కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఫిలిప్పీన్స్‌లో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఫిలిప్పీన్స్‌లో

దంపతులైన గ్రేగోర్యో, మారీలూ సుమారు 10 ఏళ్ల క్రితం మనీలాలో పూర్తికాల ఉద్యోగాలు చేస్తూ, పయినీరు సేవ చేస్తుండేవాళ్లు. అప్పుడు వాళ్లు 30వ పడిలో ఉన్నారు. అలా చేయడం కొంచెం కష్టంగా ఉన్నా వాళ్లు ఎలాగోలా చేయగలిగారు. ఆ తర్వాత మారీలూకి తను ఉద్యోగం చేస్తున్న బ్యాంకులో మేనేజర్‌గా ప్రమోషన్‌ వచ్చింది. “మా ఇద్దరికున్న మంచి ఉద్యోగాల వల్ల మేము ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపాం” అని మారీలూ అంటోంది. నిజానికి వాళ్ల ఆర్థికస్థితి ఎంత బాగుందంటే, మనీలాకు తూర్పున సుమారు 19 కిలోమీటర్ల దూరంలోని ఒక ఖరీదైన ప్రాంతంలో తమ అభిరుచికి తగ్గట్లుగా మంచి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇళ్లు కట్టించి ఇచ్చే ఒక కంపెనీని సంప్రదించి, దానికయ్యే మొత్తాన్ని 10 సంవత్సరాలపాటు నెలనెలా వాయిదాల్లో చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

“యెహోవాను దోచుకుంటున్నానని నాకు అనిపించింది”

మారీలూ ఇలా గుర్తుచేసుకుంది: “ఆ కొత్త పదవి నా సమయాన్ని, శక్తిని ఎంతగా హరించివేసేదంటే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఆసక్తి రానురాను సన్నగిల్లింది. నేను యెహోవాను దోచుకుంటున్నానని నాకు అనిపించింది. ఆయన సేవకోసం కేటాయించిన సమయాన్ని తర్వాత్తర్వాత ఆయనకు ఇవ్వలేకపోయాను.” తమ పరిస్థితి గురించి అసంతృప్తి చెందిన గ్రేగోర్యో, మారీలూ అసలు తమ జీవితాలు ఎటు వెళ్తున్నాయనే విషయం గురించి ఓ రోజు కూర్చుని మాట్లాడుకున్నారు. గ్రేగోర్యో ఇలా అంటున్నాడు: “ఏదో మార్చుకోవాలని మాకు అనిపించేదిగానీ ఖచ్చితంగా ఏ విషయంలో మార్పు అవసరమో మాకు అర్థంకాలేదు. మాకు పిల్లలు కూడా లేరు కాబట్టి, మా జీవితాలను మరింత ఎక్కువగా యెహోవా సేవలో ఎలా ఉపయోగించవచ్చో మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఈ విషయంలో సరైన దారి చూపమని యెహోవాను వేడుకున్నాం.”

రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేయడం గురించి ఆ సమయంలో వాళ్లు ఎన్నో ప్రసంగాలు విన్నారు. “ఆ ప్రసంగాల ద్వారా యెహోవా మా ప్రార్థనలకు జవాబిచ్చాడని మాకనిపించింది” అని గ్రేగోర్యో గుర్తుచేసుకున్నాడు. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేయమని వాళ్లిద్దరు ప్రార్థించారు. అయితే వాళ్ల ముందున్న అతిపెద్ద అడ్డంకి, నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇల్లే. వాళ్లు అప్పటికే మూడు సంవత్సరాల వాయిదాలు చెల్లించేశారు. వాళ్లప్పుడు ఏం చేశారు? మారీలూ ఇలా అంటోంది: “మేము ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఇప్పటిదాకా కట్టిన చాలా డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కానీ యెహోవా చిత్తానికి మొదటి స్థానం ఇవ్వాలో లేదా సొంత కోరికలకు ఇవ్వాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చిందని మాకనిపించింది.” క్రీస్తు కోసం సమస్తాన్ని ‘నష్టంగా ఎంచాను’ అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకుని, వాళ్లు ఆ ఇంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు; తర్వాత ఉద్యోగాలు వదిలేసి, తమ వస్తువుల్లో చాలావాటిని అమ్మేసి, దక్షిణ మనీలాకు సుమారు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలావన్‌ దీవిలోని ఓ మారుమూల పల్లెటూరికి వెళ్లి సేవచేయడం మొదలుపెట్టారు.—ఫిలి. 3:8.

వాళ్లు రహస్యం తెలుసుకున్నారు

గ్రేగోర్యో, మారీలూ అక్కడికి వెళ్లడానికి ముందే సాదాసీదా జీవితం గడపడం అలవాటు చేసుకున్నారు. అయితే తాము వెళ్లబోయే ప్రాంతంలో కనీస సౌకర్యాలు కూడా లేవని అక్కడికి వెళ్లాకే వాళ్లకు తెలిసింది. మారీలూ ఇలా అంటోంది: “అక్కడి పరిస్థితి చూసి నాకు నోట మాట రాలేదు. కరెంటు లేదు, ఏ సౌకర్యాలూ లేవు. ఇదివరకైతే స్విచ్చేస్తే కుక్కర్‌లో అన్నం ఉడికేది, కానీ ఇప్పుడు మేమే కట్టెలు కొట్టి, పొయ్యిలో వండుకోవాలి. షాపింగ్‌కు వెళ్లడం, హోటల్‌లో తినడం వంటివాటితోపాటు నగరంలో ఉండే ఇతర సౌఖ్యాలను కోల్పోతున్నట్లుగా నాకనిపించింది.” కానీ తాము ఇక్కడికి రావడానికి గల కారణాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ కొంతకాలానికే వాళ్లిద్దరూ ఆ పరిస్థితులకు అలవాటుపడ్డారు. మారీలూ ఇలా అంటోంది: “ఇప్పుడు నేను రాత్రిపూట మిలమిలలాడే నక్షత్రాలను చూస్తూ సృష్టిలోని అందాన్ని ఆస్వాదిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా సువార్త వినేవాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందం చూసి సంతోషంతో పొంగిపోతున్నాను. ఇక్కడ సేవ చేయడం ద్వారా మేము సంతృప్తిగా ఉండడానికి గల రహస్యం తెలుసుకున్నాం.”—ఫిలి. 4:12.

“కొత్తవాళ్లు సంఘంలోకి రావడం చూస్తుంటే కలిగే ఆనందానికి ఏదీ సాటిరాదు. గతంలో కన్నా మా జీవితాలకు ఇప్పుడు మరింత అర్థం చేకూరింది.”—గ్రేగోర్యో, మారీలూ

గ్రేగోర్యో ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మేము వచ్చినప్పుడు ఇక్కడ నలుగురు సాక్షులు మాత్రమే ఉన్నారు. నేను ఇక్కడ ప్రతీవారం బహిరంగ ప్రసంగాలు ఇవ్వడం చూసి, కూటాల్లో రాజ్య గీతాలు ఆలపిస్తున్నప్పుడు గిటార్‌ వాయించడం చూసి వాళ్లు ఎంతో సంతోషించారు.” ఏడాది తిరిగేసరికి ఆ చిన్న గుంపు, 24 మంది ప్రచారకులుగల సంఘంగా ఎదగడాన్ని ఈ దంపతులు చూశారు. “సంఘంలోని వాళ్లు చూపించిన ప్రేమ మా మనసుల్లో చెరగని ముద్ర వేసింది” అని గ్రేగోర్యో అన్నాడు. ఆ మారుమూల ప్రాంతంలో చేసిన ఆరేళ్ల సేవను గుర్తుచేసుకుంటూ వాళ్లిలా అంటున్నారు: “కొత్తవాళ్లు సంఘంలోకి రావడం చూస్తుంటే కలిగే ఆనందానికి ఏదీ సాటిరాదు. గతంలో కన్నా మా జీవితాలకు ఇప్పుడు మరింత అర్థం చేకూరింది.”

‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను!’

రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి సేవచేయాలనే ఉద్దేశంతో దాదాపు 3,000 మంది సహోదరసహోదరీలు ఫిలిప్పీన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. వాళ్లలో దాదాపు 500 మంది ఒంటరి సహోదరీలే. వాళ్లలో ఒకరైన కారెన్‌ అనుభవం ఇప్పుడు చూద్దాం.

కారెన్‌

ప్రస్తుతం 20వ పడిలో ఉన్న కారెన్‌, కాగయాన్‌లోని బాగౌలో పెరిగి పెద్దయ్యింది. మరింత ఎక్కువగా పరిచర్య చేయాలని ఆమె టీనేజీలో ఉన్నప్పటినుండే తరచూ ఆలోచించేది. ఆమె ఇలా అంటోంది: “అంతానికి ఇంకెంతో కాలం లేదని, అన్నిరకాల ప్రజలు సువార్త వినాల్సిన అవసరం ఉందని నాకు తెలుసు కాబట్టి, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లాలని కోరుకున్నాను.” ప్రకటించడానికి మారుమూల ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నత చదువులు చదవమని కొంతమంది కుటుంబ సభ్యులు ఆమెను ఒత్తిడి చేశారు, దాంతో ఆమె నిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థించింది. మారుమూల ప్రాంతాల్లో పయినీరు సేవచేస్తున్న వాళ్లతో కూడా ఆమె మాట్లాడింది. 18 ఏళ్ల వయసప్పుడు, తన సొంతూరికి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి సేవ మొదలుపెట్టింది.

ఆమె వెళ్లిన ఆ చిన్న సంఘానికి చెందిన క్షేత్రంలో పసిఫిక్‌ తీరానికి దగ్గర్లోని పర్వత ప్రాంతం ఉంది. “బాగౌ నుండి ఆ కొత్త సంఘానికి చేరుకోవడానికి మేము పర్వతాల్ని ఎక్కుతూ దిగుతూ మూడు రోజులు నడిచాం, 30 కంటే ఎక్కువసార్లు నదులను దాటాం” అంటూ కారెన్‌ గుర్తుచేసుకుంది. తర్వాత, ఆమె ఇలా అంటోంది: “కొంతమంది బైబిలు విద్యార్థుల దగ్గరికి వెళ్లడానికి నేను 6 గంటలు నడిచేదాన్ని, రాత్రికి వాళ్ల ఇంట్లోనే ఉండి, తర్వాతి రోజు మళ్లీ 6 గంటలు నడిచి ఇంటికి చేరుకునేదాన్ని.” అంతగా ప్రయాసపడడం వల్ల ఆమెకు ఏమైనా ఫలితం దక్కిందా? కారెన్‌ చిరునవ్వుతో ఇలా చెబుతోంది: “కొన్నిసార్లు కాళ్లు నొప్పిపెట్టేవి. కానీ నేను 18 దాకా బైబిలు అధ్యయనాలు నిర్వహించాను, ‘యెహోవా ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నాను.’”—కీర్త. 34:8.

“యెహోవా మీద ఆధారపడడం నేర్చుకున్నాను”

సూకీ

40వ పడిలో ఉన్న సూకీ అనే ఒంటరి సహోదరి అమెరికా నుండి ఫిలిప్పీన్స్‌కి వెళ్లేలా ఏది కదిలించింది? 2011లో ఒక ప్రాంతీయ సమావేశంలో ఆమె ఒక పయినీరు దంపతుల ఇంటర్వ్యూ విన్నది. ఆ ఇంటర్వ్యూలో, వాళ్లు మెక్సికోకు వెళ్లి ప్రకటించేందుకు వీలుగా తమ వస్తువుల్లో చాలా వాటిని ఎలా అమ్మేశారో ఆ దంపతులు వివరించారు. సూకీ ఇలా గుర్తుచేసుకుంది: “గతంలో నేను ఏమాత్రం ఆలోచించని లక్ష్యాల గురించి ఆలోచించేలా ఆ ఇంటర్వ్యూ నన్ను కదిలించింది.” భారత సంతతికి చెందిన సూకీ, ఫిలిప్పీన్స్‌లో పంజాబీ భాష మాట్లాడే చాలామందికి సహాయం అవసరమని తెలుసుకుని, అక్కడికి వెళ్లి వాళ్లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. మరి ఆమెకు ఏవైనా ఆటంకాలు ఎదురయ్యాయా?

ఆమె ఇలా అంది: “ఏయే వస్తువులను అమ్మేయాలో, వేటిని ఉంచుకోవాలో నిర్ణయించుకోవడం నాకు చాలా కష్టమైంది. 13 సంవత్సరాల పాటు సుఖంగా జీవించిన నా సొంత అపార్ట్‌మెంట్‌ను వదిలిపెట్టి, కుటుంబంతో సహా అద్దె ఇంట్లోకి మారాను. అలా చేయడం కొంచెం ఇబ్బందే అయినా, సాదాసీదా జీవితానికి నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి అది చక్కని మార్గంగా అనిపించింది.” అయితే ఫిలిప్పీన్స్‌కు వెళ్లాక ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? “పురుగుల భయం, ఇంటిబెంగ చాలా పెద్ద ఇబ్బందులుగా అనిపించాయి. కానీ గతంలో కన్నా మరింతగా యెహోవా మీద ఆధారపడడం నేర్చుకున్నాను.” దానివల్ల ఆమె ఏమైనా ప్రయోజనం పొందిందా? సూకీ చిన్నగా నవ్వి ఇలా అంటోంది: “నన్ను పరీక్షించి, నేనెంత విస్తారంగా దీవెనలు ఇస్తానో చూడండని యెహోవా మనతో చెబుతున్నాడు. ఆ మాటలు ఎంత నిజమో ఓ రోజు ఒక మహిళతో మాట్లాడుతుంటే అర్థమైంది. ‘నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీరు మళ్లీ ఎప్పుడు వస్తారు?’ అని ఆ మహిళ నాతో అంది. సత్యం తెలుసుకోవాలనే కోరికగల వాళ్లకు సహాయం చేస్తున్నందుకు చెప్పలేని ఆనందం, సంతృప్తి కలుగుతున్నాయి.” (మలా. 3:10) సూకీ ఇంకా ఇలా అంటోంది: “వేరే ప్రాంతానికి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం ఒక్కటే నాకు చాలా కష్టమైంది, అయితే నిర్ణయం తీసుకుని వెళ్లాక యెహోవా ప్రతీ విషయంలో నాకు ఎలా సహాయం చేశాడో చూసి చాలా ఆశ్చర్యపోయాను.”

“నా భయాలను జయించాను”

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న సిమే అనే పెళ్లయిన సహోదరుడు ఆకర్షణీయమైన ఒక ఉద్యోగం కోసం ఫిలిప్పీన్స్‌ నుండి మధ్య ప్రాచ్య ప్రాంతంలోని ఒక దేశానికి వలసవెళ్లాడు. అక్కడ ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పర్యవేక్షకుని మాటలను, అలాగే పరిపాలక సభ సభ్యుడు ఇచ్చిన ఒక ప్రసంగాన్ని విని తన జీవితంలో యెహోవాకు మొదటిస్థానం ఇవ్వాలనే ప్రేరణ పొందాడు. ఆయనిలా ఒప్పుకున్నాడు: “కానీ ఉద్యోగం వదిలేయాలన్న ఆలోచన వస్తేనే భయంతో చెమటలు పట్టేవి.” అయినా సరే ఆయన ఉద్యోగం విడిచిపెట్టి ఫిలిప్పీన్స్‌కు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం ఆయనా, ఆయన భార్య హైడీ ఫిలిప్పీన్స్‌కు దక్షిణాన ఉన్న డావౌ డెల్‌ సూర్‌లోని విస్తారమైన క్షేత్రంలో సేవ చేస్తున్నారు. సిమే ఇలా అంటున్నాడు: “వెనక్కు తిరిగి చూసుకుంటే, ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే భయాన్ని జయించి, యెహోవాకు మొదటి స్థానం ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. మన దగ్గరున్న శ్రేష్ఠమైన వాటిని యెహోవాకు ఇచ్చినప్పుడు కలిగే సంతృప్తి మరి దేనివల్లా రాదు!”

సిమే, హైడీ

“అది మాకు ఎంతో సంతృప్తినిచ్చింది!”

30వ పడిలో ఉన్న రామీలో, జూల్యట్‌ అనే పయినీరు దంపతులకు, వాళ్ల ఇంటికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సంఘంలో అవసరం ఎక్కువగా ఉందని తెలియడంతో సహాయం చేయడానికి వాళ్లు ముందుకొచ్చారు. వాతావరణం ఎలా ఉన్నా వాళ్లు ప్రతీవారం అక్కడి సంఘ కూటాలకు, పరిచర్యకు హాజరవ్వడానికి మోటర్‌సైకిల్‌ మీద వెళ్లేవాళ్లు. ఎత్తుపల్లాలున్న రోడ్లమీద, వేలాడే వంతెనల మీద ప్రయాణించడం కష్టంగా ఉన్నా మరింత ఎక్కువగా పరిచర్య చేస్తున్నందుకు వాళ్లు ఎంతో సంతోషిస్తున్నారు. రామీలో ఇలా అంటున్నాడు: “నేనూ నా భార్య కలిసి 11 బైబిలు అధ్యాయాలు నిర్వహిస్తున్నాం! అవసరం ఎక్కువ ఉన్నచోటికి వెళ్లి సేవ చేయాలంటే త్యాగాలు చేయాల్సిందే, కాని అలాచేయడం మాకు ఎంతో సంతృప్తిగా ఉంది.”—1 కొరిం. 15:58.

రామీలో, జూల్యట్‌

మీ దేశంలో లేదా విదేశాల్లో రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేయడం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ప్రాంతీయ పర్యవేక్షకునితో మాట్లాడండి, 2011 ఆగస్టు నెల మన రాజ్య పరిచర్యలోని “మీరు ‘మాసిదోనియకు’ వెళ్లగలరా?” అనే ఆర్టికల్‌ను చూడండి.