కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“నేను మొరటుగా ప్రవర్తించేవాణ్ణి”

“నేను మొరటుగా ప్రవర్తించేవాణ్ణి”
  • జననం: 1960

  • దేశం: ఫిన్‌లాండ్‌

  • ఒకప్పుడు: హెవీ మెటల్‌ సంగీత కళాకారుడు

నా గతం:

నేను టర్కు అనే ఒక రేవు పట్టణంలో శ్రామికవాడలో పెరిగాను. మా నాన్నగారు ఒక బాక్సింగ్‌ ఛాంపియన్‌. నేను, మా తమ్ముడు కూడా తరచూ బాక్సింగ్‌కి వెళ్లేవాళ్లం. నేను స్కూలుకు వెళ్లే రోజుల్లో నాతో ఎవరో ఒకళ్లు గొడవ పెట్టుకునేవాళ్లు, అలాంటివాళ్లకు ఏమాత్రం సంకోచించకుండా పిడిగుద్దులతో సమాధానం చెప్పేవాణ్ణి. టీనేజ్‌లో ఉన్నప్పుడు, పేరుమోసిన ఓ ముఠాలో చేరి, పెద్దపెద్ద కొట్లాటల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. నేను హెవీ-మెటల్‌ సంగీతం కూడా నేర్చుకున్నాను, ఎప్పటికైనా జనాన్ని ఉర్రూతలూగించేంత పెద్ద స్టార్‌ అవ్వాలని కలలుగన్నాను.

ఆ సంగీతంలో వాడే కొన్ని డ్రమ్స్‌ కొనుక్కుని, కొంతమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను; కొంతకాలానికే ఆ బృందంలో ముఖ్యమైన గాయకుణ్ణయ్యాను. నేను వేదిక మీద పాడేటప్పుడు, పిచ్చిపట్టినట్టు ఊగిపోయేవాణ్ణి. మా బృందం ఎప్పుడూ పొగరుగా, దూకుడుగా ఉండేది కాబట్టి మాకు క్రమేణా పేరుప్రఖ్యాతులు వచ్చాయి. కొంతకాలానికే ఎక్కువమంది ప్రేక్షకుల ముందు ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టాం, కొన్ని పాటల్ని రికార్డు చేశాం, వాటిలో చివరిదానికి మంచి స్పందన కూడా వచ్చింది. మా బృందం మరింత ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశంతో, 1987-90 మధ్యకాలంలో మేము అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోనూ లాస్‌ఏంజెల్స్‌లోనూ కొన్ని ప్రదర్శనలిచ్చాం. తిరిగి ఫిన్‌లాండ్‌కు వచ్చేముందు అక్కడి సంగీత పరిశ్రమలోని కొంతమందిని పరిచయం చేసుకున్నాం.

సంగీత బృందంలో ఉన్నందుకు సంతోషంగానే ఉన్నా, జీవితం ఎందుకో వెలితిగా అనిపించేది. సంగీత పరిశ్రమలో ఉన్నవాళ్ల కరుకుతనాన్ని చూసి నిరాశా నిస్పృహలకు లోనయ్యాను, అర్థంపర్థం లేని నా జీవన విధానం మీద నాకే విరక్తి పుట్టింది. నేను చెడ్డవాణ్ణని నాకనిపించేది, నరకంలో మలమలా మాడిపోతానని భయమేసేది. నా సందేహాలు తీర్చుకోవడానికి రకరకాల మతసంబంధ పుస్తకాలు చదివేవాణ్ణి, దేవుణ్ణి సంతోషపెట్టడం నావల్ల కాదని ఓవైపు అనిపిస్తున్నా, సహాయం కోసం ఆయనకు తీవ్రంగా ప్రార్థించేవాణ్ణి.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే . . .

పోషణ కోసం దగ్గర్లోని పోస్టాఫీసులో పనిచేసేవాణ్ణి. ఓరోజు, అక్కడ పనిచేసే ఒకాయన యెహోవాసాక్షని తెలిసి, ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించాను. ఆయన బైబిలు ఉపయోగిస్తూ తర్కబద్ధంగా చెప్పిన జవాబులు నాలో ఆసక్తిని పెంచాయి, అందువల్ల ఆయన నాతో బైబిలు అధ్యయనం చేయడానికి నేను ఒప్పుకున్నాను. అధ్యయనం మొదలైన కొన్ని వారాలకు, ఒక మ్యూజిక్‌ ఆల్బమ్‌ తయారు చేసే ఆకర్షణీయమైన అవకాశం మా బృందానికి వచ్చింది, ఆ ఆల్బమ్‌ అమెరికాలో విడుదలయ్యే అవకాశం కూడా ఉందని చెప్పారు. జీవితంలో మళ్లీ ఇలాంటి అవకాశం రాదని నాకనిపించింది.

నేను ఆ ఒక్క ఆల్బమ్‌ మాత్రమే చేస్తానని, ఆ తర్వాత పూర్తిగా బైబిలు సూత్రాల ప్రకారమే జీవిస్తానని నాతో అధ్యయనం చేస్తున్న యెహోవాసాక్షితో చెప్పాను. దానికి ఆయన తన అభిప్రాయాన్ని చెప్పకుండా, మత్తయి 6:24లోని యేసు మాటల్ని చదవమన్నాడు. ఆ వచనంలో, “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు” అని ఉంది. యేసు మాటల్లోని భావం అర్థమైనప్పుడు నాకు నోట మాటరాలేదు. కానీ కొన్నిరోజుల తర్వాత ఆ సహోదరునితో, యేసును అనుసరించాలనుకుంటున్నానని, అందుకే నా బృందాన్ని వదిలేశానని చెప్పినప్పుడు ఆయనకు నోట మాటరాలేదు!

బైబిలు ఒక అద్దంలా నా లోపాలను నాకు చూపింది. (యాకోబు 1:22-25) నేను చాలా మొరటుగా ప్రవర్తిస్తున్నానని అర్థమయ్యింది. నాకు చాలా గర్వం, పేరుప్రఖ్యాతల మీద విపరీతమైన మోజు ఉండేవి. బూతులు మాట్లాడేవాణ్ణి, కొట్లాటలకు దిగేవాణ్ణి, పొగతాగేవాణ్ణి, అతిగా మద్యం సేవించేవాణ్ణి. నా జీవితం బైబిలు సూత్రాలకు ఎంత విరుద్ధంగా ఉందో తెలుసుకున్న తర్వాత నా మీద నాకే కోపం వచ్చింది. వాటిని వదులుకోవడం కష్టంగా అనిపించినా, అవసరమైన మార్పులు చేసుకోవడానికి సిద్ధపడ్డాను.—ఎఫెసీయులు 4:22-24.

‘మన పరలోక తండ్రి దయగలవాడు, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడేవాళ్ల గాయాలను నయం చేయాలనుకుంటున్నాడు’

చేసిన తప్పులు గుర్తొచ్చి, మొదట్లో పశ్చాత్తాపంతో కుమిలిపోయేవాణ్ణి. అయితే, నాతో బైబిలు అధ్యయనం చేసిన యెహోవాసాక్షి నాకు చాలా సహాయం చేశాడు. ఆయన బైబిలు తెరచి, యెషయా 1:18లోని ‘మీ పాపములు రక్తమువలె ఎర్రనివైనా, అవి హిమమువలె తెల్లబడును’ అనే మాటలు నాకు చూపించాడు. ఈ వచనాన్నీ బైబిల్లోని మరితర వచనాల్నీ చూసిన తర్వాత, మన పరలోక తండ్రి దయగలవాడని, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడేవాళ్ల గాయాలను నయం చేయాలనుకుంటున్నాడని అర్థం చేసుకున్నాను.

నేను యెహోవా గురించి తెలుసుకొని, ఆయనను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితాన్ని ఆయనకు అంకితం చేయాలనుకున్నాను. (కీర్తన 40:8) 1992లో, రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను.

సేనెలా ప్రయోజనం పొందానంటే . . .

యెహోవా ఆరాధకుల్లో చాలామంది నాకు మంచి స్నేహితులయ్యారు. మేమంతా అప్పుడప్పుడూ కలుసుకొని, చక్కని సంగీతాన్ని వాయిస్తూ, దేవుడిచ్చిన సంగీతమనే బహుమానాన్ని ఆస్వాదిస్తున్నాం. (యాకోబు 1:17) నా ప్రియమైన భార్య క్రిస్టీనా నేను పొందిన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. నా కష్టసుఖాల్లో ఆమె నాకు తోడుగా ఉంది. నా గుండెలోతుల్లోని భావాలు కూడా ఆమెకు తెలుసు.

నేను యెహోవాసాక్షిని కాకపోయుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. గతంలో ఎంతసేపూ ఏదోక సమస్యతో సతమతమౌతూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడైతే నాకంటూ ఓ నిజమైన లక్ష్యం ఉంది, జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగుతుందని అనిపిస్తుంది. (w13-E 04/01)