కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు

ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు

నోవహు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కుండపోతగా వర్షం కురుస్తున్న ఆ సమయంలో ఒక చోట చేరారు. వాళ్ల పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. రెపరెపలాడుతున్న దీపం కాంతిలో వాళ్ల నీడలు, ఆ జడివాన తాకిడికి పైకప్పుకూ అలాగే ఓడ ఇరుపక్కలా వస్తున్న డబాడబామనే శబ్దాలు వింటున్నప్పుడు విప్పార్చుకున్న వాళ్ల కళ్లు . . . నిజంగా, అప్పుడు వచ్చిన ఆ శబ్దాలన్నీ వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించివుంటాయి.

తాను ఎంతో ప్రియాతి ప్రియంగా ఎంచే తన నమ్మకమైన భార్య, వినయవిధేయతలు గల తన ముగ్గురు కుమారులు, వాళ్ల భార్యలు అలా అందరి ముఖాలకేసి చూస్తున్నప్పుడు నిశ్చయంగా నోవహు హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోయి ఉంటుంది. అతి క్లిష్టమైన ఆ గడియల్లో, తన ప్రియమైన కుటుంబ సభ్యులు తన వెన్నంటే ఉన్నందుకు ఆయనకు ఎంతో ఊరటగా అనిపించివుంటుంది. వాళ్లందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. ఆ సమయంలో, ప్రచండవాన చేసే శబ్దాలు జోరుగా వినిపిస్తున్నా, తన కుటుంబ సభ్యులందరికీ వినిపించేలా ఆయన బిగ్గరగా కృతజ్ఞత ఉట్టిపడే ప్రార్థనను తప్పక చేసివుంటాడు.

నోవహు గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి. నోవహు విశ్వాసం కారణంగానే యెహోవా దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని కాపాడాడు. (హెబ్రీయులు 11:7) అయితే, వర్షం మొదలైన తర్వాత వాళ్లకు ఇక విశ్వాసం అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది, ముందుముందు రానున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే వాళ్లకు ఆ లక్షణం చాలా అవసరం. ఈ అల్లకల్లోల కాలంలో జీవిస్తున్న మన విషయంలో కూడా అంతే. కాబట్టి, నోవహు చూపించిన విశ్వాసం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

‘నలభై పగళ్లు, నలభై రాత్రులు’

‘నలభై పగళ్లు, నలభై రాత్రులు’ వర్షం కురిసింది. (ఆదికాండము 7:4, 11, 12) నీటి మట్టం ఆసాంతం పెరుగుతూ వచ్చింది. అప్పుడు, తన దేవుడైన యెహోవా ఒకవైపు నీతిమంతుల్ని రక్షిస్తూనే, మరోవైపు దుష్టులను శిక్షించడాన్ని నోవహు చూడగలిగాడు.

ఆ ప్రళయం, దేవదూతల మధ్య తలెత్తిన ఓ తిరుగుబాటుకు తెరదించింది. సాతాను స్వార్థబుద్ధిని చూసి పాడైన చాలామంది దూతలు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికి ‘తమ నివాసస్థలాన్ని’ విడిచిపెట్టారు. ఆ తర్వాత, వాళ్లకు పుట్టిన పిల్లలు అసాధారణమైన భారీకాయులయ్యారు, వాళ్లకు నెఫీలులు అనే పేరొచ్చింది. (యూదా 6; ఆదికాండము 6:4) తిరుగుబాటు పేట్రేగిపోవడం చూసి సాతాను రాక్షసానందాన్ని పొందివుంటాడు. ఎందుకంటే, యెహోవా ఈ భూమ్మీద చేసిన సృష్టికే మకుటమైన మానవకోటి ఆ తిరుగుబాటు వల్ల మరింత హీనదశకు దిగజారింది.

అయితే, తిరుగుబాటు చేసిన దేవదూతలు ఆ ప్రవాహం పెరగడం చూసి, తమ మానవ శరీరాలను వదిలిపెట్టి పరలోకానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత, మళ్లీ మానవ శరీరం దాల్చే అవకాశం వాళ్లకు లేకపోయింది. తమ భార్యాపిల్లల్ని ఆ ప్రవాహానికి వదిలేసి వెళ్లిపోయారు. దాంతో, తమ కుటుంబాలు మిగతా మానవ సమాజంతో పాటు మట్టికొట్టుకుపోయాయి.

హనోకు జీవించిన కాలంలోనే అంటే, నోవహు కాలానికి దాదాపు ఏడు శతాబ్దాల ముందే, తాను దుష్టులను, భక్తిహీనుల్ని నాశనం చేస్తానని యెహోవా హెచ్చరించాడు. (ఆదికాండము 5:24; యూదా 14, 15) అప్పటినుండి, ప్రజలు ఈ భూమిని పాడు చేస్తూ, హింసతో నింపేస్తూ ఇంకా దిగజారిపోయారు. ఇప్పుడు ఆ జలప్రళయం వాళ్ల పాలిట శాపమైంది. వాళ్ల నాశనాన్ని చూసి నోవహు, ఆయన కుటుంబ సభ్యులు సంతోషంతో ఎగిరి గంతులు వేశారా?

వాళ్లేకాదు, వాళ్లు కొలిచే దయామయుడైన దేవుడు కూడా సంతోషించలేదు! (యెహెజ్కేలు 33:11) వీలైనంత ఎక్కువమందిని రక్షించడానికి యెహోవా శతవిధాలా ప్రయత్నించాడు. దుష్టులను హెచ్చరించమని హనోకును పంపించాడు, ఓడ కట్టమని నోవహుకు చెప్పాడు. ప్రజలను మనసులో ఉంచుకొనే నోవహు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఆ దుర్భేద్యమైన ఓడ నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లపాటు అహర్నిశలు పాటుపడ్డారు. అంతేకాదు, ‘నీతిని ప్రకటించమని’ కూడా యెహోవా నోవహుకు చెప్పాడు. (2 పేతురు 2:5) తనకు ముందు జీవించిన హనోకులా, నోవహు కూడా ప్రజల మీదకు రానున్న తీర్పు గురించి ప్రజల్ని హెచ్చరించాడు. దానికి ప్రజలు ఎలా స్పందించారు? వాటన్నిటినీ పరలోకం నుండి స్వయంగా చూసిన యేసు ఆ తర్వాత నోవహు కాలంలోని ప్రజల గురించి మాట్లాడుతూ, ‘జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొనిపోయే వరకు’ ప్రజలు దాన్ని పట్టించుకోలేదని అన్నాడు.—మత్తయి 24:39.

యెహోవా ఆ ఓడ తలుపులు మూసేశాక మొదటి 40 రోజులు నోవహుకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి. రోజుల తరబడి కుండపోతగా వర్షం కురుస్తున్న ఆ సమయంలో ఆ ఎనిమిది మంది బహుశా ఏదోక విధమైన కార్యకలాపాల్లో అంటే, ఒకరి బాగోగుల గురించి ఒకరు పట్టించుకోవడంలో, ఇంటి పనులు చక్కబెట్టుకోవడంలో, ఓడ లోపలి గదుల్లో ఉన్న జంతువుల అవసరాలు చూసుకోవడంలో మునిగిపోయి ఉంటారు. అయితే ఒకానొక గడియలో, ఒక్క కుదుపుతో అకస్మాత్తుగా ఆ దుర్భేద్యమైన ఓడ కదలడం మొదలైంది! పెరుగుతున్న నీటిమట్టం మీద తేలాడుతూ ‘అది భూమ్మీద నుండి పైకి లేచింది.’ (ఆదికాండము 7:17) సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని శక్తికి ఎంతటి తార్కాణమో కదా!

తానూ తన కుటుంబమూ క్షేమంగా ఉన్నందుకు మాత్రమే కాకుండా, ఓడ బయట నాశనం అవుతున్న ప్రజలను హెచ్చరించడానికి కనికరంతో తమను ఉపయోగించుకున్నందుకు కూడా నోవహు తన దేవునికి తప్పక కృతజ్ఞతలు తెలిపివుంటాడు. కాయకష్టం చేస్తూ ఓడ నిర్మించిన సంవత్సరాల్లో తమ పనివల్ల లాభమేమీ లేదన్నట్లు వాళ్లకు అనిపించివుంటుంది. ప్రజలు అసలు వాళ్ల మాట వింటేగా! ఒక్కసారి ఆలోచించండి, జలప్రళయానికి ముందు నోవహుకు బహుశా అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లూ వాళ్ల పిల్లలూ అలా అందరూ ఉన్నా ఎవ్వరూ ఆయన మాట వినలేదు, కేవలం తన సొంత కుటుంబంలోని ఏడుగురు తప్ప! (ఆదికాండము 5:30) బ్రతికిబయటపడే అవకాశాన్ని వాళ్లందరికీ ఇచ్చేందుకు తాము గడిపిన సమయమంతటి గురించి ఆలోచిస్తున్నప్పుడు నోవహుతో సహా ఓడలో సురక్షితంగా ఉన్న ఎనిమిది మందికి ఎంతో ఊరట లభించి ఉంటుంది.

నోవహు కాలం నుండి ఇప్పటి వరకు యెహోవా ఇసుమంతైనా మారలేదు. (మలాకీ 3:6) ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ రోజులు కూడా చాలామట్టుకు ‘నోవహు దినాల్లాగే’ ఉన్నాయని యేసుక్రీస్తు వివరించాడు. (మత్తయి 24:37) మనం జీవిస్తున్నది నిజంగా ప్రత్యేకమైన రోజుల్లో. కష్టాలకడలిగా ఉన్న ఈ రోజులు ముగిసేది అక్రమంతో నిండిన లోకం నాశనమైనప్పుడే. నేడు కూడా దేవుని ప్రజలు, వినే మనసున్న వాళ్లకు హెచ్చరికలు చేస్తున్నారు. మరి మీరు ఆ హెచ్చరికను లక్ష్యపెడతారా? ప్రాణాల్ని రక్షించే ఆ సత్య సందేశాన్ని మీరిప్పటికే స్వీకరించివుంటే, దాన్ని ఇతరులతో పంచుకుంటారా? నోవహు, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయంలో మనందరికీ చక్కని ఆదర్శం.

‘నీటి ద్వారా రక్షణ పొందారు’

ఆ గొప్ప సముద్రంలో ఓడ కొట్టుకుపోతున్నప్పుడు, అందులో ఉన్నవాళ్లు ఓడకున్న పెద్దపెద్ద దూలాలు, చెక్కలూ కిర్రుక్రిర్రుమని శబ్దం చేయడాన్ని తప్పక వినివుంటారు. పెద్దపెద్ద అలల గురించో వాటి తాకిడిని తట్టుకోగల ఆ భారీ ఓడ సామర్థ్యం గురించో నోవహు ఆందోళనపడ్డాడా? లేదు. అలాంటి అనుమానాలు అయితేగియితే సంశయవాదులకే వస్తాయి. కానీ, నోవహు ఓ సంశయవాది కాడు కదా. బైబిలు ఇలా చెబుతోంది: ‘విశ్వాసాన్ని బట్టి నోవహు . . . ఒక ఓడను సిద్ధం చేశాడు.’ (హెబ్రీయులు 11:7) దేనిమీద, ఎవరిమీద ఆయన విశ్వాసం? ఆ జలప్రళయం నుండి తననూ, తనతోపాటు ఉన్నవాళ్లనందరినీ రక్షిస్తానని యెహోవా నోవహుతో ఓ నిబంధన లేదా ఒప్పందం చేశాడు. (ఆదికాండము 6:18, 19) ఈ విశ్వాన్ని, భూమిని, అందులోని సమస్త జీవరాశిని సృష్టించినవాడు కేవలం ఓ ఓడ బద్దలుకాకుండా కాపాడలేడా? నిశ్చయంగా కాపాడగలడు! అందుకే, నోవహు యెహోవా మీద, ఆయన ఇచ్చిన మాట మీద విశ్వాసం ఉంచాడు. చివరకు, తాను, తన కుటుంబం ‘నీటి ద్వారా రక్షణ పొందారు.’—1 పేతురు 3:19, 20.

నలభై పగళ్లు, నలభై రాత్రులు గడిచాక వర్షం ఆగిపోయింది. మన క్యాలెండరు ప్రకారం అది సా.శ.పూ. 2370, డిసెంబరు నెలలో ఏదోక రోజు అయ్యుంటుంది. అయితే, ఆ కుటుంబం చేస్తున్న సాహస యాత్ర ఇంకా అయిపోలేదు. నీటిమట్టం కొండల్ని సహితం ముంచేసి భూమిని ఓ సముద్రంగా మార్చేసిన ఆ సమయంలో ఎన్నో వన్యప్రాణులతో కిటకిటలాడుతున్న ఆ ఓడ ఏకాకిలా కనిపించింది. (ఆదికాండము 7:19, 20) ఆ జంతువులన్నిటినీ సజీవంగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి నోవహు తన ముగ్గురు కుమారులు షేము, హాము, యాపెతులతో కలిసి ఎన్నో కష్టమైన పనుల్ని క్రమపద్ధతిలో చేసి ఉంటాడు. వాళ్ల ప్రయత్నాల మాట అటుంచితే, అడవి జంతువులు ఓడలోకి వెళ్లేలా వాటిని మచ్చిక చేసిన అదే దేవుడు ఆ ప్రళయకాలమంతటిలో వాటి స్థితి అలాగే ఉండేలా చూశాడు. a

అప్పుడు జరిగిన సంఘటనలను నోవహు జాగ్రత్తగా రాసిపెట్టాడని తెలుస్తోంది. వర్షాలు ఎప్పుడు మొదలయ్యాయో, ఎప్పుడు ఆగిపోయాయో ఆ వృత్తాంతం చెబుతోంది. 150 రోజులపాటు ఈ భూమి ముంపుకు గురైందని కూడా అది తెలియజేస్తోంది. చివరకు, నీళ్లు తగ్గనారంభించాయి. అలా ఒక రోజు, ఓడ నెమ్మదిగా “అరారాతు కొండలమీద” ఆగింది. ఇప్పుడు ఆ ప్రాంతం టర్కీలో ఉంది. అది సా.శ.పూ. 2369లో బహుశా ఏప్రిల్‌ నెల అయ్యుంటుంది. 73 రోజుల తర్వాత, అంటే జూన్‌లో పర్వత శిఖరాలు కనిపించనారంభించాయి. మూడు నెలల తర్వాత అంటే సెప్టెంబరులో, నోవహు ఆ ఓడ పైకప్పులో ఓ భాగాన్ని తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అలా చేసినప్పుడు వెలుతురు, స్వచ్ఛమైన గాలి లోనికి వచ్చాయి. అంతకుముందు, ఓడ బయటి వాతావరణం బాగుందో లేదో తెలుసుకోవడానికి నోవహు కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆయన ముందు ఓ కాకిని బయటకు వదిలాడు. అది వస్తూ పోతూ బహుశా మధ్యమధ్యలో ఓడ మీద ఆగుతూ పొడి నేల కోసం చూసింది. ఆ తర్వాత నోవహు ఓ నల్లపావురాన్ని వదిలాడు. నీళ్లు తగ్గిపోయి, దానికి ఆశ్రయం దొరికేంత వరకు అది నోవహు దగ్గరికి వస్తూపోతూ ఉంది.—ఆదికాండము 7:24–8:13.

నిస్సందేహంగా, అతి క్లిష్టమైన గడియల్లో సహితం నోవహు చొరవ తీసుకొని కుటుంబ ఆరాధన చేసివుంటాడు

అయితే నోవహు నిస్సందేహంగా, తన రోజువారీ కార్యకలాపాల కన్నా ఆధ్యాత్మిక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ఉంటాడు. వాళ్లంతా క్రమంగా కలిసి ప్రార్థించడాన్ని, తమ సంరక్షకుడైన పరలోక తండ్రి గురించి మాట్లాడుకోవడాన్ని మనం ఊహించుకోవచ్చు. ప్రాముఖ్యమైన ప్రతీ నిర్ణయం తీసుకునేటప్పుడు నోవహు యెహోవాను సంప్రదించాడు. చివరకు భూమి ‘ఎండిపోయిందని’ నోవహు తెలుసుకున్నాడు. అప్పటికి వాళ్లు ఓడలో గడిపిన సమయం ఓ ఏడాది పైమాటే. భూమి ఎండిపోయిందని తెలిసినా నోవహు ఆ ఓడ నుండి సమస్తాన్ని బయటకు రప్పించడానికి ఆ ఓడ తలుపులు తెరవలేదు. (ఆదికాండము 8:14) ఆయన యెహోవా చెప్పేంతవరకు ఆగాడు!

విశ్వాసంగల నోవహు నుండి నేటి తండ్రులు, భర్తలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ప్రతీది క్రమబద్ధంగా చేశాడు, ఆయన పనిమంతుడు, సహనశీలి, మంచి సంరక్షకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన యెహోవా ఇష్టానికే పెద్దపీఠ వేశాడు. మనం నోవహును ఆదర్శంగా తీసుకొని విశ్వాసం చూపిస్తే, మన ప్రియమైన బంధుమిత్రులందరికీ దీవెనలు తెస్తాం.

“ఓడలో నుండి బయటికి రండి”

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యెహోవా ఆజ్ఞ చిట్టచివరకు రానేవచ్చింది. ‘నువ్వు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఓడలోనుండి బయటికి రండి’ అని యెహోవా నోవహుకు చెప్పాడు. దానికి శిరసావహిస్తూ నోవహు కుటుంబం బయటకు వచ్చింది, ఆ ఓడలోని జంతువులు కూడా వాళ్ల వెనకాలే వచ్చాయి. ఎలా? అయోమయంగా, తొక్కిసలాటల మధ్యనా? కానేకాదు! ఆ వృత్తాంతం చెబుతున్నట్లుగా, “వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి” వచ్చాయి. (ఆదికాండము 8:15-19) నోవహు కుటుంబం స్వచ్ఛమైన భూమ్మీద కాలుమోపి, ఆ కొండప్రాంతంలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించారు, అరారాతు పర్వతాల్లో ఉన్న ఎత్తుపల్లపు ప్రాంతాలను వీక్షించారు. నెఫీలులు మట్టికొట్టుకుపోయారు, హింస మటుమాయమైపోయింది, తిరుగుబాటు రేపిన దూతలు తెరమరుగయ్యారు, దుష్ట మానవ సమాజమంతా కనుమరుగైపోయింది. b ఇప్పుడు ఈ భూమ్మీద మళ్లీ ఓ కొత్త ప్రారంభాన్నిచ్చే అవకాశం ఆ కుటుంబం చేతుల్లో ఉంది.

అప్పుడు తాను చేయాల్సిందేంటో నోవహుకు తెలుసు. ఆయన యెహోవా ఆరాధనతో ఆ కొత్త జీవితాన్ని ఆరంభించాడు. ఓ బలిపీఠం కట్టి, ఏడేడు జతలుగా తెచ్చినవాటిని అంటే, యెహోవా దృష్టిలో పవిత్రమైన కొన్ని జంతువులను తీసుకొని యెహోవాకు దహనబలి అర్పించాడు. (ఆదికాండము 7:2; 8:20) ఆ ఆరాధన యెహోవాకు నచ్చిందా?

ఈ మాటల్లో బైబిలు దానికి జవాబిస్తోంది: ‘అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడు.’ ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని దౌర్జన్యంతో నింపి, బాధతో తన గుండె బరువెక్కేలా చేసిన మనుషులు ఉండేవాళ్లు. ఇప్పుడు వాళ్ల స్థానంలో తన ఇష్టాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్న విశ్వాసంగల ఆరాధకుల కుటుంబం ఉండడాన్ని చూసినప్పుడు అది సువాసనలా యెహోవాకు మంచి అనుభూతినిచ్చింది. యెహోవా వాళ్ల నుండి పరిపూర్ణతను ఆశించలేదు. ఆ తర్వాతి వచనం ఇలా చెబుతోంది: “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది.” (ఆదికాండము 8:21) ఓపికతో తాను మనుషులపై చూపించే కనికరాన్ని యెహోవా ఇంకా ఎలా వ్యక్తం చేశాడో గమనించండి.

నేలకు తాను విధించిన శాపాన్ని దేవుడు తీసేశాడు. అంతకుముందు ఆదాముహవ్వలు తనకు ఎదురుతిరిగినందుకు యెహోవా ఆ శాపాన్ని విధించినప్పుడు, సేద్యం చెప్పలేనంత కష్టంగా తయారైంది. బహుశా ‘విశ్రాంతి’ లేదా ‘సాంత్వన’ అనే అర్థాలున్న నోవహు అనే పేరును వాళ్ల నాన్న లెమెకు ఆయనకు పెట్టాడు. అంతేకాక, ఆ శాపం నుండి తన కుమారుడు మనుషులను విడిపిస్తాడని కూడా ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరడాన్ని, తాము పడే పాట్లకు ఫలితంగా నేల చక్కగా పంటల్ని ఇవ్వడాన్ని చూసినప్పుడు నోవహు ముఖం సంతోషంతో వెలిగిపోయుంటుంది. అందుకే నోవహు, సేద్యాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు.—ఆదికాండము 3:17, 18; 5:28, 29; 9:20.

నోవహు కుటుంబం స్వచ్ఛమైన భూమ్మీద కాలుమోపింది

అదే సమయంలో, తమ జీవనానికి ఉపయోగపడే కొన్ని సరళమైన, స్పష్టమైన నియమాలు యెహోవా నోవహుకు ఇచ్చాడు. హత్యలకు, రక్తం తినడానికి సంబంధించిన నిషేధం కూడా ఆ నియమాల్లో ఉంది. అంతేకాక, భూమ్మీద ఉన్న జీవరాశిని నాశనం చేయడానికి జలప్రళయాన్ని ఇక మళ్లీ రప్పించనని చెబుతూ యెహోవా మనుషులతో ఓ ఒప్పందం కూడా చేశాడు. తన మాటను నమ్మేందుకు రుజువును ఇస్తూ, ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టే ఇంద్రధనస్సును మొట్టమొదటిసారిగా ఆకాశంలో కనిపించేలా చేశాడు. ఇప్పటికీ, మనం ఇంద్రధనస్సును చూసిన ప్రతీసారి, ప్రేమతో యెహోవా ఇచ్చిన మాటను గుర్తుచేసుకొని ఊరటను పొందవచ్చు.—ఆదికాండము 9:1-17.

ఒకవేళ నోవహు కథ ఓ కట్టుకథే అయ్యుంటే, మొట్టమొదటిసారి ఇంద్రధనస్సు కనిపించినప్పుడే ఆ కథకు తెరపడి ఉండేది. కానీ, నోవహు నిజంగా ఈ భూమ్మీద జీవించిన వ్యక్తే. ఆయన జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. అప్పట్లో మనుషుల ఆయుష్షు కూడా చాలా ఎక్కువే. విశ్వాసంగల నోవహు జలప్రళయం తర్వాత ఇంకా 350 సంవత్సరాలు బ్రతికాడు. ఆ శతాబ్దాల్లో ఆయనకు కొన్ని తీరని దుఃఖాలే మిగిలాయి. ఓ సందర్భంలో తాగినమైకంలో ఆయన ఓ ఘోరమైన తప్పు కూడా చేశాడు. తన మనుమడైన కనాను మరింత ఘోరమైన తప్పు చేసినప్పుడు నోవహు పాపభారం ఎంతగా పెరిగిందంటే, అది కనాను కుటుంబానికి మరీ దారుణమైన పరిణామాలు తెచ్చిపెట్టింది. నోవహు తాను కన్నుమూసే లోపు అంటే నిమ్రోదు కాలం వరకు, తన వంశం నుండి వచ్చినవాళ్లే విగ్రహారాధన, హింస వంటి పెద్దపెద్ద పాపాల్ని చేయడం కళ్లారా చూశాడు. ఇక నోవహు పొందిన దీవెనల మాటకొస్తే, తన కుమారుడైన షేము విశ్వాసం విషయంలో తన కుటుంబానికి చక్కని ఆదర్శంగా నిలవడాన్ని కూడా నోవహు కళ్లారా చూశాడు.—ఆదికాండము 9:21-28; 10:8-11; 11:1-11.

ఎన్ని కష్టాలు ముంచెత్తినా నోవహులాగే మనం కూడా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్నవాళ్లు సత్య దేవుని మాట వినకపోయినా, లేదా ఆయనను సేవించడం మానేసినా మనం మాత్రం నోవహులా విశ్వాసం చూపించాలి. మనం అలా ఓర్పుగా విశ్వాస బాటలో నడిస్తే, దాన్ని యెహోవా ఎంతో అమూల్యంగా ఎంచుతాడు. యేసు చెప్పినట్లు, ‘అంతం వరకు సహించినవాడే’ లేదా ఓర్పు చూపించినవాడే ‘రక్షణ పొందుతాడు.’—మత్తయి 24:13. (w13-E 08/01)

a దేవుడు జంతువుల్ని సుస్తుగా, నిద్రావస్థలో ఉండేలా చేశాడని, దానివల్ల వాటి ఆహారపుటవసరాలు పెద్దగా ఉండివుండకపోవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవుడు అలా చేసినా, చేయకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితం. అదేంటంటే, దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు, ఆ ఓడలోని సమస్తాన్ని క్షేమంగా, సజీవంగా ఉంచాడు.

b బహుశా జలప్రళయమప్పుడే, ఏదెను తోట ఛాయలు కూడా లేకుండా పోయివుంటాయి. అదే గనుక జరిగివుంటే, ఏదెనుకు కాపలాగా ఉన్న కెరూబులు పరలోకానికి తిరిగివెళ్లేందుకు స్వతంత్రులయ్యుంటారు. 1,600 సంవత్సరాల పాటు ఆ దూతలు ఏదెను తోట దగ్గర నిర్వహించిన విధులు అంతటితో పూర్తయివుంటాయి.—ఆదికాండము 3:22-24.