కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు వాక్సిన్‌ వేయించుకోవడానికి వ్యతిరేకమా?

యెహోవాసాక్షులు వాక్సిన్‌ వేయించుకోవడానికి వ్యతిరేకమా?

 కాదు. యెహోవాసాక్షులు వాక్సిన్‌ వేయించుకోవడానికి వ్యతిరేకం కాదు. ఇది ప్రతీ క్రైస్తవుడు తనకుతానుగా తీసుకోవాల్సిన నిర్ణయమని మేము భావిస్తాం. చాలామంది యెహోవాసాక్షులు వాక్సిన్‌ వేయించుకోవాలని నిర్ణయించుకుంటారు.

 మేము మంచి వైద్యాన్ని కోరుకుంటాం; తీవ్రమైన జబ్బుల్ని తగ్గించడానికి వైద్య రంగంలో వస్తున్న పురోగతిని విలువైనదిగా చూస్తాం. డాక్టర్లు, ఇతరులు చూపించే అంకిత భావానికి, వాళ్లు చేసే కృషికి, ముఖ్యంగా కష్టకాలాల్లో అలా చేస్తున్నందుకు మేము ఎంతో కృతజ్ఞతతో ఉంటాం.

 యెహోవాసాక్షులు ఆరోగ్య సంబంధిత అధికారులకు సహకరిస్తారు. ఉదాహరణకు, కోవిడ్‌-19 మహమ్మారి మొదలైనప్పటి నుండి, ఈ వెబ్‌సైట్‌లో యెహోవాసాక్షులు వందల భాషల్లో సలహాలను ప్రచురిస్తూ, భద్రతకు సంబంధించిన స్థానిక నియమాలను పాటించమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాటిలో భౌతిక దూరం పాటించడం, ఎక్కువమంది సమకూడేటప్పుడు తగిన మార్గనిర్దేశాలను పాటించడం, క్వారెంటీన్‌లో ఉండడం, చేతులు కడుక్కోవడం, మాస్క్‌ పెట్టుకోవడం వంటివాటితో పాటు అధికారులు సిఫారసు చేసే మరితర పనులు చేయడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తున్నారు.—రోమీయులు 13:1, 2.

 ఎన్నో దశాబ్దాలుగా, యెహోవాసాక్షుల ప్రచురణలు ఈ సూత్రాలను నొక్కిచెప్పాయి:

  •   ఆరోగ్య-సంరక్షణకు సంబంధించిన నిర్ణయాలు ఎవరికివాళ్లే సొంతగా తీసుకోవాలి.—గలతీయులు 6:5.

     “[ఈ పత్రిక] ఒక రకమైన మందు లేదా చికిత్స వేరే వాటికన్నా గొప్పదని చెప్పదు, అలాగే వైద్య సలహాలు అందించదు. దీని లక్ష్యం కేవలం పాఠకులకు వాస్తవాలను చెప్పి వాళ్లే సొంతగా నిర్ణయాలు తీసుకునేలా చేయడమే.”—తేజరిల్లు!, ఫిబ్రవరి 8, 1987 (ఇంగ్లీష్‌).

     “మీరు, మీ పిల్లలు వాక్సిన్‌ వేయించుకోవాలా వద్దా అనేది మీరు సొంతగా తీసుకోవాల్సిన నిర్ణయం”—తేజరిల్లు!, ఆగస్టు 22, 1965 (ఇంగ్లీష్‌).

  •   మేము ప్రాణాన్ని ఎంతో విలువైనదిగా చూస్తాం, అందుకే వైద్య చికిత్స తీసుకోవాలని కోరుకుంటాం.—అపొస్తలుల కార్యాలు 17:28.

     “సాక్షులు తమ అనారోగ్య సమస్యల విషయంలో సహాయం కోసం వైద్య నిపుణుల్ని సంప్రదిస్తారు. వాళ్లు ప్రాణాన్ని ప్రేమిస్తారు, అందుకే వీలైనంత ఎక్కువకాలం జీవించడానికి సముచితమైనది, లేఖనాలు అంగీకరించేది ఏదైనా ఉంటే అది చేస్తారు.”—కావలికోట, జూలై 1, 1975 (ఇంగ్లీష్‌).

     “యెహోవాసాక్షులు మందుల్ని, వైద్య చికిత్సను సంతోషంగా తీసుకుంటారు. వాళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలని, వీలైనంత ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటారు. నిజానికి, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుడైన లూకా లాగే యెహోవాసాక్షుల్లో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. . . . వైద్య సహాయం అందించేవాళ్లు పడే కష్టాన్ని, వాళ్ల అంకితభావాన్ని యెహోవాసాక్షులు ఎంతో విలువైనదిగా చూస్తారు. తమ అనారోగ్యం నుండి ఉపశమనం కలిగించినప్పుడు వాళ్ల విషయంలో చాలా కృతజ్ఞతతో ఉంటారు.”—కావలికోట, ఫిబ్రవరి 1, 2011 (ఇంగ్లీష్‌).