కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

[ఎడమ నుండి కుడికి] మార్సెలో, యోమారా, ఇవర్‌. వాళ్ల ముగ్గురి చేతుల్లో స్పానిష్‌ కొత్త లోక అనువాదం బ్రెయిలీ బైబిలు ఉంది

వాళ్లు ప్రేమను “‏చూశారు”

వాళ్లు ప్రేమను “‏చూశారు”

గ్వాటిమాలలోని ఒక చిన్న పల్లెటూరిలో యోమారా, ఆమె తమ్ముళ్లు మార్సెలో, ఇవర్‌ ఉంటారు. యోమారా యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఆమె తమ్ముళ్లు కూడా స్టడీలో కూర్చున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. వాళ్ల ముగ్గురికి చూపులేదు, వాళ్ళకు బ్రెయిలీ చదవడం కూడా రాదు. వాళ్లతో స్టడీ చేసే సహోదరుడే పాఠంలోని పేరాల్ని, వచనాల్ని చదివి వినిపించేవాడు.

అంతేకాదు, మీటింగ్స్‌కి వెళ్లడం కూడా వాళ్లకు కష్టంగా ఉండేది. రాజ్యమందిరానికి రావాలంటే, వాళ్లు దాదాపు 40 నిమిషాలు ప్రయాణించాలి. వాళ్లు మీటింగ్స్‌కి సొంతగా రాలేరు కాబట్టి, మీటింగ్స్‌కి రావడానికి సహోదరులు ఎప్పుడూ వాళ్లకు సహాయం చేస్తుండేవాళ్లు. వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో వాళ్లకు విద్యార్థి నియామకాలు వచ్చినప్పుడు, వాటిని గుర్తుపెట్టుకుని చక్కగా చేయడానికి సహోదర సహోదరీలు సహాయం చేసేవాళ్లు.

మే 2019 నుండి వాళ్ల ఊళ్లోనే మీటింగ్స్‌ మొదలయ్యాయి. అప్పుడు క్రమ పయినీర్లుగా సేవచేస్తున్న ఒక జంట ఆ ఊరికి వచ్చారు. ఆ జంట వీళ్ల ముగ్గురికి బ్రెయిలీ చదవడం, రాయడం నేర్పించాలనుకున్నారు. నిజానికి, ఆ జంటకు కూడా బ్రెయిలీ రాదు. ఆ జంట లైబ్రరీకి వెళ్లి బ్రెయిలీ గురించిన పుస్తకాలు చదివి, బ్రెయిలీని ఇతరులకు ఎలా నేర్పించాలో తెలుసుకున్నారు.

మార్సెలో మీటింగ్‌లో కామెంట్‌ చెప్తున్నాడు

కొన్ని నెలలకే ఆ ముగ్గురు బ్రెయిలీని చక్కగా చదవడం నేర్చుకున్నారు. దాంతో వాళ్లు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి సాధించారు. a ఇప్పుడు వాళ్లు ముగ్గురు క్రమ పయినీర్లుగా సేవ చేస్తున్నారు. మార్సెలో సంఘ పరిచారకుడు అయ్యాడు. వాళ్లు వారమంతా యెహోవా సేవలో చాలా బిజీగా గడుపుతూ, ఇతర సహోదర సహోదరీల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతున్నారు.

సంఘం ప్రేమతో చేస్తున్న సహాయాన్ని బట్టి ఆ ముగ్గురు చాలా కృతజ్ఞతతో ఉన్నారు. యోమారా ఇలా అంటుంది: “నేను యెహోవాసాక్షుల్ని మొదటిసారి కలిసినప్పటి నుండే, వాళ్లు మాకు నిజమైన క్రైస్తవ ప్రేమ అంటే ఏంటో చూపించారు.” మార్సెలో ఇలా అంటున్నాడు: “మాకు సంఘంలో మంచి ఫ్రెండ్స్‌ దొరికారు. ఐక్యంగా, ప్రేమగా ఉండే ప్రపంచవ్యాప్త కుటుంబంలో మేము ఒకరం అయినందుకు సంతోషంగా ఉంది.” ఈ భూమంతా పరదైసుగా మారే రోజును చూడాలని యోమారా, ఆమె తమ్ముళ్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.—కీర్త. 37:10, 11; యెష. 35:5.

a చూపు లేనివాళ్లు, కళ్లు అంతగా కనబడని వాళ్లు బ్రెయిలీ చదవడం, రాయడం నేర్చుకోవడానికి బ్రెయిలీ చదవడం నేర్చుకోండి (ఇంగ్లీషు) అనే బ్రోషురు సహాయం చేస్తుంది.