కంటెంట్‌కు వెళ్లు

“నిర్మాణ పనిలో స్త్రీలకు కూడా చోటు ఉంది”

“నిర్మాణ పనిలో స్త్రీలకు కూడా చోటు ఉంది”

బ్రిటన్‌లోని ఒక పేరున్న నిర్మాణ సంస్థ యెహోవాసాక్షుల్ని మెచ్చుకుంది. ఎందుకంటే వాళ్లు, ఎస్సెక్స్‌లోని చెమ్స్‌ఫోర్డ్‌ నగరం దగ్గర తమ కొత్త బ్రాంచి కార్యాలయాన్ని నిర్మిస్తున్న చోట భారీ వాహనాలు, యంత్రాలు నడిపేలా స్త్రీలకు శిక్షణ ఇస్తున్నారు. నిర్మాణ పనిలో స్త్రీలకు శిక్షణ ఇవ్వడానికి యెహోవాసాక్షులు అనుసరిస్తున్న పద్ధతిని బట్టి, ద కన్సిడరేట్‌ కన్స్‌ట్రక్టర్స్‌ స్కీం a (CCS) సంస్థ వాళ్లకు అత్యున్నత స్కోర్‌ అంటే 10కి 10 ఇచ్చింది. అంతేకాదు ఆ పద్ధతిని “వినుత్న పద్ధతి” అని వర్ణించింది. ఇంతకీ అంత మంచి రేటింగ్‌ ఎందుకిచ్చారు?

బ్రిటన్‌లో, నిర్మాణ పని చేసేవాళ్లలో స్త్రీలు 13 శాతం కన్నా తక్కువ. ఒక బ్రిటీష్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, నిర్మాణ రంగంలో ఉద్యోగం గురించి ఆలోచించే స్త్రీలు చాలా తక్కువమంది. దానికి భిన్నంగా, చెమ్స్‌ఫోర్డ్‌ దగ్గర పనిచేసేవాళ్లలో దాదాపు 40 శాతం మంది స్త్రీలే. ఇక భారీ వాహనాలు, యంత్రాలతో పనిచేసే వాళ్లలో అయితే 60 కన్నా ఎక్కువ శాతం స్త్రీలే.

చెమ్స్‌ఫోర్డ్‌ దగ్గర స్త్రీలు పురుషులతో పాటు పనిచేస్తున్నారు

యెహోవాసాక్షులైన స్త్రీలు ఈ పనిలో రాణించడానికి ఏది సహాయం చేస్తోంది? వాళ్లకు దొరికే శిక్షణ, మద్దతే అందుకు ముఖ్య కారణం. CCS చూసే ప్రమాణాల్లో కూడా ఆ రెండు అంశాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల ప్రకారం, నిర్మాణపని చేయించేవాళ్లు తమ దగ్గర పనిచేసేవాళ్లను విలువైనవాళ్లుగా ఎంచుతున్నారని చూపించాలి; అందుకోసం వాళ్లు “పనిచేసే చోట ప్రతీ ఒక్కరు గౌరవించబడేలా, సమానంగా చూడబడేలా, ప్రోత్సహించబడేలా, మద్దతు లభించేలా చూసుకోవాలి” అలాగే “శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఉండాలి.”

భారీ వాహనాలు, యంత్రాలు నడిపేలా స్త్రీలకు శిక్షణ ఇవ్వడం

నిర్మాణ పని జరిగే చోట ఎక్స్‌కవేటర్లను, డంప్‌ ట్రక్కుల్ని ఆపరేట్‌ చేయడంలో శిక్షణ పొందిన జేడ్‌ ఇలా అంటుంది: “చాలా అద్భుతంగా ఉంది! నేను ఈ పని చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. కొన్నిసార్లు పని చాలా కష్టంగా ఉంటుంది, అయితే ఎప్పటికప్పుడు నాకు శిక్షణ దొరుకుతోంది, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.” జేడ్‌లాగే లూసీ కూడా ఇప్పుడు భారీ పరికరాలు ఆపరేట్‌ చేస్తోంది. ఆమె ఇలా అంటుంది: “మొదటిసారి నేను నిర్మాణ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడ ఉపయోగపడే ఏ పనీ నాకు రాదు. అయితే నేను వచ్చిన మొదటి రోజు నుండి నాకు శిక్షణనిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నేను ఐదు వేర్వేరు టీంలతో పనిచేశాను, ఎంతో శిక్షణ పొందాను!”

టెలిస్కోపిక్‌ హాండ్లర్‌తో పనిచేసే విషయంలో శిక్షణ ఇస్తున్నారు

టీంలో పనిచేసే స్త్రీలకు యంత్రాలు ఆపరేట్‌ చేయడం మాత్రమే కాదు వేరే పనులు కూడా వచ్చు. ఎరిక్‌ అనే ఒక టీం లీడర్‌ తాను గమనించిన దాని గురించి ఇలా చెప్తున్నాడు: “తరచూ పురుషుల కన్నా స్త్రీలు పరికరాల్ని చక్కగా చూసుకుంటారు; అంతేకాదు తమ యంత్రంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని గుర్తించి, రిపోర్టు చేయడం కూడా స్త్రీలకు బాగా వచ్చు.”

నిర్మాణ పనిలో స్త్రీలకు మద్దతివ్వడం

భారీ పరికరాలతో పనిచేసే చాలా టీంలను చూసుకుంటున్న కార్ల్‌ ఇలా అంటున్నాడు: “స్త్రీలు యంత్రాల్ని నడపడం నేర్చుకున్న తీరు చూసి నేను ముగ్ధుణ్ణి అయ్యాను. కొన్నిసార్లయితే, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న పురుషుల కన్నా స్త్రీలకే ఈ పని అప్పగిస్తాను!”

ప్లాస్టిక్‌ పైపుల్ని జతచేసే యంత్రంతో పనిచేయడం

టీం లీడర్లు తోటి పనివాళ్లకు తాము మద్దతిస్తున్నామని చూపించినప్పుడు అది వాళ్లకు ధైర్యాన్నిస్తుంది. టరీస్‌ విషయమే తీసుకోండి. ఒక అనుభవంగల మెషీన్‌ ఆపరేటర్‌గా, భారీ యంత్రాలతో పనిచేసేటప్పుడు బాధ్యత తీసుకోవడం, భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యమని ఆమెకు తెలుసు. ఆమె ఇలా అంటోంది: “మా టీం లీడర్‌ మద్దతు నాకుందని తెలిసినప్పుడు, నన్ను ఒకరు నమ్ముతున్నారు కాబట్టి ఇంకా బాగా పనిచేస్తాను. నేను చేసే పనిని ఇతరులు విలువైనదిగా ఎంచుతున్నారని, దాన్ని గౌరవిస్తున్నారని తెలిసినప్పుడు ఎంతైనా కష్టపడాలని అనిపిస్తుంది!”

ఎక్స్‌కవేటర్లను, డంప్‌ ట్రక్కుల్ని ఆపరేట్‌ చేసే అబీగెయిల్‌ కూడా తనకు లభిస్తున్న సహాయసహకారాల్ని విలువైనవిగా ఎంచుతుంది. ఆమె ఇలా అంటుంది: “ఈ పని స్థలంలోని మగవాళ్లు నన్ను తక్కువగా చూడరు. వాళ్లు సహాయం చేయడానికి ఇష్టపడతారు కానీ నా పనిని వాళ్లే చేసేయాలని చూడరు. నా పనిని నన్నే చేయనిస్తారు.”

ఏకాగ్రతతో, శ్రద్ధతో పనిచేస్తారు

చెమ్స్‌ఫోర్డ్‌ దగ్గర పనిచేసే స్త్రీలు భారీ యంత్రాల్ని ఆపరేట్‌ చేయడమే కాదు స్థలాల్ని కొలవడం, వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో ప్లాన్‌ చేయడం, యంత్రాల్ని బాగుచేయడం, స్కఫోల్డింగ్‌లను పెట్టడం లాంటి పనులు కూడా చేస్తారు. చాలా ప్రాజెక్టుల్లో స్త్రీలతో కలిసి పనిచేసిన రాబర్ట్‌, వాళ్లు “ఏకాగ్రతతో పనిచేస్తారు, పనిలో నిమగ్నమైపోతారు, చిన్నచిన్న వివరాల్ని కూడా జాగ్రత్తగా గమనిస్తారు” అని అంటున్నాడు. సర్వే పని చేసే టామ్‌ ఇలా అంటున్నాడు: “నా టీంలోని స్త్రీలు ఖచ్చితత్వంతో, శ్రద్ధతో పనిచేస్తారు. వాళ్లు అంతా సరిగ్గా ఉండేలా పనిచేయాలని అనుకుంటారు.”

ఫర్గస్‌ అనే టీం లీడర్‌ ఉత్సాహంగా ఇలా అన్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు: “ఖచ్చితంగా, నిర్మాణ పనిలో స్త్రీలకు కూడా చోటు ఉంది!”

a ద కన్సిడరేట్‌ కన్స్‌ట్రక్టర్స్‌ స్కీం అనేది బ్రిటన్‌లో నిర్మాణ పనికి ఉన్న పేరును మెరుగుపర్చడానికి కృషిచేసే ఒక స్వతంత్ర సంస్థ.