో చూడడానికి ప్రయత్నించండి. మనకు ఒత్తిడి కలిగించే కొన్ని విషయాలు వేరేవాళ్లకు ఒత్తిడి కలిగించకపోవచ్చు. దానికి కారణం మనం చూసే విధానమే. ఈ మూడు సలహాల్ని పరిశీలించండి:

    1. తొందరపడి ఎదుటివాళ్ల ఉద్దేశాన్ని తప్పుబట్టకండి. ఉదాహరణకు, మీరు క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నట్టుండి వచ్చి మీ ముందు నిలబడ్డాడనుకోండి. అతను దురుసుగా ప్రవర్తించాడని మీకు కోపం రావచ్చు. కానీ కాసేపు, అతను ఏదో సరైన కారణంతోనే అలా చేసివుంటాడని అనుకొని చూడండి. బహుశా అదే నిజం కావచ్చు.

    2. పరిస్థితిని ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో ఆలోచించండి. డాక్టర్‌ కోసం హాస్పిటల్‌లో, బస్సు కోసం బస్టాండ్‌లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు, ఏదైనా చదవడం లేదా మెయిల్స్‌ చూసుకోవడం వంటివి చేయండి. అప్పుడు మీకు ఎక్కువ విసుకురాదు.

    3. దూరదృష్టితో ఆలోచించండి. ‘ఈ సమస్య రేపటికల్లా లేదా వచ్చే వారానికల్లా నేను భయపడినంత పెద్ద సమస్యగా మారుతుందా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. త్వరగా తీరిపోయే చిన్నచిన్న సమస్యలకు, పెద్దపెద్ద సమస్యలకు మధ్య తేడా గుర్తించండి.

పనుల్ని క్రమపద్ధతిలో చేసుకోండి

“అన్నీ మర్యాదగా, పద్ధతి ప్రకారం జరగనివ్వండి.”—1 కొరింథీయులు 14:40.

అంటే: పనులన్నీ ఒక క్రమపద్ధతిలో చేయడం అలవాటు చేసుకోండి.

  • మన జీవితంలో అన్నీ, వీలైనంతవరకు ఒక క్రమపద్ధతిలో జరగాలనే కోరుకుంటాం. కానీ పనుల్ని వాయిదా వేయడం వల్ల వాటిని క్రమపద్ధతిలో చేయలేకపోవచ్చు, ఒత్తిడి కూడా కలగవచ్చు. ఆఖరికి మనం పూర్తిచేయాల్సిన పనుల లిస్టు పెరిగిపోవచ్చు. ఈ రెండు సలహాల్ని పాటించి చూడండి:

    1. మీకు పాటించడానికి వీలుగా ఉండే షెడ్యూల్‌ వేసుకోండి, దాని ప్రకారమే చేయండి.

    2. ఎలాంటి స్వభావం వల్ల మీరు పనులు వాయిదా వేస్తున్నారో గుర్తించి, దాన్ని సరిచేసుకోండి.

జీవితంలో దేనికి ఇవ్వాల్సిన స్థానం దానికి ఇవ్వండి

“రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాస ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు.”—ప్రసంగి 4:6.

అంటే: పనే లోకంగా జీవించేవాళ్లు తాము చేసిన కష్టం వల్ల వచ్చే ప్రయోజనాలను ఆనందించలేరు. ఎందుకంటే, వాళ్లు సంపాదించిన దాన్ని అనుభవించడానికి వాళ్లకు శక్తి, సమయం మిగలకపోవచ్చు.

  • పని, డబ్బు విషయంలో సరైన ఆలోచనా విధానాన్ని కలిగివుండండి. ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ సంతోషం, తక్కువ ఒత్తిడి ఉంటుందని అనుకోకండి. నిజానికి, పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రసంగి 5:12 లో ఇలా ఉంది, “ధనవంతుని సమృద్ధి అతన్ని నిద్రపోనివ్వదు.” కాబట్టి ఉన్నంతలో జీవించడానికి ప్రయత్నించండి.

  • సేదదీరడానికి సమయం తీసుకోండి. మీకు ఆహ్లాదాన్నిచ్చే పనుల్ని చేసినప్పుడు మీ ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఏ పనీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ఊరికే కూర్చుని టీవీ చూడడం లాంటివి ఒత్తిడిని తగ్గించకపోవచ్చు.

  • టెక్నాలజీని దాని స్థానంలో ఉంచండి. అదేపనిగా మెయిల్స్‌, మెసెజ్‌లు, సోషల్‌ మీడియా సైట్లు చూస్తూ ఉండకండి. మీరు ఆఫీసు నుండి వచ్చేశాక, మరీ అవసరమైతే తప్ప ఆఫీసుకు సంబంధించిన మెయిల్స్‌ చూడకండి.

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి

“శారీరక వ్యాయామం . . . ప్రయోజనకరం.”—1 తిమోతి 4:8, అధస్సూచి.

అంటే: క్రమంగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

  • ఆరోగ్యకరమైన అలవాట్లను వృద్ధి చేసుకోండి. వ్యాయామం చేయడం వల్ల మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది దానివల్ల ఒత్తిడికి అతిగా స్పందించరు. పౌష్టికాహారం తీసుకోండి, భోజనాన్ని ఎగ్గొట్టకండి, సరిపడా నిద్రపోండి.

  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి పొగతాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, మద్యం ఎక్కువ తాగడం వంటి హానికరమైన అలవాట్లకు బానిసలవ్వకండి. వాటికి అలవాటు పడితే కొంతకాలానికి మీ ఆరోగ్యం పాడౌతుంది, డబ్బులు పోగొట్టుకుంటారు. అప్పుడు మీ ఒత్తిడి ఇంకా పెరుగుతుంది.

  • ఒకవేళ మీకు భరించలేనంత ఒత్తిడి ఉంటే డాక్టర్‌ని సంప్రదించండి. అలా డాక్టర్‌ సహాయం తీసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమేమీ కాదు.

ముఖ్యమైన పనులేంటో గుర్తించండి

‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:10.

అంటే: ముఖ్యమైన పనులేవో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

  • ఏ పనులు ముందు చేయాలో, ఏ పనులు తర్వాత చేయాలో లిస్టు రాసుకోండి. అప్పుడు ఎక్కువ ప్రాముఖ్యమైన పనుల మీద మనసుపెట్టడడం మీకు వీలౌతుంది. అంతేకాదు ఏ పనులు వెంటనే చేయాల్సిన అవసరంలేదో, ఏ పనులు వేరేవాళ్లకు అప్పగించవచ్చో, ఏవి అసలు చేయకపోయినా ఫర్లేదో మీకు తెలుస్తుంది.

  • ఒక వారం రోజులపాటు, ప్రతీరోజు మీరు చేసిన పనుల గురించి రాయండి. తర్వాత సమయం వృథా అవ్వకూడదంటే ఏం చేయవచ్చో ఆలోచించండి. సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే, మీకు అంత తక్కువ ఒత్తిడి ఉంటుంది.

  • విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించండి. పని మధ్యలో చిన్నచిన్న విరామాలు కూడా, తిరిగి మీకు శక్తినిచ్చి మీ ఒత్తిడిని తగ్గించగలవు.

సహాయం తీసుకోండి

“హృదయంలో ఉన్న ఆందోళన దాన్ని కృంగదీస్తుంది, మంచి మాట దాన్ని సంతోషపెడుతుంది.”—సామెతలు 12:25.

అంటే: ఇతరులు దయగా, కనికరంతో మాట్లాడే మాటలు మీ మనసును తేలిక చేస్తాయి.

  • మిమ్మల్ని అర్థంచేసుకునేవాళ్లకు మీ పరిస్థితి గురించి చెప్పండి. మీకు నమ్మకంగా ఉండేవాళ్లు మీరు విషయాలను వేరే కోణంలో చూడడానికి సహాయం చేయవచ్చు. అలాగే మీరు ఆలోచించలేకపోయిన పరిష్కారాన్ని కూడా మీ దృష్టికి తేవచ్చు. ఒకవేళ వాళ్లు అలా సహాయం చేయలేకపోయినా, కేవలం మీ ఆందోళనను పంచుకోవడం వల్ల కూడా మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది.

  • సహాయం కోసం అడగండి. మీకున్న ఒక పనిని వేరేవాళ్లకు అప్పగించండి, లేదా మీ పని భారాన్ని వేరేవాళ్లతో పంచుకోండి.

  • మీ తోటి ఉద్యోగి మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటే, దాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు వెదకండి. ఉదాహరణకు, వాళ్ల ప్రవర్తన వల్ల మీకు ఎలా అనిపిస్తుందో మృదువుగా, నొప్పించకుండా చెప్పి చూడండి. (సామెతలు 17:27) అప్పుడు కూడా వాళ్లలో మార్పు రాకపోతే, వాళ్లతో వీలైనంత తక్కువ సమయం గడపండి.

దేవుని నిర్దేశం మీకు అవసరమని గుర్తించండి

“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.

అంటే: మనకు ఆహారం, బట్టలు, ఇల్లు మాత్రమే కాదు దేవుని నిర్దేశం కూడా అవసరం. మనం సంతోషంగా ఉండాలంటే ఆ అవసరాన్ని గుర్తించి, దాన్ని తీర్చుకోవాలి.

  • ప్రార్థన మనకు చాలా సహాయం చేయగలదు. ‘దేవునికి మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయమని’ చెప్తున్నాడు. (1 పేతురు 5:7) ప్రార్థన చేసుకోవడం, దేవుని విషయాల గురించి లోతుగా ఆలోచించడం వల్ల మనం మనశ్శాంతిని పొందుతాం.—ఫిలిప్పీయులు 4:6, 7.

  • మిమ్మల్ని దేవునికి దగ్గర చేసేవాటిని చదవండి. బైబిలు చదవడం ద్వారా దేవుని నిర్దేశం పొందవచ్చు. ఈ పత్రికలో చర్చించిన సూత్రాలు బైబిల్లో నుండి తీసుకోబడ్డాయి. మనం “తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని” వృద్ధి చేసుకోవడానికి ఆ సూత్రాలు సహాయం చేస్తాయి. (సామెతలు 3:21) కాబట్టి, బైబిలు చదవాలనే లక్ష్యం మీరు పెట్టుకోండి! బైబిలు చదవడం మొదలుపెట్టడానికి సామెతలు పుస్తకం బాగుంటుంది.