కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?

4 | దేవుని సహాయంతో ద్వేషాన్ని తీసేసుకోండి

4 | దేవుని సహాయంతో ద్వేషాన్ని తీసేసుకోండి

బైబిలు సలహా:

“పవిత్రశక్తి మనుషుల్లో పుట్టించే లక్షణాలు ఏమిటంటే: ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం.”గలతీయులు 5:22, 23.

దానర్థం:

దేవుని సహాయం తీసుకుంటే ద్వేషమనే విషచక్రం నుండి బయటపడడం సాధ్యమే! కొన్ని లక్షణాల్ని మనం సొంతగా అలవర్చుకోలేం, కానీ దేవుడిచ్చే పవిత్రశక్తితో వాటిని పెంచుకోగలం. కాబట్టి ద్వేషాన్ని తీసేసుకోవడానికి సొంత శక్తి మీద ఆధారపడే బదులు, దేవుని మీద ఆధారపడడం తెలివైన పని. దేవుని సేవకుడైన పౌలు అదే చేశాడు, అందుకే పౌలు; “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను” అని చెప్పగలిగాడు. దేవుడిచ్చే శక్తి మీద ఆధారపడితే మనం కూడా అలాగే చెప్పగలుగుతాం. (ఫిలిప్పీయులు 4:13) అంతేకాదు, “యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది” అని అనగలుగుతాం.—కీర్తన 121:2.

మనం ఏం చేయవచ్చు?

“క్రూరుడినైన నన్ను యెహోవా దేవుడు శాంతి స్వభావునిగా మార్చేశాడు.”–వాల్డో

తన పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను మనస్ఫూర్తిగా అడగవచ్చు. (లూకా 11:13) మంచి లక్షణాలు పెంచుకోవడానికి సహాయం చేయమని ఆయన్ని అడగవచ్చు. ద్వేషాన్ని తీసేసుకోవడానికి సహాయం చేసే లక్షణాలు, అంటే ప్రేమ, శాంతి, ఓర్పు, ఆత్మనిగ్రహం వంటివాటి గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవాలి. వాటిని పెంచుకునే మార్గాల కోసం వెదకాలి. దాంతోపాటు వాటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్లతో స్నేహం చేయాలి. అలాంటి స్నేహితులు మనం “ప్రేమ చూపించేలా, మంచి పనులు చేసేలా” ప్రోత్సహిస్తారు.—హెబ్రీయులు 10:24.