కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

యేసు నమ్మకమైన అనుచరుల్లో కొంతమంది దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలౌతుందో తెలుసుకోవాలనుకున్నారు. కానీ, అది భూమ్మీద ఖచ్చితంగా ఎప్పుడు పరిపాలిస్తుందో వాళ్లు తెలుసుకోలేరని యేసు చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 1:6, 7) అయితే కొన్ని నిర్దిష్ట సంఘటనలన్నీ ఒకేసారి జరగడం చూసినప్పుడు ‘దేవుని రాజ్యం దగ్గరపడిందని,’ ఆ రాజ్యం ఈ లోకాన్ని పరిపాలించే సమయం వచ్చేసిందని తన అనుచరులు తెలుసుకుంటారని ఆయన అంతకుముందు ఓసారి చెప్పాడు.—లూకా 21:31.

ఎలాంటి సంఘటనలు జరుగుతాయని యేసు చెప్పాడు?

యేసు ఇలా చెప్పాడు: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. తీవ్రమైన భూకంపాలు వస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి.” (లూకా 21:10, 11) గీతలన్నీ కలిపితే వేలిముద్ర తయారైనట్టే, ఈ సంఘటనలన్నీ కలిపి ఒక స్పష్టమైన సూచనగా ఉంటాయి. వేలిముద్రతో ఒక వ్యక్తిని ఎలాగైతే గుర్తుపట్టవచ్చో అలాగే ఆ సంఘటనల్ని బట్టి, ‘దేవుని రాజ్యం దగ్గరపడిందని’ చెప్పవచ్చు. అలాంటి సంఘటనలన్నీ ఒకేసారి జరిగాయా? అవి ప్రపంచమంతటా జరుగుతున్నాయా? రుజువును పరిశీలించండి.

1. యుద్ధాలు

1914 లో మానవ చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో యుద్ధం జరిగింది! ఆ సంవత్సరాన్ని చరిత్రలో ఒక మైలు రాయని చరిత్రకారులు అంటారు, ఎందుకంటే మొదటి ప్రపంచయుద్ధం మొదలైంది ఆ సంవత్సరంలోనే. ఆ యుద్ధంలో మొట్టమొదటిసారి భారీ యుద్ధ ట్యాంకులు, వైమానిక బాంబులు, మెషీన్‌ గన్‌లు, విషవాయువులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించబడ్డాయి. అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో తొలిసారిగా అణుబాంబులు ప్రయోగించబడ్డాయి. 1914 నుండి ఏదోక చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ యుద్ధాల్లో కోట్లమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

2. భూకంపాలు

ప్రతీ ఏటా వచ్చే భూకంపాల్లో “భారీ నష్టాన్ని” కలగజేసేవి దాదాపు 100 ఉంటున్నాయని బ్రిటానికా అకాడమిక్‌ చెప్తుంది. యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ఇలా నివేదించింది: “దీర్ఘకాల నివేదికల ప్రకారం (సుమారు 1900 నుండి) మీరు ఏ సంవత్సరం తీసుకున్నా దాదాపు 16 పెద్ద భూకంపాలు సంభవిస్తాయని అర్థమౌతుంది.” భూకంపాలను పసిగట్టడానికి మంచి పద్ధతులు ఉన్నందువల్ల ఇప్పుడు భూకంపాలు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుందని కొంతమంది నమ్ముతున్నారు. అయినప్పటికీ వాస్తవమేమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సంభవించే భారీ భూకంపాలవల్ల ప్రజలు ముందెన్నడూ లేనన్ని బాధలు అనుభవిస్తున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు.

3. ఆహారకొరతలు

యుద్ధం, అవినీతి, ఆర్థిక పతనం, వ్యవసాయ పర్యవేక్షణలో లోటుపాట్లు లేదా భారీ ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారకొరతలు ఏర్పడుతున్నాయి. ద వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌కి చెందిన “2018 సంవత్సరపు నివేదిక” ఇలా పేర్కొంది: “ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల 10 లక్షలమంది సరిపడా ఆహారం లేక బాధపడుతున్నారు. 12 కోట్ల 40 లక్షలమంది ఆకలితో అలమటిస్తున్నారు.” కుపోషణతో ఏటా దాదాపు 31 లక్షలమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. 2011 లో ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన పిల్లల్లో దాదాపు 45 శాతం మంది కుపోషణ వల్లే చనిపోయారు.

4. రోగాలు, అంటువ్యాధులు

ఎ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రచురణ ఇలా పేర్కొంది: “21వ శతాబ్దం పెద్దపెద్ద అంటువ్యాధుల్ని ఇప్పటికే చవిచూసింది. ఒకప్పటి రోగాలైన కలరా, అంటువ్యాధులు, పచ్చకామెర్లు మళ్లీ తిరగబెట్టాయి. అంతేకాదు సార్స్‌ (SARS), అంటు ఫ్లూ జ్వరాలు (పాండమిక్‌ ఇన్‌ఫ్లూయెన్జా), మెర్స్‌ (MERS), ఈబోలా, జికా వంటి కొత్త రోగాలు పుట్టుకొచ్చాయి.” ఈమధ్య కాలంలో కోవిడ్‌-19 ప్రపంచమంతా వ్యాపించింది. శాస్త్రజ్ఞులు, వైద్యులు రోగాల గురించి బాగా తెలుసుకున్నా, రోగాలన్నిటినీ నయం చేసే మందుల్ని కనిపెట్టలేకపోతున్నారు.

5. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రకటనా పని

యేసు తానిచ్చిన సూచనలో మరో భాగం గురించి ఇలా చెప్పాడు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.” (మత్తయి 24:14) భయంకరమైన సమస్యల్లో కూరుకుపోయిన లోకంలో, అన్ని దేశాలకు చెందిన 80 లక్షల కన్నా ఎక్కువమంది ప్రజలు 240 దేశాల్లో 1,000 కన్నా ఎక్కువ భాషల్లో దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తున్నారు. మానవ చరిత్రలో ముందెప్పుడూ ఇలాంటిది జరగలేదు.

ఆ సూచనకు అర్థమేంటి?

యేసు ఇచ్చిన సూచనలో భాగమైన సంఘటనలు నేడు జరుగుతున్నాయి. మనం ఈ విషయంలో ఎందుకు ఆసక్తి చూపించాలి? ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “ఈ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరపడిందని తెలుసుకోండి.”—లూకా 21:31.

త్వరలో, దేవుని రాజ్యం దేవుని ఇష్టం భూమ్మీద నెరవేరేలా చూస్తుంది.

యేసు ఇచ్చిన సూచన, అలాగే బైబిల్లో ఇవ్వబడిన లెక్కలు 1914 లో a దేవుడు తన రాజ్యాన్ని పరలోకంలో స్థాపించాడని అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ సమయంలో ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని రాజుగా నియమించాడు. (కీర్తన 2:2, 4, 6-9) త్వరలో, దేవుని రాజ్యం భూమిని పరిపాలిస్తుంది, అది ప్రత్యర్థి పరిపాలనలన్నిటినీ తీసేసి, భూమంతటినీ ఒక పరదైసులా చేస్తుంది. అందులో మనుషులు ఎప్పటికీ జీవిస్తారు.

త్వరలోనే యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని ఈ మాటలు నెరవేరుతాయి: “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.” (మత్తయి 6:10) ఇంతకీ 1914 లో స్థాపించబడిన ఆ రాజ్యం ఏమి చేస్తోంది? దేవుని రాజ్యం మనుషుల్ని పూర్తిస్థాయిలో పరిపాలించేటప్పుడు ఎలాంటి విషయాలు జరుగుతాయని ఎదురుచూడొచ్చు?

a 1914వ సంవత్సరానికి సంబంధించిన వివరాల కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 32వ పాఠం చూడండి.