కంటెంట్‌కు వెళ్లు

బైబిలు పునర్జన్మ గురించి బోధిస్తోందా?

బైబిలు పునర్జన్మ గురించి బోధిస్తోందా?

బైబిలు ఇచ్చే జవాబు

 లేదు. “పునర్జన్మ” అనే పదం గానీ పునర్జన్మకు సంబంధించిన బోధ గానీ బైబిల్లో కనిపించదు. పునర్జన్మ అనే నమ్మకం, ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం a నుండి పుట్టుకొచ్చింది. అయితే మనిషి మట్టి నుండి తయారయ్యాడని, చనిపోయిన తర్వాత అతను ఎక్కడా ఉండడని బైబిలు చెప్తుంది. మనిషి చనిపోయిన తర్వాత అతనిలో చావును తప్పించుకుని బ్రతికేది అంటూ ఏదీ ఉండదు. మరణంతో ఒక మనిషి ఉనికిలో లేకుండాపోతాడు.—ఆదికాండము 3:19; ప్రసంగి 9:5, 6.

పునర్జన్మకు, పునరుత్థానానికి మధ్య తేడా ఏంటి?

 పునరుత్థానం అనే బైబిలు బోధ ఆత్మకు చావు లేదు అనే సిద్ధాంతం నుండి రాలేదు. పునరుత్థానం జరిగినప్పుడు, చనిపోయిన ప్రజలు దేవుని శక్తి వల్ల మళ్లీ బ్రతుకుతారు. (మత్తయి 22:23, 29; అపొస్తలుల కార్యములు 24:15) పునరుత్థానం, కొత్త భూమ్మీద మళ్లీ చనిపోకుండా జీవించే ఆశను చిగురింపజేస్తుంది.—2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4.

పునర్జన్మ, బైబిలు గురించి అపోహలు

 అపోహ: ఏలీయా ప్రవక్త, బాప్తిస్మమిచ్చే యోహాను రూపంలో మళ్లీ పుట్టాడని బైబిలు చెప్తుంది.

నిజం: “నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును” అని దేవుడు ముందే ప్రవచించాడు.  బాప్తిస్మమిచ్చే యోహాను ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు అని యేసు చెప్పాడు. (మలాకీ 4:5, 6; మత్తయి 11:13, 14) కానీ, దానర్థం ఏలీయా మళ్లీ బాప్తిస్మమిచ్చే యోహానుగా పునర్జన్మించాడని కాదు. తాను ఏలీయాను కాదని యోహానే స్వయంగా చెప్పాడు. (యోహాను 1:21) అయితే యోహాను కూడా ఏలీయాలాగే పశ్చాత్తాపపడమనే దేవుని సందేశాన్ని ప్రకటించాడు. (1 రాజులు 18:36, 37; మత్తయి 3:1) అంతేకాదు యోహాను, ‘ఏలీయా లాంటి స్ఫూర్తిని, శక్తిని’ కలిగినవాడు అనే పేరు తెచ్చుకున్నాడు.—లూకా 1:13-17.

 అపోహ: పునర్జన్మను ఉద్దేశించే బైబిలు ‘క్రొత్తగా జన్మించడం,’ ‘మరల జన్మించడం’ అనే మాటల్ని ఉపయోగిస్తుంది.

 నిజం: మరల జన్మించడం, అంటే ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించడం అని బైబిలు వివరిస్తోంది. అది ఒక మనిషి బ్రతికుండగానే జరుగుతుంది. (యోహాను 1:12, 13) ఇది గతజన్మ ఫలితం కాదుగానీ దేవుని దీవెన. అది పొందినవాళ్లకు భవిష్యత్తు విషయంలో ఒక అసాధారణ నిరీక్షణ ఉంటుంది.—యోహాను 3:3; 1 పేతురు 1:3, 4.

a ఆత్మకు చావు లేదు, పునర్జన్మ అనే నమ్మకాలు ప్రాచీన బబులోను నుండి వచ్చాయి. తర్వాత, భారతదేశంలోని తత్త్వవేత్తలు కర్మ సిద్ధాంతాన్ని రూపొందించారు. బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ వరల్డ్‌ రిలీజియన్స్‌ ప్రకారం కర్మ అంటే, “చేసిన పని, దాని ఫలితం అనే నియమం. దాని ప్రకారం ఒకవ్యక్తి తాను ఈ జన్మలో చేసినదానికి వచ్చే జన్మలో ఫలితం అనుభవిస్తాడు.”—913వ పేజీ.