కంటెంట్‌కు వెళ్లు

ముఖపేజీ అంశం

మీ సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

మీ సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

“నాకు ఇంకాస్త టైం ఉంటే బాగుండేది!” అని మీరు ఎన్నిసార్లు అనుంటారు? టైం విషయంలో డబ్బున్నవాళ్ళు, పేదవాళ్ళు అనే తేడా లేదు. డబ్బున్నవాళ్లైనా, పేదవాళ్లైనా టైంను కొని దాచిపెట్టుకోలేరు. గడిచిపోయిన సమయాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరు. కాబట్టి ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం తెలివైన పని. అలా సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోడానికి సహాయం చేసే నాలుగు సూత్రాల్ని ఇప్పుడు చూద్దాం.

1వ సూత్రం: ప్రణాళిక వేసుకోండి

ముఖ్యమైన పనులు ముందు చేయండి. “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలని” బైబిలు చెప్తుంది. (ఫిలిప్పీయులు 1:10) ప్రాముఖ్యమైన పనులేంటో, అర్జెంటు పనులేంటో ఒక లిస్టు రాసి పెట్టుకోండి. అయితే ప్రాముఖ్యమైన పనులు అర్జెంటు కాకపోవచ్చు, అలాగే అర్జెంటు పనులు ప్రాముఖ్యం కాకపోవచ్చు అని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, భోజనం సిద్ధం చేసే పని ప్రాముఖ్యమైనదే కానీ అర్జెంటు కాకపోవచ్చు; ఇష్టమైన టీవీ ప్రోగ్రాం చూడడం అర్జెంటు పనే కావచ్చు కానీ ముఖ్యమైనది కాకపోవచ్చు.

ముందే ఆలోచించుకోండి. “ఇనుప పనిముట్టు మొద్దుబారినప్పుడు దానికి పదును పెట్టకపోతే, పనివాడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే తెలివితో విజయం సాధించవచ్చు” అని ప్రసంగి 10:10 చెప్తుంది. దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు? మీ పనిముట్టును పదును పెట్టుకోవడం ద్వారా, అంటే ఏం చేయాలో ముందుగానే ఆలోచించి పెట్టుకోవడం ద్వారా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. సమయాన్ని, శక్తిని వృథా చేసే అనవసరమైన పనుల్ని పక్కన పెట్టేయండి లేదా తర్వాత చేసుకోండి. మీరు చేస్తున్న పని పూర్తి అయిపోయాక ఇంకా సమయం మిగిలితే, రేపు చేయాల్సిన పనిని ఇప్పుడే చేసేయండి. అలా ముందుగానే ఆలోచించి పెట్టుకుంటే, పనిముట్టును పదును పెట్టుకునే పనివాడిలా మీరు కూడా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతారు.

పనులు తగ్గించుకోండి. అనవసరమైన పనులు, టైం ఎక్కువ తినేసే పనులు ఒప్పుకోకండి. మరీ ఎక్కువ పనులు పెట్టుకుంటే ఒత్తిడి పెరిగి సంతోషాన్ని కోల్పోతారు.

2వ సూత్రం: టైం వేస్ట్‌ చేసుకోకండి

వాయిదా వేయడం, ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోవడం. “గాలిని గమనించేవాడు విత్తడు, మేఘాల్ని చూసేవాడు పంట కోయడు.” (ప్రసంగి 11:4) దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు? పనులు వాయిదా వేయడం వల్ల టైం వేస్ట్‌ అవుతుంది, ఫలితం కూడా ఉండదు. ఒక రైతు అనుకూలమైన వాతావరణం కోసం ఎదురుచూస్తూ ఉంటే అతను ఎప్పటికీ విత్తనాలు విత్తలేడు, పంటను కోయలేడు. అదేవిధంగా మనం జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, ఎప్పటికీ ఎటూ తేల్చుకోలేం. అన్ని విషయాలు తెలిస్తేనే ఏం చేయాలో నిర్ణయించుకుంటాను అనుకుంటే ఎప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేం. అయితే, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలనే మాట వాస్తవమే. “వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు” అని సామెతలు 14:15 కూడా చెప్తుంది. కానీ చాలావరకు, మనం తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఖచ్చితంగా చెప్పలేం.—ప్రసంగి 11:⁠6.

పొరపాట్ల నుండి నేర్చుకోండి. “పరలోకం నుండి [లేదా దేవుని నుండి] వచ్చే తెలివి ... పట్టుబట్టే స్వభావం లేనిది” అని యాకోబు 3:17 చెప్తుంది. ఏ పనైనా బాగా చేయాలని అనుకోవడం మంచి విషయమే. కానీ మనం చేసే పనుల్లో అస్సలు తప్పులు దొర్లకూడదు అనుకుంటే మాత్రం నిరుత్సాహపడతాం, అనుకున్న పని కూడా చేయలేం. ఉదాహరణకు కొత్త భాష నేర్చుకోవాలనుకునే వ్యక్తి, అలా నేర్చుకునే క్రమంలో తప్పులు దొర్లుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా అస్సలు తప్పులు దొర్లకూడదు అనుకునే వ్యక్తి ఎప్పటికీ ప్రగతి సాధించలేడు. కాబట్టి లక్ష్యాలు పెట్టుకునేటప్పుడు మన సామర్థ్యాన్ని మనసులో ఉంచుకోవాలి. “అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది” అని సామెతలు 11:2 చెప్తుంది. కాబట్టి అణకువ, వినయం ఉన్నవాళ్లు తప్పులు దొర్లడం సహజమేనని గుర్తిస్తారు. అంతేకాదు అలా తప్పులు దొర్లినప్పుడు అవమానంగా భావించరు.

“నిజానికి మీరు వస్తువులను కొంటున్నది డబ్బుతో కాదు, మీ సమయంతో.”—వాట్‌ టు డు బిట్‌విన్‌ బర్త్‌ అండ్‌ డెత్‌

3వ సూత్రం: అన్నిటికీ తగిన సమయం ఇవ్వండి

పనితోపాటు విశ్రాంతి కూడా తీసుకోండి. “రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాస ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు.” (ప్రసంగి 4:6) కొంతమంది క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు, అలాంటి వాళ్లను పనిరాక్షసులు అంటారు. వాళ్లు తమ కష్టానికి వచ్చిన ప్రతిఫలాల్ని అనుభవించడానికి కూడా సమయం వెచ్చించరు. ఎందుకంటే వాళ్లు పని చేస్తూనే ఉంటారు కాబట్టి ఖాళీ ఉండదు; ఎక్కువ పని చేయడం వల్ల శక్తి కూడా ఉండదు. ఇంకొంతమంది బద్దకస్తుల్లా ఉంటూ, ఏ పనీ చేయకుండా ఖాళీగా గడుపుతూ తమ విలువైన సమయాన్ని వేస్ట్‌ చేసుకుంటారు. అయితే, మనం అటు పనిరాక్షసుల్లా ఉండకూడదు, ఇటు బద్దకస్తుల్లా కూడా ఉండకూడదు; బదులుగా కష్టపడి పనిచేయాలి, కష్టానికి వచ్చిన ప్రతిఫలాల్ని సంతోషించడానికి కూడా సమయం తీసుకోవాలని బైబిలు చెప్తుంది. అలా కష్టాన్ని బట్టి సంతోషించడం ‘దేవుడిచ్చే బహుమతి.’—ప్రసంగి 5:19.

కంటి నిండా నిద్రపోండి. “నేను పడుకుని ప్రశాంతంగా నిద్రపోతాను” అని ఒక బైబిలు రచయిత చెప్పాడు. (కీర్తన 4:8) పెద్దవాళ్లకు దాదాపు 8 గంటల నిద్ర అవసరం. అప్పుడే వాళ్లు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు, మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. కంటినిండా నిద్రపోయేవాళ్లకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి; దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. అదే గనుక సరిగ్గా నిద్రపోకపోతే నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాదు యాక్సిడెంట్లు జరుగుతాయి, పనులు సరిగ్గా చేయలేరు, చిరాకు కూడా పెరుగుతుంది.

మీ సామర్థ్యానికి తగిన పనుల్నే ఎంచుకోండి. “కోరికల వెంట పరుగెత్తే బదులు కళ్లముందు ఉన్నవాటిని ఆస్వాదించడం మేలు.” (ప్రసంగి 6:9) దీన్నుండి ఏం నేర్చుకోవచ్చు? తెలివైన వ్యక్తి కోరికల వెంట పరుగులు తీయడు, ముఖ్యంగా తన సామర్థ్యానికి మించిన వాటిని లేదా ఎప్పటికీ తీర్చుకోలేని వాటిని కోరుకోడు. కాబట్టి ఆకర్షణీయమైన ప్రకటనలు, సులభ వాయిదా పద్ధతులు లాంటి యాడ్‌లు చూసి అతను మోసపోడు. బదులుగా ‘తన కళ్ల ముందు ఉన్నవాటితో,’ అంటే తాను సంపాదించుకునేవాటితో తృప్తిపడతాడు.

4వ సూత్రం: మంచి విలువలు పాటించండి

మీకు ఎలాంటి విలువలు ఉన్నాయో పరిశీలించుకోండి. మంచి విలువలు ఉంటేనే ఏది శ్రేష్ఠమైనదో, ఏది ముఖ్యమైనదో, ఏది అవసరమైనదో గుర్తించగలుగుతారు. మీకున్న విలువల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీకు మంచి విలువలు ఉంటే ప్రాముఖ్యమైన వాటికి మీ జీవితంలో మొదటి స్థానం ఇస్తారు. దానివల్ల ప్రతీ గంటను, ప్రతీ రోజును శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోగలుగుతారు. మరి, మంచి విలువలు కలిగివుండాలంటే ఏం చేయాలి? ఆ విషయంలో చాలామంది బైబిలు సహాయం తీసుకున్నారు, ఎందుకంటే దానిలో తెలివైన సలహాలు ఉన్నాయని వాళ్లు గుర్తించారు.—సామెతలు 2:6, 7.

ప్రేమే అన్నింటికన్నా ప్రాముఖ్యమైన విలువని గుర్తించండి. “ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది” అని కొలస్సయులు 3:14 చెప్తుంది. కుటుంబంలో సంతోషం, భద్రత ఉండాలంటే ప్రేమ చాలా అవసరం. ఆ నిజాన్ని పట్టించుకోనివాళ్లు డబ్బుకు, కెరీర్‌కు మొదటి స్థానం ఇస్తారు; దానివల్ల సంతోషాన్ని కోల్పోతారు. ప్రేమ గురించిన ప్రస్తావన బైబిల్లో వందలసార్లు ఉంది, దాన్నిబట్టి అది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది.—1 కొరింథీయులు 13:1-3; 1 యోహాను 4:8.

దేవుని గురించి తెలుసుకోవడానికి సమయం వెచ్చించండి. జెఫ్‌ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు, మంచి స్నేహితులు ఉన్నారు. అతను అత్యవసర వైద్య విభాగంలో పనిచేస్తాడు. తన ఉద్యోగంలో భాగంగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడడం, చనిపోవడం అతను చూస్తుంటాడు. “మన జీవితం ఎందుకు ఇలా ఉంది?” అనే సందేహం అతనికి వచ్చింది. ఒకసారి అతను, యెహోవాసాక్షులు ప్రచురించిన కొన్ని పత్రికల్ని చదివాడు. తన ప్రశ్నలకు వాటిలో సంతృప్తికరమైన జవాబులు దొరికాయి.

జెఫ్‌ నేర్చుకుంటున్న విషయాలను తన భార్యాపిల్లలకు కూడా చెప్పాడు, వాళ్లు కూడా ఆసక్తి చూపించారు. అలా వాళ్లు కుటుంబంగా దేవుని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు; దానివల్ల తమ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోగలిగారు. భవిష్యత్తులో అనవసరమైన ఆందోళనలు, బాధలు, అనారోగ్య సమస్యలు ఉండవనీ, శాశ్వతకాలం జీవించవచ్చనీ కూడా వాళ్లు తెలుసుకున్నారు.​—⁠ప్రకటన 21:3, 4.

జెఫ్‌ అనుభవం యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటల్ని మనకు గుర్తు చేస్తుంది: “దేవుని నిర్దేశం తనకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.” (మత్తయి 5:3) మరి, దేవుని గురించి తెలుసుకోవడానికి మీరు కాస్త సమయం ఇవ్వగలరా? అలా ఇస్తే, మీరు ప్రతీ రోజును, మీ జీవితం మొత్తాన్ని తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటారు.