కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

పొలీయ బెర్రీకున్న మెరిసే బ్లూ కలర్‌

పొలీయ బెర్రీకున్న మెరిసే బ్లూ కలర్‌

ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే పొలీయ కన్‌డెన్సాటా అనే జాతి మొక్కకు వచ్చే చిన్న బెర్రీ చాలా మంచి బ్లూ కలర్‌లో ఉంటుంది. ఇలాంటి రంగు ఏ చెట్టుకీ కనపడదు. కానీ ఆ కాయలో బ్లూ కలర్‌ పుట్టించే పదార్థం లేదా పిగ్‌మెంట్‌ లేదు. మరి ఆ కాయకు అంత మెరిసే రంగు రావడానికున్న రహస్యం ఏంటి?

ఆలోచించండి: ఈ కాయ తొక్క మీద ఉండే కణాల గోడల్లో చిన్నచిన్న దారాలు ఉంటాయి. ఆ దారాలు అగ్గిపెట్టెలో పుల్లల్లా పక్కపక్కన పెట్టి ఉంటాయి. ఈ దారాలు పొరలు పొరలుగా ఏర్పడతాయి. ప్రతి పొర ఒకదాని మీద ఒకటి చిన్న కోణంలో పెట్టి ఉంటుంది. దానివల్ల ఈ పొరలన్నీ ఒక దాని మీద ఒకటి స్ప్రింగ్‌ ఆకారంలో చుట్టినట్లు కనిపిస్తాయి. ఈ దారాలు బ్లూ రంగులో ఉండవు కానీ ఆ దారాలు ఒక దాని మీద ఒకటి అమర్చబడిన విధానాన్ని బట్టి వాటికి ఆ రంగు వస్తుంది. అంటే అవి అమర్చబడిన విధానం వాటికి ఆ మెరిసే మెటాలిక్‌ రంగును తెస్తుంది. అంతేకాని వాటిలో అలాంటి రంగు పుట్టించే పదార్థం ఏమీ లేదు. చాలా కణాలు బ్లూ రంగులో కనిపిస్తాయి. కానీ పొర పొరకి చిన్న మార్పు ఉండడం వల్ల వేర్వేరు కోణాల నుండి కొన్ని గ్రీన్‌ రంగులో, కొన్ని పింక్‌ రంగులో, కొన్ని యెల్లో రంగులో ఉంటాయి. అంతేకాదు దగ్గరగా చూసినప్పుడు ఆ రంగులు నున్నగా కనపడవు కానీ, కంప్యూటర్‌ స్క్రీన్‌ పైన రంగుల్లా చుక్కలు చుక్కలుగా లేదా పిక్సెల్స్‌లా ఉంటాయి.

పొలీయ బెర్రీల్లో రంగు పుట్టించే పదార్థం ఏమి ఉండదు కాబట్టి అవి చెట్టు నుండి ఊడి పడి పోయాక కూడా రంగు మారవు. నిజానికి దాదాపు వంద సంవత్సరాల క్రితం ఏరిన బెర్రీ కాయలు ఇప్పటికీ కొత్త కాయల్లా రంగు విరజిమ్ముతుంటాయి. బెర్రీలో తినడానికి గుజ్జు లేకపోయినప్పటికీ, అవి కేవలం విత్తనాలే అయినా చుట్టు ప్రక్కల ఉన్న పక్షుల్ని బాగా ఆకర్షిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.

పొలీయ బెర్రీలో రంగును పుట్టించే పదార్థం లేకుండా రంగు వచ్చే తత్వాన్ని (పిగ్‌మెంట్‌ ఫ్రీ కలర్‌) చూసి సైన్‌టిస్టులు వెలిసిపోని రంగులను, నకిలీ చేయలేని కొన్ని ప్రత్యేకమైన కాగితాలన్ని తయారు చేయాలని అనుకుంటున్నారు.

మీరేమంటారు? పొలీయ బెర్రీకున్న మంచి మెరిసే బ్లూ కలర్‌ దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా తయారుచేశారా?