కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాస్‌లిన్‌, సీషెల్స్‌: 1881 లో జనరల్‌ గొర్డెన్‌ ఇక్కడ ఏదెను తోటను కనుక్కున్నానని అనుకున్నాడు

భూమి మీద పరదైసు ఊహ లేదా నిజమా?

భూమి మీద పరదైసు ఊహ లేదా నిజమా?

పరదైసు! అంటే ఏమిటి? అందమైన పార్క్‌ లాంటి ప్రదేశం! రంగురంగుల ట్రావెల్‌ బ్రోషుర్లు మనం “పరదైసు” లాంటి అందమైన ప్రాంతాలకు ఎక్కడికో వెళ్లి ప్రశాంతంగా గడుపుతూ, మనకున్న కష్టాలను సమస్యలను మర్చిపోవచ్చని మనల్ని ఆశ పెడుతుంటాయి. కానీ తిరిగి ఇంటికి వచ్చాక నిజ జీవితంలో, టూర్‌కు వెళ్లకముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవే ఉంటాయని మనకు బాగా తెలుసు.

భూమంతా అందమైన పార్కులా మారుతుందంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ భూమి నిజంగా పరదైసుగా మారుతుందా? లేదా అది ఊహ మాత్రమేనా?

పరదైసు గురించి . . .

వందల సంవత్సరాలుగా ప్రజలు పరదైసు అంటే చాలా ఆసక్తి చూపిస్తూ వచ్చారు. “తూర్పున ఏదెనులో ఒక తోట” గురించి బైబిల్లో ఉండడం వల్ల చాలామందికి ఆ ఆసక్తి మొదలైంది. ఆ తోట వాళ్లకు ఎందుకు అంత ఇష్టమైంది? దాని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును . . . నేలనుండి మొలిపించెను.” ఆ తోట ఎంతో సంతోషాన్ని ఇచ్చే మంచి ప్రదేశం. ఇంకా ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, ‘ఆ తోటమధ్య జీవవృక్షము’ కూడా ఉంది.—ఆదికాండము 2:8, 9.

దానితోపాటు ఆ తోటలో నుండి నాలుగు నదులు ప్రవహిస్తున్నాయని ఆదికాండము పుస్తకం చెప్తుంది. వాటిలో రెండు నదులు టైగ్రీస్‌ (లేదా హిద్దెకెలు), యూఫ్రటీసు మనకు ఇప్పటికీ తెలుసు. (ఆదికాండము 2:10-14) ఈ రెండు నదులు ఇరాక్‌ నుండి పర్షియా సింధుశాఖలోకి ప్రవహిస్తున్నాయి. ఇరాక్‌ ఒకప్పుడు ప్రాచీన పర్షియాలో భాగంగా ఉండేది.

అందుకే, పర్షియా సాంస్కృతిక సాంప్రదాయంలో భూమ్మీద పరదైసు ముఖ్య భాగం. అమెరికా పెన్సిల్వేనియాలో ఉన్న ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌లో 16వ శతాబ్దానికి చెందిన పర్షియా తివాచిపై చెట్లు, పువ్వులతో చుట్టూ గోడలున్న ఉద్యానవనం అల్లి ఉంటుంది. “చుట్టు గోడలున్న ఉద్యానవనం” లేదా వాల్డ్‌ గార్డెన్స్‌కు పర్షియా భాషలో “పరదైసు” అనే అర్థం కూడా ఉంది. ఆ తివాచి మీద ఉన్న దృశ్యం బైబిల్లో ఉన్న అందమైన అద్భుతమైన ఏదెను తోటలానే ఉంటుంది.

ప్రపంచమంతటా చాలా భాషల్లో, సంస్కృతుల్లో పరదైసు గురించిన కథలు రకరకాలుగా చెప్తుంటారు. మానవ కుటుంబం భూమ్మీద వేర్వేరు ప్రాంతాలకు వ్యాపించినప్పుడు ఆ వృత్తాంతానికి సంబంధించిన కథల్ని వాళ్లతోపాటు తీసుకెళ్లారు. శతాబ్దాలు గడుస్తుండగా ఆ కథలు స్థానికంగా వచ్చిన నమ్మకాలతో, పురాణాలతో కలిసిపోయాయి. ఈ రోజుకి కూడా అందమైన ప్రదేశాలను చూసినప్పుడు చాలామంది వెంటనే పరదైసు అని అంటుంటారు.

పరదైసు కోసం అన్వేషణ

కొంతమంది అన్వేషకులు మొదట్లో ఉన్న పరదైసును కనుక్కున్నామని చెప్తుంటారు. ఉదాహరణకు బ్రిటీష్‌ సైనిక అధికారి చార్లెస్‌ గొర్డెన్‌ 1881 లో సీషెల్స్‌ని సందర్శించాడు, వాలీ డ మా అనే ప్రాంతానికి ఉన్న గొప్ప అందాన్ని చూసి ఎంతో ముగ్దుడై ఆయన దాన్ని ఏదెను తోట అని ప్రకటించాడు. ఇప్పుడు అది ఒక వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌. 15వ శతాబ్దంలో ఇటలీకి చెందిన  నౌక నిర్దేశకుడు క్రిస్టఫర్‌ కొలంబస్‌ హిస్పాన్యోలా ద్వీపాన్ని అంటే ఇప్పటి డొమినికన్‌రిపబ్లిక్‌, హయిటీ ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు అతను ఏదెను తోటను కనిపెట్టేశాడని అనుకున్నాడు.

మ్యాపింగ్‌ పారడైస్‌ అనే ఆధునిక చరిత్ర పుస్తకంలో 190 కన్నా ఎక్కువ ప్రాచీన మ్యాప్‌ల వివరాలు ఉన్నాయి. వాటిలో చాలా మ్యాప్‌లు ఏదెనులో ఆదాము, హవ్వ ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఒక ప్రత్యేక మ్యాప్‌ 13వ శతాబ్దంలో లీయబానకు చెందిన బాయాటూస్‌ రాతప్రతి నకలు. దాని పైభాగంలో ఒక బాక్స్‌ గుర్తు ఉంది. దాని మధ్యలో పరదైసు అని రాసి ఉంటుంది. అక్కడ నుండి టైగ్రిస్‌, యూఫ్రటీసు, సింధు, యొర్దాను అని రాసి ఉన్న నాలుగు నదులు నాలుగు మూలలకు వెళ్తాయి. క్రైస్తవత్వం భూమ్మీద నాలుగు మూలలకు వ్యాపించడాన్ని అది సూచిస్తుందని అంటారు. ఒకప్పటి పరదైసు ఎక్కడ ఉందో సరిగ్గా తెలీకపోయినా దాని జ్ఞాపకాలు మాత్రం ఆకర్షణీయంగా ఉండిపోయాయని ఇలాంటి బొమ్మలు చూపిస్తున్నాయి.

జాన్‌ మిల్టన్‌ అనే 17వ శతాబ్దానికి చెందిన ఇంగ్లీష్‌ కవి పారడైజ్‌ లాస్ట్‌ అనే కవితతో అందరికీ పరిచయం. ఆదికాండము పుస్తకంలో ఉన్న ఆదాము పాపం గురించి, ఏదెను నుండి బయటకు పంపించడం గురించి ఆ కవితలో ఉంది. అందులో భూమి మీద మనుషులు నిత్యం జీవించే అవకాశాన్ని మళ్లీ పొందుతారనే వాగ్దానం గురించి చెప్తూ జాన్‌ మిల్టన్‌ ఇలా అన్నాడు: “అప్పుడు భూమి అంతా పరదైసుగా అవుతుంది.” ఆ పుస్తకానికి తర్వాతి భాగంగా పారడైజ్‌ రిగెయిన్డ్‌ అనే ఇంకో కవిత మిల్టన్‌ రాశాడు.

ఆలోచనలో మార్పు

మానవ చరిత్రలో భూమి మీద కనుమరుగైపోయిన పరదైసు ప్రజల్లో ఎంతో ఆసక్తిని కలిగించిన విషయం. మరి ఇప్పుడు దాన్ని ఎందుకు అంతగా పట్టించుకోవడం లేదు. ఈ విషయం గురించి మ్యాపింగ్‌ పారడైస్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది, “వేదాంతులు . . . పరదైసు ఎక్కడ ఉందనే విషయాన్ని కావాలనే వదిలేశారు.”

చర్చీకి వెళ్లే చాలామందికి వాళ్లు చివరికి చేరేది పరలోకమనే చెప్తారు కానీ భూమి మీద పరదైసు జీవితం గురించి చెప్పరు. కానీ బైబిలు కీర్తన 37:29 లో ఇలా చెప్తుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” ఇప్పుడు భూమి పరదైసులానే లేదు కాబట్టి, ఆ వాగ్దానం నెరవేరుతుందని ఎలా నమ్మాలి? a

భూమి అంతా పరదైసుగా మారుతుందనే వాస్తవం

పరదైసు కనుమరుగైపోయినా దాన్ని సృష్టించిన యెహోవా దేవుడు పరదైసును మళ్లీ తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఎలా? యేసు నేర్పించిన ప్రార్థనను గుర్తుచేసుకోండి: “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి.” (మత్తయి 6:10) ఆ రాజ్యం యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న ప్రపంచ ప్రభుత్వం, అది మనుషుల పరిపాలన అంతటినీ తీసేస్తుంది. (దానియేలు 2:44) ఆ రాజ్య పరిపాలనలో పరదైసు భూమి గురించిన దేవుని ఉద్దేశం ‘నెరవేరుతుంది.’

ప్రవక్త అయిన యెషయా వాగ్దానం చేయబడిన పరదైసులో ఉండే పరిస్థితుల గురించి ముందే చెప్పాడు, అక్కడ ఈ రోజుల్లో మనుషులను బాధపెట్టే ఒత్తిడి, గొడవలు ఇక ఉండవు. (యెషయా 11:6-9; 35:5-7; 65:21-23) కాస్త సమయం తీసుకుని మీరు మీ బైబిల్లో ఆ వచనాలు చదవాలని కోరుతున్నాము. అలాచేస్తే, విధేయులైన మనుషులందరికీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల మీద మీ నమ్మకం పెరుగుతుంది. అక్కడ ఉండేవాళ్లు ఆదాము పోగొట్టుకున్న పరదైసుని, దేవుని ఆమోదాన్ని రెండింటిని ఆనందిస్తారు.—ప్రకటన 21:3.

భూమి మీద పరదైసు ఒక ఊహ కాదు నిజమని మనమెలా నమ్మవచ్చు? బైబిలు ఇలా చెప్తుంది: “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” భూమి మీద పరదైసు గురించిన నిరీక్షణను “అబద్ధమాడలేని దేవుడు ఎంతోకాలం క్రితమే వాగ్దానం చేశాడు.” (కీర్తన 115:16; తీతు 1:2) శాశ్వతమైన పరదైసు అనే అద్భుతమైన ఆశీర్వాదాన్ని బైబిలు ఇస్తుంది.

a ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఖురాన్‌లో సురహ్‌ 21, అల్‌-అంబియా’ [ప్రవక్తలు] 105వ వచనంలో, “ఈ భూమికి సద్వర్తునులైన నాదాసులు వారసులవుతారని” ఉంది.