కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం | తల్లిదండ్రులు

పిల్లలకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే . . .

పిల్లలకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే . . .

 ఈమధ్య కొన్ని దేశాల్లో, ఆత్మహత్య చేసుకుంటున్న టీనేజీ పిల్లల సంఖ్య బాగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటి? మీ కొడుకుకు లేదా కూతురుకు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయా?

ఈ ఆర్టికల్‌లో ఏ విషయాలు ఉన్నాయంటే:

 పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు—తల్లిదండ్రులు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?

 2009-2019 మధ్యకాలంలో, అమెరికా దేశంలో డిప్రెషన్‌తో సతమతమైన హైస్కూల్‌ పిల్లల సంఖ్య 40 శాతం వరకు పెరిగింది. ఆ సమయంలో, ఆత్మహత్య చేసుకున్న పిల్లల సంఖ్య కూడా పెరిగింది. a ఇండియా విషయానికొస్తే, ఆత్మహత్య చేసుకునే టీనేజీ పిల్లల సంఖ్య అధికంగా ఉంది. ICMR ప్రచురించిన ఒక రిపోర్టులో ఇలా ఉంది, “15-29 మధ్య వయస్సున్న వాళ్లలో (ఆడ-మగ కలిపి ప్రతీ లక్షమందిలో) ఆత్మహత్య చేసుకునేవాళ్లు 15.72 శాతం ఉన్నారని WHO తెలియజేసింది. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన, అది కూడా పిల్లలకు రావడం సమాజంలో ఒక పెద్ద సమస్యగా మారిందని అర్థమౌతోంది.”

 “ఇంతకుముందెన్నడూ లేని కొత్త రకమైన సమస్యల్ని ఈ తరం పిల్లలు ఎదుర్కొంటున్నారు . . . వాటి వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం విపరీతంగా దెబ్బ తింటోంది.”—వివేక్‌ హెచ్‌. మూర్తి, యూ.ఎస్‌. సర్జన్‌ జనరల్‌.

 బైబిలు సలహా: “నలిగిన మనస్సు ఒంట్లో శక్తినంతా లాగేస్తుంది.”—సామెతలు 17:22.

 మీ పిల్లలకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయేమో ఎలా తెలుసుకోవాలి?

 ఇలా పసిగట్టండి:

  •   సంఘటనలు. మీ అమ్మాయిని b ఎవరైనా దూరం పెట్టడం, లవ్‌ ఫెయిల్యూర్‌ అవ్వడం, అనుకున్న పని చేయలేకపోవడం, లేదా తనకు బాగా ఇష్టమైనవాళ్లు చనిపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఒకవేళ జరిగి ఉంటే, అది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా తన మనసును బాధపెడుతుండవచ్చు.

  •   ప్రవర్తన. మీ అమ్మాయి ఇంట్లోవాళ్లతో, తన ఫ్రెండ్స్‌తో ఇంతకుముందులా టైం గడపట్లేదా? తనకు బాగా నచ్చే పనుల్ని చేయడానికి కూడా ఆసక్తి చూపట్లేదా? తనకెంతో ఇష్టమైన బొమ్మల్ని, వస్తువుల్ని వదిలేసిందా?

  •   మాటలు. మీ అమ్మాయి చావు గురించి మాట్లాడడం గానీ, “నేను చచ్చిపోతే బాగుండు” అనడం గానీ మీరు గమనించారా? తను మీకు భారం అవ్వాలనుకోవట్లేదని ఎప్పుడైనా చెప్పిందా?

     నిజమే, వాటిలో కొన్ని “వెర్రిమాటలు” లేదా ఆలోచించకుండా అనే మాటలు అయ్యుండచ్చు. (యోబు 6:3) కానీ కొన్ని మాటలు నిజంగా తన మనసులో నుండి వస్తుండవచ్చు, బహుశా అవి సహాయం కోసం తను పెడుతున్న ఆర్తనాదాలు కావచ్చు. అందుకే చచ్చిపోవడం గురించి మీ పిల్లలు ఏం మాట్లాడినా, వాటిని అస్సలు కొట్టిపారేయకండి.

 చచ్చిపోవాలని అనుకున్నట్లు మీ అమ్మాయి చెప్తే, ఎప్పుడు, ఎలా చనిపోవాలో కూడా ఆలోచించి పెట్టుకుందేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు తనిచ్చే జవాబు, పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

 “కన్నబిడ్డల్ని అలాంటి ప్రశ్నలు అడగడానికి మనసు రాదు. ఎందుకంటే ఏం వినాల్సి వస్తుందో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. కానీ వాళ్ల మనసులో ఉన్నది మాటల్లో తెలుస్తుందంటే, భయాన్ని పక్కనబెట్టి అడిగేయడమే మంచిది.”—సాండ్రా.

 బైబిలు సలహా: “మనిషి హృదయంలోని ఆలోచనలు లోతైన నీళ్లలాంటివి, వివేచన గలవాడు వాటిని పైకి చేదుతాడు.”—సామెతలు 20:5.

 మీ పిల్లలకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నట్లు మీకు తెలిస్తే ఏం చేయాలి?

  •   వాళ్ల మనసులో ఏముందో మెల్లగా తెలుసుకోండి. ముందు, దాచకుండా నిజం చెప్పినందుకు తనను మెచ్చుకోండి. తర్వాత, “నీ మనసులో ఉన్న బాధ ఏంటో, ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని మీరు అనొచ్చు. లేదా, “చచ్చిపోవాలని నీకు ఎందుకు అనిపిస్తుందో నాకు వివరంగా చెప్తావా?” అని అడగచ్చు.

     తను చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడకండి, పూర్తిగా వినండి. అంతేగానీ, ‘చాలా చిన్న విషయానికి అంత ఫీల్‌ అవ్వాలా’ అని అనడం గానీ, తన సమస్యకు తక్షణ పరిష్కారాలు ఇవ్వడం గానీ చేయకండి.

     బైబిలు సలహా: “వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు, త్వరగా కోపం తెచ్చుకోకూడదు.”—యాకోబు 1:19.

  •   తనను రక్షించే ఒక ప్లాన్‌ తయారు చేయండి. ఈ కింది విషయాల్ని గుర్తించి, ఒకచోట రాసి పెట్టుకునేలా మీ అమ్మాయికి సహాయం చేయండి:

     లక్షణాలు. సాధారణంగా ఎలాంటి పరిస్థితులు లేదా ఆలోచనలు తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేలా చేస్తున్నాయి?

     పనులు. ఎలాంటి పనులు తన మనసులో భారాన్ని తగ్గించి, ఆత్మహత్య ఆలోచనలు రానివ్వకుండా చేస్తాయి?

     సహాయపడే వ్యక్తులు. మీ అమ్మాయికి సహాయం అవసరమైనప్పుడు అండగా నిలిచేవాళ్లు ఎవరైనా ఉన్నారా? అది మీరు కావచ్చు, లేదా తనకు నమ్మకం ఉన్న ఇంకెవరైనా పెద్దవాళ్లు కావచ్చు, లేదా మానసిక సమస్యల్ని చూసే డాక్టర్‌ గానీ ఆత్మహత్య ఆలోచనల నుండి బయటపడడానికి హెల్ప్‌ చేసే సంస్థ గానీ కావచ్చు.

    తనను రక్షించే ఒక ప్లాన్‌ తయారు చేయండి

     బైబిలు సలహా: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.”—సామెతలు 21:5.

  •   ఓ కన్నేసి ఉంచండి. మీ అమ్మాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఇప్పుడు బాగానే ఉన్నట్లు అనిపించినా సరే తన మీద ఓ కన్నేసి ఉంచండి.

     “ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఇక తనకు లేవని మా అబ్బాయి చెప్పినప్పుడు, హమ్మయ్య! ఇక అంతా బానే ఉంది అనుకున్నాను. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు. అనుకోకుండా ఏమైనా జరిగితే అలాంటి ఆలోచనలు మళ్లీ రావచ్చు, క్షణంలోనే అంతా మారిపోవచ్చు.”—డానియెల్‌.

     ఫీలింగ్స్‌ ఎప్పుడూ ఒకేలా ఉండిపోవని మీ అమ్మాయి అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఫీలింగ్స్‌ని వాతావరణంతో పోలుస్తూ ద హోల్‌-బ్రెయిన్‌ చైల్డ్‌ అనే పుస్తకం ఇలా చెప్పింది, ‘కుండపోత వర్షం పడుతున్నా, అసలు వర్షమే పడట్లేదని అనుకుంటూ వర్షంలో నిలబడడం మూర్ఖత్వం అవుతుంది. మరోవైపు, వర్షం ఎప్పటికీ ఆగదని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. వాతావరణం అన్నాక అది మారుతూ ఉంటుంది; ఫీలింగ్స్‌ కూడా అంతే, అవి మారుతూ ఉంటాయి.’

  •   ధైర్యం చెప్పండి:

     తనంటే మీకు ప్రాణమని, ఎప్పుడైనా-ఏం సహాయం కావాలన్నా తనకు మీరు ఉన్నారని చెప్పండి. “నీ బాధను పోగొట్టడానికి నేను ఏమైనా చేస్తాను” అని కూడా మీరు చెప్పొచ్చు.

    బైబిలు సలహా: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

a డిప్రెషన్‌లో ఉన్న అందరూ ఆత్మహత్య చేసుకోరు. అయితే, ఆత్మహత్య చేసుకున్నవాళ్లలో చాలామంది ఆ సమయంలో డిప్రెషన్‌లో ఉన్నారని తేలింది.

b ఈ ఆర్టికల్‌లో అమ్మాయిల గురించి ప్రస్తావించినప్పటికీ, ఇందులోని సలహాలు అబ్బాయిలకు కూడా వర్తిస్తాయి.