కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు క్రిస్మస్‌ ఎందుకు చేసుకోరు?

యెహోవాసాక్షులు క్రిస్మస్‌ ఎందుకు చేసుకోరు?

తప్పుడు అభిప్రాయాలు

 అపోహ: యెహోవాసాక్షులు యేసును నమ్మరు, అందుకే వాళ్లు క్రిస్మస్‌ చేసుకోరు.

 నిజమేంటి? మేము క్రైస్తవులం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుందని మేము నమ్ముతాం.—అపొస్తలుల కార్యములు 4:12.

 అపోహ: క్రిస్మస్‌ చేసుకోవద్దని బోధిస్తూ మీరు కుటుంబాలను విడదీస్తున్నారు.

 నిజమేంటి? కుటుంబాల మీద మేమెంతో శ్రద్ధ చూపిస్తాం. కుటుంబ బాంధవ్యాలు పటిష్ఠంగా ఉండేందుకు సహాయం చేయడానికి బైబిలును ఉపయోగిస్తాం.

 అపోహ: క్రిస్మస్‌ సందర్భంగా ఉదారత చూపించే అవకాశం, మంచి పనులు చేసే అవకాశం పోగొట్టుకుంటున్నారు, ఆ సమయంలో భూమ్మీద నెలకొనే శాంతిని కూడా మీరు ఆస్వాదించలేరు.

 నిజమేంటి? ప్రతీరోజు మేము ఉదార స్ఫూర్తిని చూపించడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి ఎంతో కృషి చేస్తాం. (సామెతలు 11:25; రోమీయులు 12:18) ఉదాహరణకు, మేము జరుపుకునే కూటాలు, చేసే ప్రకటనా పని యేసు ఇచ్చిన ఈ నిర్దేశానికి అనుగుణంగా ఉన్నాయి: ‘ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.’ (మత్తయి 10:8) అంతేకాదు, భూమ్మీద శాంతిని దేవుని రాజ్యం మాత్రమే నెలకొల్పగలదని ప్రజలకు చెబుతాం.—మత్తయి 10:7.

యెహోవాసాక్షులు క్రిస్మస్‌ ఎందుకు చేసుకోరు?

  •   యేసు తన మరణాన్ని జ్ఞాపకార్థంగా ఆచరించమని ఆజ్ఞాపించాడే గానీ పుట్టిన రోజుని కాదు.—లూకా 22:19, 20.

  •   యేసు అపొస్తలులు, తొలి శిష్యులు క్రిస్మస్‌ చేసుకోలేదు. “ఈ పుట్టిన రోజు వేడుక 243 [క్రీ.శ.] తర్వాతే ఆవిర్భవించింది” అని అంటే, చివరి అపొస్తలుడు చనిపోయి శతాబ్దం కన్నా ఎక్కువకాలం గడిచిన తర్వాతే మొదలైందని న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది.

  •   యేసు డిసెంబరు 25న పుట్టాడు అనడానికి ఏ రుజువూ లేదు; ఆయన పుట్టిన తేదీ బైబిల్లో లేదు.

  •   క్రిస్మస్‌ అన్యమత ఆచారాల నుండి పుట్టుకొచ్చింది కాబట్టి దేవుడు దాన్ని ఆమోదించడని మేము నమ్ముతాం.—2 కొరింథీయులు 6:16-18.

క్రిస్మస్‌ చేసుకోకుండా మీరు మీ పేరు ఎందుకు పాడుచేసుకుంటున్నారు?

 క్రిస్మస్‌ అన్యమత ఆచారాల నుండి పుట్టిందని, బైబిల్లో దాని ప్రస్తావన లేదని చాలామందికి తెలుసు, అయినా వాళ్లు దాన్ని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఇలా అంటారు: క్రైస్తవులుగా మనం నలుగురిలో పేరు పాడుచేసుకోవడం ఎందుకు? దాన్ని పెద్ద రాద్ధాంతం ఎందుకు చేయాలి?

 ఏ విషయంలోనైనా దేవుని ఉద్దేశమేమిటో పరీక్షించి తెలుసుకోమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (రోమీయులు 12:1, 2) మనం సత్యాన్ని విలువైనదిగా ఎంచాలని అది బోధిస్తోంది. (యోహాను 4:23, 24) ఇతరులు మా గురించి ఏమనుకుంటారనే దాని గురించి మాకు పట్టింపు ఉంది. అలాగని మేము బైబిలు సూత్రాల విషయంలో అస్సలు రాజీపడం. మాకు చెడ్డ పేరు వచ్చినా సరే తూ.చ. తప్పకుండా వాటిని పాటిస్తాం.

 మేము క్రిస్మస్‌ చేసుకోకపోయినా, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉందని గుర్తిస్తాం, ఆ హక్కుని గౌరవిస్తాం. ఇతరులు చేసుకునే క్రిస్మస్‌ వేడుకల్లో మేము జోక్యం చేసుకోం.