కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ పాఠం

దేవుని రాజ్యం అంటే ఏంటి?

దేవుని రాజ్యం అంటే ఏంటి?

1. దేవుని రాజ్యం అంటే ఏంటి?

యేసు ఎందుకు అత్యుత్తమ పరిపాలకుడు?—మార్కు 1:40-42.

దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలించే ఒక ప్రభుత్వం. అది మిగతా ప్రభుత్వాలన్నిటినీ తీసేసి, పరలోకంలో అలాగే భూమ్మీద దేవుని ఇష్టం నెరవేరేలా చేస్తుంది. అది నిజంగా మంచివార్త. మనుషులందరికీ మంచి ప్రభుత్వం అవసరం, దేవుని రాజ్యం త్వరలోనే ఆ అవసరాన్ని తీరుస్తుంది. ఆ రాజ్యం భూమ్మీదున్న వాళ్లందర్నీ ఐక్యం చేస్తుంది.దానియేలు 2:44; మత్తయి 6:9, 10; 24:14 చదవండి.

ప్రతీ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును తన రాజ్యానికి రాజుగా నియమించాడు.ప్రకటన 11:15 చదవండి.

దేవుని రాజ్యం అంటే ఏమిటి? వీడియో చూడండి.

2. యేసు ఎందుకు అత్యుత్తమ పరిపాలకుడు?

దేవుని కుమారుడైన యేసు దయగలవాడు, ఆయన ఎప్పుడూ సరైనదాని వైపు ఉంటాడు; అందుకే యేసు అత్యుత్తమ పరిపాలకుడు. (మత్తయి 11:28-30) ఆయన పరలోకం నుండి భూమంతటినీ పరిపాలిస్తాడు, కాబట్టి ప్రజలందరికీ సహాయం చేసే శక్తి ఆయనకు ఉంది. యేసు తిరిగి బ్రతికిన తర్వాత పరలోకానికి వెళ్లి, తాను రాజయ్యే వరకు దేవుని కుడిపక్కన వేచివున్నాడు. (హెబ్రీయులు 10:12, 13) సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని రాజుగా చేశాడు.దానియేలు 7:13, 14 చదవండి.

3. యేసుతో పాటు ఎవరు పరిపాలిస్తారు?

పరలోకంలో యేసుతో పాటు ఇంకొంతమంది పరిపాలిస్తారు, బైబిలు వాళ్లను “పవిత్రులు” అని పిలుస్తుంది. (దానియేలు 7:27) ఆ పవిత్రుల్లో యేసు కాలంలోని ఆయన నమ్మకమైన అపొస్తలులు మొదటివాళ్లు. అప్పటినుండి యెహోవా నమ్మకమైన స్త్రీపురుషుల్ని ‘పవిత్రులుగా’ ఎంచుకుంటున్నాడు. యేసును బ్రతికించినట్టే దేవుడు వాళ్లను కూడా దేవదూతల్లాంటి శరీరంతో బ్రతికిస్తాడు.యోహాను 14:1-3; 1 కొరింథీయులు 15:42-44 చదవండి.

పరలోకానికి ఎంతమంది వెళ్తారు? పరలోకానికి వెళ్లేవాళ్లను యేసు “చిన్నమంద” అని పిలిచాడు. (లూకా 12:32) వాళ్లు మొత్తం 1,44,000 మంది. వాళ్లు యేసుతో పాటు భూమిని పరిపాలిస్తారు.ప్రకటన 14:1 చదవండి.

4. యేసు పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది?

దేవుని రాజ్యం 1914 లో పరిపాలించడం మొదలుపెట్టింది. * యేసు రాజైన వెంటనే సాతానును, అతని చెడ్డదూతల్ని భూమ్మీద పడేశాడు. అందుకే సాతాను చాలా కోపంతో భూమంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. (ప్రకటన 12:​7-10, 12) అప్పటినుండి మనుషులకు శ్రమలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మనం యుద్ధాలు, కరువులు, రోగాలు, భూకంపాల గురించి వింటున్నాం. ఇవన్నీ ఒక ‘సూచనలో’ భాగం, ఇవి దేవుని రాజ్యం త్వరలోనే భూమిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటుందని చూపిస్తున్నాయి.లూకా 21:7, 10, 11, 31 చదవండి.

5. దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని ద్వారా, ఇప్పటికే దేవుని రాజ్యం అన్ని దేశాలకు చెందిన ఒక గొప్పసమూహాన్ని ఐక్యం చేస్తోంది. యేసు రాజుగా ఉన్న దేవుని రాజ్యానికి లక్షలమంది వినయస్థులు పౌరులుగా అవుతున్నారు. దేవుని రాజ్యం భూమ్మీదున్న చెడంతటినీ తీసేసినప్పుడు వీళ్లను రక్షిస్తుంది. కాబట్టి ఆ రాజ్యంలో జీవించాలని కోరుకునే వాళ్లందరూ యేసుకు లోబడే పౌరులుగా ఉండడం నేర్చుకోవాలి.ప్రకటన 7:9, 14, 16, 17 చదవండి.

1,000 ఏళ్ల కాలంలో దేవుని రాజ్యం మనుషుల పట్ల యెహోవాకున్న ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. అప్పుడు భూమంతా పరదైసుగా మారుతుంది. చివరికి యేసు ఆ రాజ్యాన్ని తిరిగి తన తండ్రికి అప్పగిస్తాడు. (1 కొరింథీయులు 15:24-26) దేవుని రాజ్యం గురించి మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు?కీర్తన 37:10, 11, 29 చదవండి.

 

^ పేరా 6 1914 గురించి బైబిలు ముందే ఎలా చెప్పిందో తెలుసుకోవడానికి, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలో 217-220 పేజీలు చూడండి.