కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక ప్రాచీన గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసింది

ఒక ప్రాచీన గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసింది

1970లో ఏన్గెదీలో దొరికిన ఒక గ్రంథపు చుట్ట, చదవడానికి వీల్లేనంతగా కాలిపోయి ఉంది. దొరికిన భాగంలో, దేవుని పేరు కలిగిన లేవీయకాండములోని కొన్ని వచనాలు ఉన్నాయని 3-D స్కానింగ్‌లో తేలింది

1970లో, మృత సముద్రపు పశ్చిమ తీరం దగ్గరున్న ఇజ్రాయిల్‌లోని ఏన్గెదీలో, పురావస్తు శాస్త్రజ్ఞులకు బాగా కాలిపోయిన గ్రంథపు చుట్ట ఒకటి కనిపించింది. అది వాళ్లకు, ఒక సభామందిరాన్ని తవ్వుతున్నప్పుడు దొరికింది. బహుశా సా.శ. ఆరో శతాబ్దంలో ఆ గ్రామం నాశనం అయినప్పుడే సభామందిరం కూడా కాలిపోయి ఉంటుంది. అయితే, వాళ్లకు దొరికిన గ్రంథపు చుట్ట చదవడానికి వీల్లేనంతగా కాలిపోయింది; ఒకవేళ తెరవడానికి ప్రయత్నిస్తే ముక్కలుముక్కలు అయిపోతుంది. కానీ 3-D స్కానింగ్‌ వల్ల ఆ గ్రంథపు చుట్ట లోపల ఏముందో చూడగలిగారు. అంతేకాదు కొత్త డిజిటల్‌ స్కానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో అందులో ఏం రాసుందో చదవగలిగారు.

ఇంతకీ ఆ గ్రంథపు చుట్టలో ఏముంది? అది బైబిలుకు సంబంధించిన గ్రంథపు చుట్టు. దొరికిన భాగంలో లేవీయకాండములోని మొదటి కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో నాలుగు హీబ్రూ హల్లులతో రాసే దేవుని పేరు అంటే టెట్రగ్రామటన్‌ కనిపించింది. ఆ గ్రంథపు చుట్ట సా.శ. 50-400 మధ్యకాలం నాటిదని తెలుస్తోంది. కాబట్టి మృత సముద్ర గ్రంథపు చుట్టల (కుమ్రాన్‌) తర్వాత ఇదే అతి పురాతనమైనది. ద జెరూసలేం పోస్ట్‌లో గిల్‌ జోహార్‌ ఇలా రాశాడు, “లేవీయకాండానికి సంబంధించిన ఏన్గెదీ గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసే వరకు, అన్నిటికన్నా పురాతనమైన రాతప్రతులు మృత సముద్ర గ్రంథపు చుట్టలే (దాదాపు సా.శ.పూ. 100 నాటివి). ఆ తర్వాత అతి పురాతనమైనది అలెప్పో కోడెక్స్‌ (దాదాపు సా.శ. 930 నాటివి). వాటిమధ్య సుమారు 1000 సంవత్సరాల వ్యవధి ఉంది.” నిపుణులు టెక్నాలజీ సహాయంతో ఈ గ్రంథపు చుట్టను చదివిన తర్వాత, ఎన్నో ఏళ్లు గడిచినా తోరహ్‌లోని విషయాలు ఖచ్చితంగానే ఉన్నాయనీ, నకలు చేసేవాళ్ల పొరపాట్లు దాని సారాంశాన్ని మార్చలేదనీ చెప్తున్నారు.