కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది

నాశనం చేయాలని చూసినా బైబిలు నిలిచింది

నాశనం చేయాలని చూసినా బైబిలు నిలిచింది

ముప్పు: చాలామంది రాజకీయ, మత నాయకులు బైబిలు చెప్తున్నవాటికి విరుద్ధంగా ఉండే పనులు చేశారు. చాలా సందర్భాల్లో వాళ్లు తమ అధికారాన్ని ఉపయోగించి బైబిలు ప్రజలకు చేరకుండా, ముద్రించబడకుండా, అనువదించబడకుండా అడ్డుకున్నారు. అలాంటి రెండు ఉదాహరణలు చూడండి:

  • దాదాపు క్రీ.పూ. 167: సెల్యూసిడ్‌ రాజైన ఆంటియోకస్‌ ఎపిఫేన్స్‌, యూదులందరూ గ్రీకు మతాన్ని పాటించేలా చేయాలని అనుకున్నాడు. అందుకే హీబ్రూ లేఖనాలన్నిటినీ నాశనం చేయాలని తన మనుషులకు ఆదేశించాడు. వాళ్లు కనిపించిన గ్రంథపు చుట్టలన్నిటినీ చించేసి కాల్చేశారని, వాటిని చదవాలనుకున్న వాళ్లందర్నీ చంపేశారని ఒక చరిత్రకారుడు చెప్పాడు.

  • దాదాపు 800 ఏళ్ల క్రితం: క్యాథలిక్‌ చర్చి బోధల్ని కాకుండా, బైబిల్లో ఉన్నవాటిని బోధిస్తున్న కొంతమంది మీద క్యాథలిక్‌ మతబోధకులు కోపంతో మండిపడ్డారు. ఎవరి దగ్గరైనా లాటిన్‌ భాషలో ఉన్న కీర్తనలు కాకుండా వేరే బైబిలు పుస్తకం కనిపిస్తే, వాళ్లను చర్చికి నమ్మకద్రోహం చేసినవాళ్లుగా పరిగణించేవాళ్లు. అంతేకాదు తమ మనుషుల చేత ప్రతీ ఇంటిలోని గదుల్లో, బేస్‌మెంట్‌లో సోదా చేయించాలని వాళ్ల చర్చి మీటింగ్‌లో నిర్ణయించారు. ఒకవేళ ఎవరి ఇంట్లోనైనా బైబిలు పుస్తకాలు కనిపిస్తే ఆ ఇంటిని కాల్చేయాలని ఆదేశించారు.

ఈ శత్రువులు తమ పనిలో విజయం సాధించివుంటే, బైబిలు సందేశం అప్పుడే కనుమరుగైపోయేది.

విలియమ్‌ టిండేల్‌ అనువదించిన ఇంగ్లీషు బైబిల్ని నిషేధించారు, కొన్ని కాపీలను కాల్చేశారు, 1536⁠లో టిండేల్‌ను ఏకంగా చంపేశారు. అయినప్పటికీ ఆయన అనువాదం ఉనికిలో ఉంది.

బైబిలు ఎలా నిలిచింది?: రాజైన ఆంటియోకస్‌ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న లేఖనాల గ్రంథపు చుట్టలన్నిటినీ నాశనం చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే చాలామంది యూదులు ఇశ్రాయేలును విడిచిపెట్టి వెళ్లిపోయారు. బహుశా యేసు భూమ్మీద జీవించిన కాలానికల్లా, ఎక్కువశాతం యూదులు ఇశ్రాయేలు కాకుండా వేరే ప్రాంతాల్లో జీవించారనేది నిపుణుల అభిప్రాయం. యూదులు లేఖనాల గ్రంథపు చుట్టల్ని తమ సమాజమందిరాల్లో ఉంచేవాళ్లు. తర్వాతి కాలాల్లో క్రైస్తవులు కూడా అవే గ్రంథపు చుట్టల్ని వాడారు.—అపొస్తలుల కార్యాలు 15:21.

దాదాపు 800 ఏళ్ల క్రితం పరిపాలకుల నుండి, మతనాయకుల నుండి వ్యతిరేకత వస్తున్నా, బైబిలు మీదున్న ప్రేమతో కొంతమంది దాన్ని అనువదించారు, నకలు రాశారు. బైబిలు ముద్రించబడడానికి ముందు, అంటే దాదాపు 500 కన్నా ఎక్కువ ఏళ్ల ముందే, బైబిల్లోని కొన్ని భాగాలు సుమారు 33 భాషల్లోకి అనువదించబడ్డాయి, అలాగే చేత్తో నకలు రాయబడ్డాయి. ఆ తర్వాత కాలాల్లో, పూర్తి బైబిలు శరవేగంతో అనువదించబడి, ముద్రించబడింది.

ఫలితం: శక్తివంతమైన రాజులు, మతనాయకులు బైబిల్ని నాశనం చేసి ఉనికిలో లేకుండా చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుతం అది ప్రపంచంలో ఉన్నవాళ్లందరికీ అందుబాటులో ఉంది. అత్యంత ఎక్కువ భాషల్లోకి అనువదించబడి పంచిపెట్టబడుతోన్న గ్రంథం బైబిలు మాత్రమే. కొన్ని దేశాల చట్టాలను, భాషలను, కొన్ని లక్షల మంది జీవితాలను మెరుగైన రీతిలో తీర్చిదిద్దిన ఏకైక గ్రంథం కూడా బైబిలే.