కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

త్రిక ముఖ్యాంశం | ఆందోళనలను ఎలా తట్టుకోవాలి?

డబ్బు గురించి ఆందోళన

డబ్బు గురించి ఆందోళన

“మా దేశంలో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి ధరలు ఉన్నట్టుండి ఆకాశాన్నంటాయి. ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, అందరికీ సరిపడా ఆహారం కరువైంది. ఆహారం కోసం గంటల తరబడి లైన్‌లలో నిలబడేవాళ్లం, కానీ చాలాసార్లు మా వంతు వచ్చే ముందే ఆహారం అయిపోయేది. తినడానికి ఏమీ దొరక్క ప్రజలు బక్కచిక్కిపోయారు, కొందరు వీధుల్లో కుప్పకూలిపోయారు. కనీస అవసరాల ధరలు లక్షలు, కోట్లలోకి చేరుకున్నాయి. చివరికి, మేము వాడే డబ్బుకు విలువ లేకుండా పోయింది. దానివల్ల నా బ్యాంకు డబ్బులు, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ కూడా నాకు దక్కలేదు” అని పాల్‌ అన్నాడు. భార్యని, ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన చూసుకోవాలి.

పాల్‌

ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించాలంటే తెలివి ఉపయోగించాలని పాల్‌కు తెలుసు. (సామెతలు 3:21) “నేను కరెంటు పని చేసేవాన్ని, కానీ అప్పుడు ఏ పని దొరికితే ఆ పని చేశాను. మామూలు కన్నా చాలా తక్కువ డబ్బు ఇచ్చేవాళ్లు. కొందరు డబ్బులకు బదులు ఆహారం ఇచ్చేవాళ్లు, ఇంకొందరు ఇంటికి కావాల్సిన సరుకులు ఇచ్చేవాళ్లు. ఒకవేళ నాలుగు సబ్బులు ఇస్తే, రెండు ఉంచుకుని మిగతావి అమ్మేసేవాన్ని. మెల్లమెల్లగా 40 కోడిపిల్లలు కొన్నాను. అవి పెద్దవైనప్పుడు వాటిని అమ్మి, మరో 300 కొన్నాను. తర్వాత 50 కోళ్లు ఇచ్చి 100 కేజీల మొక్కజొన్న పిండి కొన్నాను. వాటితో నా కుటుంబాన్ని, ఇంకా కొన్ని కుటుంబాల్ని చాలాకాలం పోషించాను” అని ఆయన వివరించాడు.

అన్నిటికన్నా తెలివైన పని దేవుని మీద నమ్మకముంచడం అని కూడా పాల్‌కు తెలుసు. దేవుడు చెప్పినట్లు జీవిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకోవడం గురించి యేసు ఇలా అన్నాడు: “విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి . . . ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.”—లూకా 12:29-31.

విచారకరంగా లోకంలో చాలామంది వాళ్ల అవసరాల గురించి అతిగా ఆలోచిస్తూ ఉండేలా, అవే ముఖ్యమైనవని అనుకునేలా దేవుని ప్రధాన శత్రువు సాతాను మోసగిస్తున్నాడు. ఇప్పుడున్న అవసరాల గురించి, భవిష్యత్తులో కావాల్సిన వాటి గురించి అతిగా ఆందోళన పడుతూ చాలామంది నిజానికి వాళ్లకు అవసరం లేని వాటిని కూడా సంపాదించుకోవడానికి శ్రమిస్తున్నారు. “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు” అనే మాట ఎంత నిజమో చాలామంది అప్పుల్లో మునిగిపోయాకే తెలుసుకోవాల్సి వస్తుంది.—సామెతలు 22:7.

కొందరు చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. “చాలామంది వాళ్ల కుటుంబాన్ని, స్నేహితుల్ని విడిచిపెట్టి మంచి జీవితాన్ని సొంతం చేసుకోవాలని వేరేదేశాలకు వెళ్లారు. కొందరు సరైన అనుమతి పత్రాలు లేకుండా వెళ్లారు, దానివల్ల వాళ్లకు ఏ పనీ దొరకలేదు. చాలాసార్లు పోలీసులకు కనిపించకుండా దాక్కున్నారు, వీధుల్లో పడుకున్నారు. దేవుని సహాయం తీసుకోవాలని కూడా వాళ్లకు అనిపించలేదు. అయితే మేము దేవుని సహాయంతో, కుటుంబమంతా కలిసి ఈ పరిస్థితిని తట్టుకోవాలని అనుకున్నాం” అని పాల్‌ చెప్తున్నాడు.

యేసు ఇచ్చిన సలహాను పాటించడం

“‘రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి’ అని యేసు అన్నాడు. అందుకే రోజూ నేను దేవున్ని కోరుకుంది ఒక్కటే, మేమంతా బ్రతకడానికి ఈరోజు ‘మాకు కావలసిన ఆహారం మాకు దయచేముము.’ యేసు మాటిచ్చినట్లే, దేవుడు మాకు సహాయం చేశాడు. అన్నిసార్లు మేము కోరుకున్నదే మాకు దొరకలేదు. ఒకసారి, నేను ఆహారం కోసం లైనులో నిలబడ్డాను. వాళ్లు ఏం అమ్ముతున్నారో నాకు తెలీదు. నా వంతు వచ్చినప్పుడు చూస్తే అక్కడ పెరుగు అమ్ముతున్నారు. నాకు పెరుగంటే ఇష్టముండదు. కానీ అది కూడా ఆహారమే, ఆ రాత్రికి మేము అదే తిన్నాం. ఆ పరిస్థితి ఉన్నంత కాలం ఏ రోజూ నేను, నా కుటుంబం ఖాళీ కడుపుతో పడుకోలేదు. అందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు” అని పాల్‌ చెప్తున్నాడు. a

“నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని దేవుడు మాటిస్తున్నాడు.—హెబ్రీయులు 13:5

“ఇప్పుడు ఆర్థికంగా మా పరిస్థితి బాగానే ఉంది. అయితే మా అనుభవాల నుండి మేము తెలుసుకున్నది ఏంటంటే: ఆందోళన దూరం చేసుకోవాలంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. తను చెప్పినట్లు జీవిస్తే యెహోవా b మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు’ అని కీర్తనలు 34:8⁠లో ఉన్న మాట నిజమని మా జీవితంలో రుజువైంది. ఆర్థిక ఇబ్బందులు మళ్లీ వచ్చినా మేము భయపడం.”

దేవుడు తనపై నమ్మకం ఉంచినవాళ్లకు ఏరోజుకారోజు ఆహారం దొరికేలా చూస్తాడు

“బ్రతకాలంటే మనుషులకు కావల్సింది పని-డబ్బు కాదుగానీ ఆహారమేనని ఇప్పుడు మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. ‘దేశములో . . . సస్య సమృద్ధి కలుగును’ అని దేవుడిచ్చిన మాట నెరవేరే రోజు కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం. అప్పటివరకు ‘అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.’ ‘ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.—నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను’ అని దేవుడు ఇచ్చిన మాట నుండి మేము ధైర్యం పొందాము. కాబట్టి మనం ధైర్యంగా ఇలా చెప్పవచ్చు: ‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను.’” c

పాల్‌, అతని కుటుంబంలా దేవుడు చెప్పినట్లు నడవాలంటే నిజమైన విశ్వాసం అవసరం. (ఆదికాండము 6:9) మనం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లేక భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వచ్చినా పాల్‌ చూపించిన విశ్వాసం, తెలివి నుండి మనం ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు.

కానీ ఒకవేళ మన ఆందోళనకు కారణం కుటుంబ సమస్యలైతే, అప్పుడెలా? (w15-E 07/01)

a మత్తయి 6:11, 34, (పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) చూడండి.

b దేవుని పేరు యెహోవా అని బైబిల్లో ఉంది.