కంటెంట్‌కు వెళ్లు

ఈ లోకం తీరు గురించి బైబిలు ముందే చెప్పిందా?

ఈ లోకం తీరు గురించి బైబిలు ముందే చెప్పిందా?

బైబిలు ఇచ్చే జవాబు

 మనకాలంలో మనుషులు చాలా దారుణంగా తయారౌతారని బైబిలు ఎప్పుడో చెప్పింది. దానివల్ల వాళ్లు అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తారని, సమాజంలో విలువలు ఘోరంగా పడిపోతాయని కూడా అది చెప్పింది. a (2 తిమోతి 3:1-5) మరోవైపున కొంతమంది ప్రజలు మాత్రం ఆ బురద తమకు అంటుకోకుండా చూసుకుంటారని బైబిలు సూచించింది. వాళ్లు దేవుని సహాయంతో, చెడు ఆలోచనలకి, చెడు ప్రవర్తనకి మరితర రకాల చెడుతనాన్నంతటికీ దూరంగా ఉండి, దేవునికి నచ్చిన విధంగా జీవించడానికి ప్రయత్నిస్తారు.—యెషయా 2:2, 3.

ఈ ఆర్టికల్‌లో . . .

 మనకాలంలో మనుషులు ఎలా ఉంటారో బైబిలు ముందే చెప్పింది

 ప్రజల గుండెల్లో స్వార్థం గూడు కట్టుకుని ఉండడం వల్ల వాళ్లు ఎన్నో చెడు లక్షణాలు చూపిస్తున్నారు, చాలా చెడ్డ పనులకు పాల్పడుతున్నారు. అలాంటివాళ్లకు ఆత్మనిగ్రహం ఉండదని, వాళ్లు తమనుతాము ప్రేమించుకుంటారని, దేవునికన్నా సుఖాల్ని ఎక్కువగా ప్రేమిస్తారని బైబిలు చెప్తోంది.—2 తిమోతి 3:2-4.

 ఇప్పుడు పరిస్థితి నిజంగానే బైబిలు చెప్పినట్టే ఉంది. చాలామంది ప్రజలు ‘నాకు నచ్చిందే జరగాలి,’ ‘నేను అనుకున్నది అయ్యి తీరాలి,’ ‘నా ఇష్టం’ అనే వైఖరిని చూపిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ప్రపంచంలో ఎంతగా పాకిపోయాయంటే కొంతమంది స్వార్థం ఉట్టిపడే మాటలు అంటుంటారు. ‘నా ప్రపంచంలో నేనొక్కడినే ఉన్నాను’ అని, ‘నేనే నా ప్రపంచం’ అని గొప్పలు పోతున్నారు. తమ లోకంలో తాము ఎంతగా మునిగిపోయారంటే వాళ్లు ‘మంచిని ప్రేమించరు,’ మంచి లక్షణాల్ని చూపించలేరు. వాళ్లు “కృతజ్ఞత లేనివాళ్లు” కాబట్టి తమకున్నవాటి విషయంలో గానీ, ఇతరులు వాళ్లకు చేసిన మేలు విషయంలో గానీ వాళ్లకు అస్సలు కృతజ్ఞత చూపించాలనిపించదు.—2 తిమోతి 3:2, 3.

 బైబిలు చెప్పినట్టే స్వార్థం నరనరాల్లో పాతుకుపోయి ఉండడం వల్ల ప్రజలు వేరే చెడు లక్షణాలు కూడా చూపిస్తున్నారు.

  •   దురాశ. ప్రపంచంలో ఎక్కడ చూసినా ‘డబ్బును ప్రేమించేవాళ్లే’ లేదా డబ్బంటే పడిచచ్చే వాళ్లే. వాళ్లు సంపాదించే ఆస్తిపాస్తుల్లోనే వాళ్ల విజయం వెతుక్కుంటారు.—2 తిమోతి 3:2.

  •   గర్వం. ఎటూ చూసినా “గర్విష్ఠులు,” అహంకారులు, ‘గర్వంతో ఉబ్బిపోయేవాళ్లే.’ (2 తిమోతి 3:2, 4) అలాంటివాళ్లు తమ సామర్థ్యాల గురించి, లక్షణాల గురించి, ఆస్తిపాస్తుల గురించి డప్పు చాటించుకుంటారు. గోరంత విషయాన్ని కొండంతలు చేసి చెప్పుకుంటారు.

  •   లేనిపోనివి కల్పించి చెప్పడం. ప్రపంచంలో “దూషించేవాళ్లు,” “లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు” లేని చోటంటూ లేదు. (2 తిమోతి 3:2, 3) వీళ్లు సాటి మనుషుల్ని ఎగతాళి చేస్తారు, దేవున్ని ఎక్కిరిస్తారు. వాళ్ల నోటి నిండా అబద్ధాలే.

  •   మొండితనం. మన చుట్టూ ‘మొండివాళ్లే.’ నేడు చాలామంది ప్రజలు ‘విశ్వసనీయంగా ఉండట్లేదు, నమ్మకద్రోహం చేస్తున్నారు,’ తలబిరుసుగా ప్రవర్తిస్తున్నారు. (2 తిమోతి 3:2-4) వాళ్ల వ్యవహారాలు చూస్తే ఆ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. వాళ్లు రాజీపడరు, సమస్యను ఎటూ తెగనివ్వరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోరు.

  •   క్రూరత్వం. నేడు ప్రపంచంలో ఏ మూల చూసినా క్రూరత్వం జాడలే. దానికి కారణం ముక్కు మీద కోపం. దానివల్లే కొందరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు.—2 తిమోతి 3:3.

  •   అక్రమం. మన కాలంలో అక్రమం లేదా ‘చెడుతనం పెరిగిపోతుందని’ యేసు చెప్పాడు. (మత్తయి 24:12) అంతేకాదు ప్రపంచమంతటా అల్లర్లు, విప్లవాలు చెలరేగిపోతాయని ఆయన సూచించాడు.—లూకా 21:9.

  •   కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చల్లారిపోవడం. అమ్మానాన్న మాట విననివాళ్లు, మమకారం చూపించనివాళ్లు బాగా పెరిగిపోవడం వల్ల ఇంట్లోవాళ్లను పట్టించుకోకపోవడం, వేధింపులు, గృహహింస లాంటివి ఆకాశాన్ని అంటుతున్నాయి.—2 తిమోతి 3:2, 3.

  •   మతం అనే ముసుగులో చేస్తున్న పనులు. ప్రపంచంలో ఎక్కడ చూసినా బూటకపు మనుషులే. పైకి భక్తి ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్లు చేసే పనులకు పొంతన ఉండదు. (2 తిమోతి 3:5) వాళ్లు దేవుని ఇష్టప్రకారం ప్రవర్తించే బదులు తమ మనసుకు నచ్చే విషయాలు చెప్పే మతనాయకుల్ని వెంబడిస్తారు.—2 తిమోతి 4:3, 4.

 స్వార్థపరులు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు?

 నేడు చాలామంది మానసికంగా కృంగిపోవడానికి, భావోద్వేగపరంగా దెబ్బతినడానికి కారణం స్వార్థపరుల ఆగడాలే. (ప్రసంగి 7:7) ఉదాహరణకు, డబ్బంటే పడిచచ్చేవాళ్లు ఇతరులను దోచుకుంటారు. మమకారంలేని వాళ్లేమో తమ సొంత ఇంటివాళ్లను వేధిస్తారు. దానివల్ల ఇంట్లోవాళ్లు కృంగిపోతారు లేదా ఆత్మహత్యకు పాల్పడతారు. అంతేకాదు నమ్మకద్రోహం చేసేవాళ్లు ఇతరుల మనసులకు మానని గాయాలు చేస్తారు.

 చాలామంది ప్రజలు ఇంతలా చెడిపోవడానికి కారణం ఏంటి?

 మనుషులు ఇలా మారిపోవడానికిగల అసలుసిసలు కారణాన్ని బైబిలు వివరిస్తోంది:

  •   దేవుని మీద, సాటిమనిషి మీద ప్రేమ చల్లారిపోతుంది. (మత్తయి 24:12) దానివల్ల స్వార్థం పెరిగిపోతుంది.

  •   అపవాదియైన సాతాను పరలోకం నుండి గెంటేయబడ్డాడు, తర్వాత ఈ భూమికే పరిమితమైపోయాడు. (ప్రకటన 12:9, 12) అప్పటినుండి చెడుతనం, స్వార్థం నిండుకొనివున్న తన వ్యక్తిత్వమే ఈ ప్రపంచంలోని మనుషుల్లో కూడా కనిపిస్తోంది.—1 యోహాను 5:19.

 సాటి మనుషుల్లో వచ్చే ఈ చెడు మార్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి

 ‘అలాంటివాళ్లకు దూరంగా ఉండడమని’ దేవుని వాక్యం చెప్తుంది. (2 తిమోతి 3:5) అంటే దానర్థం మనం ఎక్కడో సమాజం బయట, ఏకాంత ప్రపంచంలో బ్రతకాలని కాదు. బదులుగా, స్వార్థపరులతో, దేవుడంటే లెక్కలేనివాళ్లతో స్నేహం చేయకూడదు.—యాకోబు 4:4.

 అయితే ప్రపంచంలో ఉన్న ప్రతీఒక్కరు చెడుగా మారిపోతారా?

 లేదు. బైబిలు ఇంకొంతమంది ప్రజల గురించి కూడా మాట్లాడుతుంది. వాళ్లు ఈ లోకంలో జరుగుతున్న అసహ్యకరమైన పనులను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. (యెహెజ్కేలు 9:4) అలాంటివాళ్లు, స్వార్థం దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. వాళ్లు దేవునికి నచ్చినట్టు తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటారు. వాళ్లు ఈ లోకంలో ఉన్న చాలామంది ప్రజల్లా మాట్లాడరు, ప్రవర్తించరు. వాళ్లు ఈ చీకటి ప్రపంచంలో మిణుగురులా కనిపిస్తారు. (మలాకీ 3:16, 18) ఉదాహరణకు, వాళ్లు అందరితో శాంతిగా ఉంటారు, యుద్ధాల్లో తలదూర్చరు, హింసకు పాల్పడరు.—మీకా 4:3.

 చివరికి మానవ సమాజమంతా పూర్తి అయోమయంలో కూరుకుపోతుందా?

 లేదు. మానవ సమాజం పూర్తిగా చెల్లాచెదురైపోయే పరిస్థితి రాదు. బదులుగా, దేవుడు త్వరలోనే తన ప్రమాణాల్ని పాటించని చెడ్డవాళ్లని తుడిచిపెట్టేస్తాడు. (కీర్తన 37:38) ఆయన ఒక “కొత్త భూమిని” స్థాపిస్తాడు, అంటే మంచి మనసున్న ప్రజలు ఎల్లకాలం శాంతిగా బ్రతికేలా ఒక కొత్త మానవ సమాజాన్ని స్థాపిస్తాడు. (2 పేతురు 3:13; కీర్తన 37:11, 29) ఇదొక కల కాదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు కూడా దేవుని నీతి ప్రమాణాల ప్రకారం తమ జీవితాల్ని మార్చుకోవడానికి బైబిలు ఎంతోమందికి సహాయం చేస్తుంది.—ఎఫెసీయులు 4:23, 24.

a బైబిలు ముందే చెప్పిన విషయాల్ని బట్టి చూసినా, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని బట్టి చూసినా ఇవి ‘చివరి రోజులే’ అని అర్థమౌతుంది. ఈ కాలంలో అందరూ ఎన్నో అపాయాల్ని ఎదుర్కొంటున్నారు. మనుషులంతా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతున్నారు. (2 తిమోతి 3:1) దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి “‘చివరి రోజులు’ లేదా ‘అంత్యదినముల’ సూచన ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.