కంటెంట్‌కు వెళ్లు

ఓ వ్యక్తి యెహోవాసాక్షిగా కొనసాగడం మానేయవచ్చా?

ఓ వ్యక్తి యెహోవాసాక్షిగా కొనసాగడం మానేయవచ్చా?

మానేయవచ్చు. ఈ రెండు విధాలుగా ఓ వ్యక్తి మా సంస్థ నుండి వెళ్లిపోవచ్చు:

  •  నోటితో చెప్పడం ద్వారా లేదా రాసి ఇవ్వడం ద్వారా. ఓ వ్యక్తి, తాను ఓ యెహోవాసాక్షిగా గుర్తించబడడం ఇష్టం లేదని నోటితో చెప్పవచ్చు లేదా రాసి ఇవ్వవచ్చు.

  •  పనుల ద్వారా. ఓ వ్యక్తి, తనకిక యెహోవాసాక్షిగా ఉండడం ఇష్టం లేదని తన పనుల ద్వారా చూపించవచ్చు. (1 పేతురు 5:9) ఉదాహరణకు అతను వేరే మతంలో చేరి, ఇక దానిలోనే కొనసాగాలనుకుంటున్నట్లు చూపిస్తుండవచ్చు.—1 యోహాను 2:19.

ఒక వ్యక్తి ప్రకటనా పని చేయడం, మీటింగ్స్‌కు హాజరవడం మానేస్తే అప్పుడేంటి? అతను యెహోవాసాక్షిగా కొనసాగడం మానేశాడని మీరు అనుకుంటారా?

లేదు, మేమలా అనుకోం. ఒకవ్యక్తి తనకుతానుగా సహవాసం మానుకోవడం వేరు, విశ్వాసంలో బలహీనపడడం వేరు. కొంతకాలం ఆధ్యాత్మిక విషయాల్లో వెనకబడినంత మాత్రాన, లేక వాటిని మానేసినంత మాత్రాన వాళ్లకు విశ్వాసం లేదని కాదు. బదులుగా వాళ్లు నిరుత్సాహంలో ఉన్నారని అర్థం. అలాంటివాళ్లను విడిచిపెట్టే బదులు, వాళ్లకు ఓదార్పును, సహాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. (1 థెస్సలొనీకయులు 5:14; యూదా 22) వాళ్లకు అవసరమైన ఆధ్యాత్మిక సహాయం అందించడానికి సంఘ పెద్దలు ముందుంటారు.— గలతీయులు 6:1; 1 పేతురు 5:1-3.

అయితే, యెహోవాసాక్షిగా కొనసాగాల్సిందేనని పెద్దలు ఎవర్నీ బలవంతపెట్టరు లేక పట్టుబట్టరు. ఏ మతంలో కొనసాగాలనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. (యెహోషువ 24:15) దేవుణ్ణి ఆరాధించేవాళ్లు, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించాలని మేము కోరుకుంటాం.—కీర్తన 110:3; మత్తయి 22:37.