కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని గురించి ప్రవక్తల నుండి నేర్చుకోగల విషయాలు

దేవుని గురించి ప్రవక్తల నుండి నేర్చుకోగల విషయాలు

పూర్వకాలంలో, దేవుడు మనుషులకు చెప్పమని ప్రవక్తలకు కొన్ని ముఖ్యమైన సందేశాలు తెలియజేశాడు. దేవుడిచ్చే దీవెనలు పొందాలంటే ఏం చేయాలో ఈ సందేశాలు తెలియజేస్తాయా? అవును, తెలియజేస్తాయి. ముగ్గురు నమ్మకమైన ప్రవక్తల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

అబ్రాహాము

దేవునికి పక్షపాతం లేదు, తానిచ్చే దీవెనలు మనుషులందరూ పొందాలని కోరుకుంటున్నాడు.

ప్రవక్త అయిన అబ్రాహాముకు దేవుడు ఇలా మాటిచ్చాడు: “భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ నీ ద్వారా ఖచ్చితంగా దీవించబడతాయి.”—ఆదికాండం 12:3.

దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? దేవునికి మనమీద చాలా ప్రేమ ఉంది. తన మాట వినే పురుషులను, స్త్రీలను, పిల్లలను, అందర్నీ దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు.

మోషే

దేవుడు కరుణగలవాడు, తన గురించి తెలుసుకోవడానికి కృషి చేసేవాళ్లను దీవిస్తాడు.

ప్రవక్త అయిన మోషేకు సర్వశక్తిగల దేవుడు గొప్ప అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. అయినప్పటికీ, మోషే ఇలా ప్రార్థించాడు: “నీ మార్గాలు నాకు తెలియజేయి. అప్పుడు నేను నిన్ను తెలుసుకొని, ఇలాగే నీ దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉంటాను.” (నిర్గమకాండం 33:13) మోషే అడిగిన విన్నపం దేవునికి నచ్చింది. అందుకే ఆయనకు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు; తన మార్గాల్ని, లక్షణాల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. ఉదాహరణకు, సృష్టికర్త ‘కరుణ, కనికరం గల దేవుడని’ మోషే తెలుసుకున్నాడు.—నిర్గమకాండం 34:6, 7.

దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? తన గురించి ఎక్కువ తెలుసుకోవడానికి కృషి చేసే వాళ్లందర్నీ, అంటే పురుషులను, స్త్రీలను, పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. ఆయనను ఎలా ఆరాధించాలో తన పవిత్ర లేఖనాల్లో తెలియజేశాడు. అంతేకాదు, మనకు తన అనుగ్రహాన్ని, దీవెనల్ని ఇవ్వాలని ఎంతగా కోరుకుంటున్నాడో కూడా అందులో చెప్పాడు.

యేసు

యేసు కనికరంతో అన్నిరకాల జబ్బుల్ని నయం చేశాడు

యేసు గురించి, ఆయన పనుల గురించి, బోధల గురించి నేర్చుకుంటే దేవుడిచ్చే దీవెనల్ని శాశ్వతకాలం ఆనందిస్తాం.

యేసు జీవితం గురించి, బోధల గురించి ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. దేవుడు ఇచ్చిన శక్తితో యేసు గుడ్డివాళ్లను, చెవిటివాళ్లను, కుంటివాళ్లను బాగుచేయడం లాంటి ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. చనిపోయినవాళ్లను కూడా ఆయన తిరిగి బ్రతికించాడు. ఆ విధంగా, దేవుడు భవిష్యత్తులో మనుషులకు ఇవ్వబోయే దీవెనల్ని యేసు ముందుగానే చూపించాడు. మనలో ప్రతీఒక్కరం ఆ దీవెనల్ని ఎలా పొందవచ్చో యేసు వివరించాడు: “ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.”—యోహాను 17:3.

యేసు ఎంతో కనికరం, దయ చూపించాడు. ఆయన ప్రేమతో ఇచ్చిన ఒక ఆహ్వానాన్ని విని పురుషులు, స్త్రీలు, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు గుంపులుగుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనిలా అన్నాడు: “నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు.” (మత్తయి 11:29) ఆయన కాలంలోని చాలామంది, ఆడవాళ్లను చిన్నచూపు చూసేవాళ్లు. కానీ యేసు మాత్రం ఆడవాళ్లతో దయగా, మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాడు.

దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? యేసు ప్రజలను చాలా ప్రేమించాడు. మనం ఒకరితో ఒకరం ఎలా ఉండాలో తన చక్కని ప్రవర్తన ద్వారా చూపించాడు.

యేసు దేవుడు కాదు

‘మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడని,’ యేసుక్రీస్తు దేవుని ప్రవక్తని పవిత్ర లేఖనాలు బోధిస్తున్నాయి. (1 కొరింథీయులు 8:6) దేవుడు తనకన్నా గొప్పవాడని, దేవుడే తనను భూమ్మీదకు పంపించాడని యేసు స్పష్టంగా చెప్పాడు.—యోహాను 11:41, 42; 14:28. *

^ పేరా 17 యేసుక్రీస్తు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి దేవుడు చెప్తున్న మంచివార్త! బ్రోషురులో 4వ పాఠం చూడండి. ఈ బ్రోషురు కోసం www.pr418.com/te చూడండి.