కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

వినికిడి లోపం నన్ను ప్రకటించకుండా ఆపలేకపోయింది

వినికిడి లోపం నన్ను ప్రకటించకుండా ఆపలేకపోయింది

నేను 1941లో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నాకు 12 ఏళ్లు. కానీ నేను బైబిలు సత్యాన్ని నిజంగా అర్థంచేసుకోగలిగింది 1946లో. అదేంటి అనుకుంటున్నారా? నా కథ చెప్తాను వినండి.

సుమారు 1910లో మా అమ్మానాన్నలు జార్జియాలోని టబలీసీ నుండి కెనడాకు వలస వచ్చారు. అక్కడ వాళ్లు పశ్చిమ కెనడాలోని సస్కత్‌చెవాన్‌లో ఉన్న పెలీ దగ్గరున్న చిన్న గుడిసెలో ఉండేవాళ్లు. నేను 1928లో పుట్టాను. మేం మొత్తం ఆరుగురు పిల్లలం, నేను అందరికన్నా చిన్నవాడిని. నేను పుట్టడానికి ఆరు నెలల ముందు నాన్న చనిపోయాడు. నా చిన్నతనంలోనే అమ్మ కూడా చనిపోయింది. అది జరిగిన కొన్నిరోజులకే, మా పెద్ద అక్క లూసీ కూడా చనిపోయింది, అప్పుడామెకు 17 ఏళ్లు. దాంతో నన్నూ, మా అన్నల్ని, అక్కల్ని పెంచే బాధ్యతను మా మామయ్య నిక్‌ తన భుజాల మీద వేసుకున్నాడు.

నేను అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న వయసులో ఒకసారి ఏమి జరిగిందంటే, నేను ఒక గుర్రం దగ్గరకు వెళ్లి దాని తోక లాగుతున్నాను. అది చూసిన మా ఇంట్లోవాళ్లు, ఆ గుర్రం ఎక్కడ తన్నుతుందోనని భయపడి నన్ను పక్కకి వచ్చేయమని గట్టిగా అరుస్తున్నారు. కానీ నేను వెనక్కి తిరిగివున్నాను, వాళ్ల అరుపులు నాకు వినిపించలేదు. కాకపోతే ఆ గుర్రం నన్నేమీ చేయలేదు. కానీ ఆరోజే మా ఇంట్లోవాళ్లకి అర్థమైంది, నాకు వినికిడి లోపం ఉందని.

వినికిడి లోపం ఉన్న పిల్లలు చదివే స్కూల్‌కు నన్ను పంపించమని మా కుటుంబానికి సన్నిహితులైన ఒకరు మామయ్యకు సలహా ఇచ్చారు. దాంతో మామయ్య నన్ను సస్కత్‌చెవాన్‌లోని సస్కటూన్‌లో ఉన్న ఆ స్కూల్‌కు పంపించాడు. ఆ స్కూల్‌ నుండి మా ఇల్లు చాలా దూరం, పైగా నాకు అప్పటికి ఐదేళ్లే. నాకు చాలా భయమేసేది. సెలవులు వచ్చినప్పుడు, అలాగే వేసవికాలంలో మాత్రమే నన్ను మా ఇంటికి పంపేవాళ్లు. అది అలా ఉంచితే, నేను సంజ్ఞా భాషను నేర్చుకోగలిగాను, వేరే పిల్లలతో కలిసి ఆడుకుంటూ సరదాగా గడిపాను.

సత్యం తెలుసుకోవడం

1939లో మా పెద్దక్క మెరీయన్‌కు బిల్‌ డానియేల్చుక్‌తో పెళ్లయింది. వాళ్లు నన్నూ, మా అక్క ఫ్రాన్సస్‌ను చూసుకునేవాళ్లు. మా అక్కాబావలే మొదట సత్యం తెలుసుకుని స్టడీ తీసుకోవడం ప్రారంభించారు. నేను వేసవి సెలవులకు వాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు, వాళ్లు నేర్చుకుంటున్న బైబిలు విషయాలు నాకు చెప్పడానికి చాలా కృషిచేశారు. వాళ్లకు సంజ్ఞా భాష రాదు కాబట్టి నాకు వాళ్లతో మాట్లాడడం చాలా కష్టమయ్యేది. కానీ యెహోవా గురించి నేర్చుకుంటున్న విషయాలు నాకు నచ్చాయని మాత్రం వాళ్లు అర్థంచేసుకోగలిగారు. వాళ్లు ప్రీచింగ్‌కు వెళ్లడం చూసి, బైబిలు అలా చేయమని చెప్తోందేమో అనుకునేవాణ్ణి. అందుకే వాళ్లతోపాటు నేను కూడా వెళ్లేవాణ్ణి. నాకు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలనిపించింది. 1941 సెప్టెంబరు 5వ తేదీన ఒక స్టీల్‌ డ్రమ్ములో బిల్‌ నాకు బాప్తిస్మమిచ్చాడు. బావిలో నుండి తోడిన ఆ నీళ్లు శరీరం గడ్డ కట్టిపోయేంత చల్లగా ఉన్నాయి.

1946లో, ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జరుగుతున్న సమావేశానికి హాజరైన వినికిడి లోపంగల గుంపుతో

1946లో వేసవి కాలం సెలవుల్లో నేను ఇంటికి వచ్చినప్పుడు, అందరం కలిసి అమెరికాలోని ఒహాయోలో ఉన్న క్లీవ్‌ల్యాండ్‌లో జరుగుతున్న సమావేశానికి వెళ్లాం. మొదటి రోజు, మా అక్కలు వంతులవారీగా నోట్సు రాస్తూ సమావేశంలో చెప్తున్నవాటిని నేను అర్థంచేసుకోవడానికి సహాయం చేశారు. కానీ రెండవ రోజున, వినికిడి లోపం ఉన్నవాళ్ల కోసం సంజ్ఞా భాషలో అనువాదం జరుగుతోందని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను. ఆ సమావేశాన్ని చాలా ఆనందించాను. అలా చివరికి, బైబిలు ఏమి చెప్తుందో స్పష్టంగా తెలుసుకోగలిగాను.

సత్యాన్ని బోధించడం

అది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం, ప్రజల్లో దేశభక్తి తారాస్థాయిలో ఉంది. కానీ సమావేశం తర్వాత నేను స్కూల్‌కు వెళ్లాక, యెహోవాకే నమ్మకంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. జెండా వందనం చేయడం, జాతీయ గీతం పాడడం, పండుగ రోజులు ఆచరించడం మానేశాను. పిల్లలందరితో కలిసి చర్చికి వెళ్లడం కూడా మానేశాను. అది మా టీచర్లకు నచ్చలేదు, నన్ను ఎగతాళి చేశారు, నా మనసు మార్చడానికి అబద్ధాలు చెప్పారు. ఇదంతా గమనిస్తున్న తోటి విద్యార్థులకు, సాక్ష్యం ఇచ్చే అవకాశాలు నాకు చాలానే దొరికాయి. కొంతకాలానికి తోటి విద్యార్థులైన ల్యారీ ఆన్‌డ్రసోఫ్‌, నోర్మన్‌ డిట్రిక్‌, ఈమల్‌ష్నయిడర్‌ ఇంకొందరు సత్యాన్ని అంగీకరించారు. వాళ్లు ఇప్పటికీ యెహోవాసాక్షులుగా కొనసాగుతున్నారు.

నేను వేరే నగరాలకు వెళ్లినప్పుడు, వినికిడి లోపం ఉన్నవాళ్లకు మంచివార్త చెప్పడానికి చాలా కృషిచేస్తాను. ఒకసారి మాంట్రియల్‌లో, వినికిడి లోపం ఉన్నవాళ్లందరూ కలుసుకున్న ఒక చోటికి నేను వెళ్లాను. అక్కడ ఒక ముఠా సభ్యుడిగా ఉన్న ఎడీ టేగర్‌ అనే యువకునికి మంచివార్త ప్రకటించాను. పోయిన సంవత్సరం అతను చనిపోయేవరకు, క్విబెక్‌లోని లవాల్‌లో ఉన్న సంజ్ఞా భాషా సంఘంలో సేవచేశాడు. క్వాన్‌ అర్డనాజ్‌ అనే మరో యువకుడిని కూడా కలిశాను. ప్రాచీన కాలంలోని బెరయ క్రైస్తవుల్లా అతను కూడా తాను నేర్చుకుంటున్న విషయాలు నిజంగా బైబిల్లో ఉన్నాయో లేవోనని పరిశోధించేవాడు. (అపొ. 17:10, 11) అతను కూడా యెహోవాసాక్షి అయ్యాడు. చనిపోయేవరకు ఒంటారియోలోని ఒట్టావాలో ఉన్న సంఘంలో పెద్దగా సేవచేశాడు.

1950 తొలినాళ్లలో, వీధి సాక్ష్యం ఇస్తూ

1950లో నేను వాంకోవర్‌కు వచ్చేశాను. వినికిడి లోపం ఉన్నవాళ్లకు ప్రకటించడమంటే నాకిష్టమే అయినప్పటికీ, అలాంటి లోపంలేని ఒక స్త్రీకి ప్రకటించిన చక్కని అనుభవం నాకుంది. ఆమె పేరు క్రిస్‌ స్పైసర్‌, ఆమెను వీధి సాక్ష్యంలో కలిశాను. ఆమె పత్రికల కోసం సబ్‌స్క్రిప్షన్‌ చేసుకుని, తన భర్త గ్యారీని కలవమని అడిగింది. దాంతో నేను వాళ్లింటికి వెళ్లాను, నోట్సు మీద రాసుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు మేము కలుసుకోలేదు. ఆ తర్వాత ఒకసారి ఒంటారియోలోని టోరెంటోలో జరుగుతున్న ఓ సమావేశానికి వాళ్లు వచ్చారు, అక్కడ నన్ను చూసి పలకరించారు. గ్యారీ ఆ రోజు బాప్తిస్మం తీసుకుంటున్నాడు. మనం ప్రకటించేవాళ్లలో ఎవరు సత్యాన్ని అంగీకరిస్తారో మనకు తెలీదు. అందుకే ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరికీ మంచివార్త ప్రకటించడం ఎంత ముఖ్యమో ఆ అనుభవం నాకు గుర్తుచేసింది.

కొంతకాలం తర్వాత సస్కటూన్‌కు వెళ్లిపోయాను. అక్కడ ఒకామెను కలిశాను, వినికిడి లోపం ఉన్న ఇద్దరు కవల పిల్లలు ఆమెకు ఉన్నారు. ఒకామె పేరు జీన్‌ రోథన్‌బర్గర్‌, మరొకామె పేరు జోన్‌ రోథన్‌బర్గర్‌. వాళ్లకు బైబిలు స్టడీ చేయమని ఆమె నన్ను అడిగింది. నేను చిన్నప్పుడు చదివిన స్కూల్‌లోనే వాళ్లు కూడా చదివేవాళ్లు. స్టడీ మొదలుపెట్టి ఎన్నోరోజులు గడవకముందే వాళ్లు నేర్చుకుంటున్న విషయాల్ని తమ తోటి విద్యార్థులకు చెప్పేవాళ్లు. ఫలితంగా, వాళ్ల క్లాస్‌లోని ఐదుగురు యెహోవాసాక్షులయ్యారు. వాళ్లలో యూనస్‌ కోలన్‌ ఒకరు. నా స్కూల్‌ చివరి సంవత్సరంలో నేను యూనస్‌ని మొదటిసారి కలిశాను. అప్పుడామె నాకు ఒక చాక్లెట్‌ ఇచ్చి స్నేహితులుగా ఉందామా అని అడిగింది. కొంతకాలానికి ఆమె నాలో సగభాగం అయ్యింది, అవును తనే నాకు భార్య అయ్యింది.

ఎడమ నుండి:1960లో, 1989లో యూనస్‌తో

యూనస్‌ బైబిలు స్టడీ తీసుకుంటోందని వాళ్ల అమ్మకు తెలిసిపోయింది. ఆమె స్కూల్‌ ప్రిన్సిపాల్‌ని కలిసి యూనస్‌తో ఎలాగైనా బైబిలు స్టడీ ఆపించమని అడిగింది. అతను యూనస్‌ దగ్గరున్న బైబిలు ప్రచురణల్ని లాగేసుకున్నా సరే, తను మాత్రం యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే యూనస్‌ బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంది. అప్పుడు తన అమ్మానాన్నలు ఆమెతో, “యెహోవాసాక్షివి అవ్వాలనుకుంటే అవ్వు, కాకపోతే మా ఇంట్లో నువ్వు ఉండకూడదు” అని చెప్పారు. అలా 17 ఏళ్ల వయసులో యూనస్‌ ఇంటిని వదిలి బయటికి వచ్చేసి, యెహోవాసాక్షులైన ఒక కుటుంబంతో కలిసి ఉండేది. అక్కడ ఉంటూ స్టడీ కొనసాగించి బాప్తిస్మం తీసుకుంది. మా పెళ్లి 1960లో జరిగింది, కానీ యూనస్‌ వాళ్ల అమ్మానాన్నలు మాత్రం రాలేదు. సంవత్సరాలు గడిచాక, మా నమ్మకాలను బట్టి, మేం పిల్లల్ని పెంచిన విధానాన్ని బట్టి వాళ్లు మమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టారు.

యెహోవా నాపై శ్రద్ధ చూపించాడు

లండన్‌ బెతెల్‌లో పనిచేస్తున్న నా కొడుకు నికోలస్‌, కోడలు దెబోరా

మాకు ఏడుగురు అబ్బాయిలు. వినికిడి లోపం ఉన్న మాకు, ఆ లోపంలేని పిల్లల్ని పెంచడం ఒక సవాలుగా అనిపించింది. కానీ మేం మా పిల్లలతో ఎలాంటి ఆటంకం లేకుండా మాట్లాడేందుకు, సత్యాన్ని బోధించేందుకు వీలుగా, వాళ్లకు కూడా సంజ్ఞా భాష నేర్పించాం. ఆ విషయంలో సంఘంలోని తోటి సహోదరసహోదరీలు మాకు చాలా సహాయం చేశారు. ఉదాహరణకు ఒకసారి, మా అబ్బాయిల్లో ఒకరు రాజ్యమందిరంలో బూతులు మాట్లాడుతున్నాడని సంఘంలోని ఒకరు పేపరు మీద రాసి చూపించారు. దాంతో వెంటనే మా అబ్బాయిని సరిదిద్దగలిగాం. మా అబ్బాయిల్లో నలుగురు జేమ్స్‌, జెర్రీ, నికోలస్‌, స్టీవెన్‌ సంఘపెద్దలుగా సేవచేస్తూ భార్యాపిల్లలతో కలిసి యెహోవాకు నమ్మకంగా ఉంటున్నారు. నికోలస్‌ తన భార్య దెబోరాతో కలిసి బ్రిటన్‌ బ్రాంచిలో సంజ్ఞా భాష అనువాదంలో సహాయం చేస్తున్నాడు. స్టీవెన్‌ తన భార్య షాన్నన్‌తో కలిసి అమెరికా బ్రాంచిలో సంజ్ఞా భాష అనువాదంలో సహాయం చేస్తున్నాడు.

నా కొడుకులు జేమ్స్‌, జెర్రీ, స్టీవెన్‌ వాళ్ల భార్యలతో కలిసి సంజ్ఞా భాషలో జరిగే ప్రకటనా పనికి వేర్వేరు విధాలుగా సహాయం చేస్తున్నారు

మా 40వ పెళ్లి రోజుకు ఇంకో నెల ఉందనగా, యూనస్‌ క్యాన్సర్‌తో చనిపోయింది. క్యాన్సర్‌తో పోరాడుతున్నంత కాలం పునరుత్థానంపై తనకున్న విశ్వాసం ఆమెను ధైర్యంగా ఉంచింది. తనను మళ్లీ చూసే రోజు కోసం చాలా ఆశతో ఎదురుచూస్తున్నాను.

ఫేయి, జేమ్స్‌, జెర్రీ, ఎవలిన్‌, షాన్నన్‌, స్టీవెన్‌

2012 ఫిబ్రవరిలో, జారిపడడం వల్ల నా నడుము విరిగింది. నాకు ఒకరి సహాయం అవసరమవ్వడంతో, నా కొడుకు కోడలి దగ్గరకు వెళ్లిపోయాను. ఇప్పుడు మేమంతా కల్గరీ సంజ్ఞా భాషా సంఘంలో ఉన్నాం, అక్కడ నేను సంఘపెద్దగా సేవచేస్తున్నాను. సంజ్ఞా భాషా సంఘంతో సహవసించడం నా జీవితంలో ఇదే మొదటిసారి. మరి ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీషు భాష మాట్లాడే సంఘంతో సహవసిస్తూ యెహోవాతో నా స్నేహాన్ని బలంగా ఎలా ఉంచుకోగలిగాను? యెహోవాయే నాకు సహాయం చేశాడు. తండ్రిలేని వాళ్లను ఆదుకుంటానని ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. (కీర్త. 10:14) నాకోసం నోట్సు రాసేందుకు, సంజ్ఞా భాష నేర్చుకునేందుకు, వీలైనంత బాగా సైగలు చేస్తూ బైబిలు విషయాలు నాకు అర్థమయ్యేలా చెప్పేందుకు సహాయం చేసిన ప్రతీఒక్కరికి నేను కృతజ్ఞుణ్ణి.

79 ఏళ్ల వయసులో సంజ్ఞా భాషలో జరిగిన పయినీరు పాఠశాలకు హాజరైనప్పుడు

నిజం చెప్పాలంటే, చెప్పే విషయాలు అర్థంకాక కొన్నిసార్లు నాకు చాలా చిరాకు వచ్చేది, వినికిడి లోపం ఉన్నవాళ్ల అవసరాలు ఎవ్వరికీ అర్థంకావనిపించేది. కొన్నిసార్లు యెహోవా గురించి నేర్చుకోవడం ఆపేయాలని అనిపించేది. అలా అనిపించినప్పుడు, “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితానికి నడిపించే మాటలు నీ దగ్గరే ఉన్నాయి” అని పేతురు యేసుతో అన్న మాటల్ని గుర్తుచేసుకునేవాడిని. (యోహా. 6:66-68) ఎన్నో సంవత్సరాలుగా సత్యంలో ఉన్న వినికిడి లోపంగల సహోదరసహోదరీల్లాగే, నేను కూడా ఓపిగ్గా ఉండడం నేర్చుకున్నాను. యెహోవాపై, ఆయన సంస్థపై నమ్మకముంచడం నేర్చుకున్నాను, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు వచ్చాయి. ఇప్పుడు నా భాషలో ఎన్నో ప్రచురణలు ఉన్నాయి. మీటింగ్స్‌, సమావేశాలు అమెరికా సంజ్ఞా భాషలో జరుగుతున్నాయి. మన గొప్ప దేవుడైన యెహోవాను ఆరాధించడం వల్ల ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను, ఎన్నో దీవెనలు పొందుతున్నాను.