కంటెంట్‌కు వెళ్లు

దశమభాగం ఇవ్వడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

దశమభాగం ఇవ్వడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 ఇశ్రాయేలీయుల కాలంలో ప్రజలు సత్యారాధనకు మద్దతివ్వడం కోసం, వాళ్ల సంవత్సరం మొత్తంలో వచ్చిన ఆదాయంలో పదోవంతును లేదా దశమభాగాన్ని a ఇవ్వాలని ఆజ్ఞాపించబడ్డారు. దేవుడు వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు ప్రతీ సంవత్సరం మీ పొలంలో పండిన ప్రతీదానిలో పదోవంతును [లేదా దశమభాగాన్ని] ఖచ్చితంగా ఇవ్వాలి.”—ద్వితీయోపదేశకాండం 14:22.

 మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటేంటంటే, దశమభాగాన్ని ఇవ్వడం. ఇప్పుడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి దశమభాగాన్ని ఇవ్వాల్సిన నియమమేమీ లేదు. (కొలొస్సయులు 2:13, 14) కానీ ప్రతీ క్రైస్తవుడు తాము ఇచ్చే డబ్బును, “అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకున్నారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.”—2 కొరింథీయులు 9:7.

 “హీబ్రూ లేఖనాల్లో” దశమభాగం

 చాలామంది పాత నిబంధన అని పిలిచే హీబ్రూ లేఖనాల్లో దశమభాగం గురించి చాలాసార్లు చెప్పబడింది. అయితే, చాలావరకు ప్రస్తావనలు దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాతే ఉంటాయి. కానీ అంతకుముందు కూడా ఒకట్రెండుసార్లు చెప్పబడింది.

మోషే ధర్మశాస్త్రం ముందున్న ప్రస్తావనలు

 బైబిల్లో దశమభాగం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి అబ్రాము (లేదా అబ్రాహాము). (ఆదికాండం 14:18-20; హెబ్రీయులు 7:4) ఆయన షాలేముకు రాజు-యాజకుడైన మెల్కీసెదెకుకు దశమభాగాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆయన జీవితకాలంలో ఒకేఒక్కసారి దశమభాగాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన గానీ ఆయన పిల్లలు గానీ అలా ఇచ్చినట్టు ఎక్కడా లేదు.

 అబ్రాహాము తర్వాత బైబిల్లో దశమభాగం ఇచ్చిన రెండో వ్యక్తి ఆయన మనవడైన యాకోబు. దేవుడు తనను దీవిస్తే తనకు వచ్చే ప్రతీదానిలో ఖచ్చితంగా “పదోవంతును ఇస్తాను” అని యాకోబు మాటిచ్చాడు. (ఆదికాండం 28:20-22) బహుశా ఆ దశమభాగాన్ని జంతువుల్ని బలి అర్పించడం ద్వారా ఇచ్చి ఉండవచ్చని కొంతమంది బైబిలు పండితులు చెప్తారు. అలా దశమభాగాన్ని ఇస్తానని ఆయన ఒప్పుకున్నాడు గానీ తన పిల్లలు కూడా అలాగే చేయాలని ఎప్పుడూ చెప్పలేదు.

మోషే ధర్మశాస్త్రంలోని ప్రస్తావనలు

 ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనకు మద్దతివ్వడానికి దశమభాగాన్ని ఇవ్వాలని ధర్మశాస్త్రం చెప్పింది.

  •   యాజకులు, ఇతర లేవీయులు పూర్తికాలం యెహోవా సేవలోనే ఉండేవాళ్లు కాబట్టి వాళ్లకంటూ పండించుకోవడానికి సొంత భూమి ఏమీ ఉండేదికాదు. (సంఖ్యాకాండం 18:20, 21) ఇశ్రాయేలీయులు ఇచ్చిన దశమభాగం వీళ్లకు చాలా ఉపయోగపడేది. అలాగే యాజకులుకాని లేవీయులు, వాళ్లకు వచ్చిన “పదోవంతులో పదోవంతును” తీసి యాజకులకు ఇచ్చేవాళ్లు.—సంఖ్యాకాండం 18:26-29.

  •   ఇశ్రాయేలీయులు సంవత్సరంలో రెండోసారి కూడా దశమభాగం ఇచ్చేవాళ్లని బైబిలు చెప్తుంది. (ద్వితీయోపదేశకాండం 14:22, 23) వాళ్లు ప్రత్యేక పండుగలప్పుడు, ప్రతీ మూడో సంవత్సరం చివర్లో అలా ఇచ్చేవాళ్లు. దానివల్ల లేవీయులు, లేవీయులు కానివాళ్లు కూడా ప్రయోజనం పొందేవారు. అలా ఇవ్వడంవల్ల పేదవాళ్లెవ్వరూ ఆకలితో ఉండేవాళ్లు కాదు.—ద్వితీయోపదేశకాండం 14:28, 29; 26:12.

 దశమభాగాన్ని ఎలా లెక్కపెట్టేవాళ్లు? ఇశ్రాయేలీయులు సంవత్సరంలో తమకు వచ్చిన పంట మొత్తంలో పదోవంతును తీసి పక్కన పెట్టేవాళ్లు. (లేవీయకాండం 27:30) ఒకవేళ వాళ్లు డబ్బు రూపంలో ఇవ్వాలనుకుంటే, వాళ్ల దశమభాగాన్ని అమ్మితే వచ్చిన డబ్బుకు ఐదో వంతును కలిపి ఇవ్వాలి. (లేవీయకాండం 27:31) అంతేకాదు వాళ్ల పశువుల్లో నుంచి, మందలోనుంచి కూడా “పదోవంతు” ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది.—లేవీయకాండం 27:32.

 జంతువుల్ని దశమభాగంగా ఇవ్వాలనుకునేవాళ్లు ఏం చేసేవాళ్లు? తమ మందలోనుంచి వచ్చిన పదో జంతువును వాళ్లు ఎంచుకునేవాళ్లు. అది మంచిదా చెడ్డదా అని వాళ్లు చూడకూడదు. అలాగే దాన్ని అమ్మి డబ్బుగా మార్చకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీయకాండం 27:32, 33) కానీ రెండోసారి ఇచ్చే దశమభాగంలో అంటే, పండుగలప్పుడు ఇచ్చే దశమభాగంలో జంతువుల్ని అమ్మి డబ్బు తీసుకెళ్లవచ్చు. ఇది పండుగల కోసం చాలా దూరం ప్రయాణించే ఇశ్రాయేలీయులకు అనువుగా ఉండేది.—ద్వితీయోపదేశకాండం 14:25, 26.

 ఇశ్రాయేలీయులు దశమభాగాన్ని ఎప్పుడు ఇచ్చేవాళ్లు? ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం దశమభాగాన్ని ఇచ్చేవాళ్లు. (ద్వితీయోపదేశకాండం 14:22) అయితే, ఏడో సంవత్సరం విశ్రాంతి సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలో పంటలేవీ పండించేవాళ్లు కాదు. (లేవీయకాండం 25:4, 5) దానివల్ల వాళ్లు దశమభాగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండేదికాదు. అయితే ఈ ఏడు సంవత్సరాల కాలంలో, ప్రతీ మూడో సంవత్సరం అలాగే ఆరో సంవత్సరం రెండోసారి దశమభాగాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల పేదవాళ్లు, లేవీయులు ప్రయోజనం పొందేవాళ్లు.—ద్వితీయోపదేశకాండం 14:28, 29.

 దశమభాగం ఇవ్వకపోతే ఏమైనా శిక్షపడేదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం దశమభాగం ఇవ్వకపోతే ఫలానా శిక్ష ఉందని ఎక్కడా చెప్పబడలేదు. ఇశ్రాయేలీయులు యెహోవాను సంతోషపెట్టడానికి దశమభాగాన్ని ఇచ్చేవాళ్లు. అలా ఒక ఇశ్రాయేలీయుడు దశమభాగాన్ని ఇచ్చాక యెహోవా దీవెనల కోసం అడిగేవాడు. (ద్వితీయోపదేశకాండం 26:12-15) కానీ దశమభాగం ఇవ్వకపోతే మాత్రం తన నుంచి దోచుకుంటున్నట్టుగా యెహోవా భావించేవాడు.—మలాకీ 3:8, 9.

 దశమభాగాన్ని ఇవ్వడం భారంగా ఉండేదా? లేదు. దశమభాగాన్ని ఇస్తే ఇశ్రాయేలీయులకు కొదువే లేకుండా వాళ్లపై దీవెనల్ని కుమ్మరిస్తానని యెహోవా మాటిచ్చాడు. (మలాకీ 3:10) ఒకవేళ దశమభాగాన్ని ఇవ్వకపోతే ఆ జనాంగం ఎంతో నష్టపోయేది. వాళ్లు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోయేవాళ్లు. అలాగే యాజకులు, లేవీయులు కూడా పొలం పనులు చేసుకోవాల్సి వచ్చేది. దానివల్ల యెహోవా ఆరాధనకు సంబంధించిన పనులేవీ జరిగేవి కావు.—నెహెమ్యా 13:10; మలాకీ 3:7.

 “గ్రీకు లేఖనాల్లో” దశమభాగం

 యేసు భూమ్మీద ఉన్నకాలంలో దేవుని ప్రజలు దశమభాగాన్ని ఇవ్వాల్సి ఉండేది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ పద్ధతి ఆగిపోయింది.

యేసు కాలంలో

 చాలామంది కొత్త నిబంధన అని పిలిచే గ్రీకు లేఖనాల్లో, ఇశ్రాయేలీయులు దశమభాగాన్ని ఇచ్చే పద్ధతిని కొనసాగించారని అర్థమౌతుంది. దశమభాగం ఇవ్వడం అవసరమే అని యేసు చెప్పినా, అప్పుడున్న మతనాయకులు అంతకంటే ముఖ్యమైన విషయాల్ని “అంటే న్యాయాన్ని, కరుణను, నమ్మకత్వాన్ని పట్టించుకోలేదని” వాళ్లను మందలించాడు.—మత్తయి 23:23.

యేసు చనిపోయాక

 యేసు చనిపోయిన తర్వాత నుంచి దశమభాగాల్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చనిపోవడంతో మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. దాంతో “పదోవంతు సేకరించాలని” అనే ఆజ్ఞను పాటించాల్సిన అవసరం ఇప్పుడు లేదు.—హెబ్రీయులు 7:5, 18; ఎఫెసీయులు 2:13-15; కొలొస్సయులు 2:13, 14.

a దశమభాగం అంటే, “ఒక ప్రత్యేకమైన కారణం కోసం ఒక వ్యక్తి తనకు వచ్చే ఆదాయం మొత్తంలో నుంచి పదోవంతును తీయడాన్ని సూచిస్తుంది. . . . సాధారణంగా దేవున్ని ఆరాధించడం కోసం చేసే పనుల్లో ఇది ఒకటని బైబిలు సూచిస్తుంది.”—హార్పర్స్‌ బైబిల్‌ డిక్షనరీ, 765వ పేజీ.