కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఎలాంటివాడు?

దేవుడు ఎలాంటివాడు?

మనం ఒకరి లక్షణాలను ఎక్కువగా అర్థం చేసుకునే కొద్దీ, మనకు వాళ్ల గురించి బాగా తెలుస్తుంది, అలా వాళ్లతో మన స్నేహం బలంగా అవ్వవచ్చు. అలానే మనం దేవుని లక్షణాల గురించి ఎక్కువగా తెలుసుకునే కొద్దీ, ఆయన ఎలాంటివాడో మనం ఇంకా బాగా తెలుసుకుంటాం, అలా ఆయనతో మన స్నేహం బలంగా అవ్వవచ్చు. దేవునికున్న గొప్ప లక్షణాలన్నిటిలో నాలుగు చాలా ముఖ్యమైనవి: ఆయన శక్తి, తెలివి, న్యాయం, ప్రేమ.

దేవుడు శక్తిమంతుడు

యెహోవా, నీ అధికబలము చేత భూమ్యాకాశములను సృజించితివి.యిర్మీయా 32:17.

దేవుని శక్తికి నిదర్శనం ఆయన సృష్టిలో కనపడుతుంది. ఉదాహరణకు మీరు ఎండాకాలంలో బాగా ఎండగా ఉన్న ఒక రోజు బయట నిలబడినప్పుడు, మీ చర్మానికి ఏమి తెలుస్తుంది? సూర్యుని వేడి తెలుస్తుంది. అంటే, సృష్టికర్తగా యెహోవా శక్తికున్న ఫలితాలను మీరు అనుభవిస్తున్నారు. సూర్యుడు ఎంత శక్తిమంతుడు? సూర్యుని మధ్యలో ఉష్ణోగ్రత దాదాపు 2,70,00,000 డిగ్రీల ఫారన్‌హీట్‌ (1,50,00,000° C) ఉంటుంది. ప్రతి సెకనుకి, సూర్య గ్రహం కొన్ని వందల అణు బాంబులకు సమానమైన శక్తిని విడుదల చేస్తుంది.

కానీ మన సూర్య గ్రహం విశ్వంలో ఉన్న లెక్కలేనన్ని కోట్ల నక్షత్రాలతో పోలిస్తే చాలా చిన్నది. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం పెద్దపెద్ద నక్షత్రాల్లో ఒకటైన, UY స్కూటీ మధ్య కొలత సూర్యునికన్నా దాదాపు 1700 రెట్లు పెద్దది. ఒకవేళ సూర్యుని స్థానంలోకి UY స్కూటీ వస్తే, అది భూమిని మింగేసి, గురుగ్రహం కక్షను కూడా దాటి వెళ్లిపోతుంది. ఇది బహుశా యిర్మీయా అన్న మాటలను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. యెహోవా దేవుడు ఆకాశాన్ని, భూమిని, అంటే ఈ విశ్వమంతటినీ తన గొప్ప శక్తితో చేశాడని యిర్మీయా చెప్పాడు.

దేవుని శక్తి వల్ల మనం ఎలా ప్రయోజనం పొందగలం? మన జీవితం దేవుడు చేసిన సృష్టి మీద ఆధారపడి ఉంది. అంటే సూర్యుడు, ఇంకా భూమి మీదున్న మిగతా వనరులన్నిటి మీద ఆధారపడి ఉంది. దాంతోపాటు దేవుడు తన శక్తిని మన సొంత జీవితానికి ఉపయోగపడేలా కూడా వాడతాడు. ఎలా? మొదటి శతాబ్దంలో, దేవుడు యేసుకు నిజంగా ఎన్నో అద్భుతమైన పనులు చేసే శక్తిని ఇచ్చాడు. మనం ఇలా చదువుతాం: “గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు.” (మత్తయి 11:5) మరి ఇప్పుడు? “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే” అని అంటూ “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు” అని బైబిలు చెప్తుంది. (యెషయా 40:29, 31) దేవుడు మనకు “అసాధారణ శక్తి” ఇచ్చి మనకు వచ్చే కష్టాలను, పరీక్షలను తట్టుకునేలా చేయగలడు. (2 కొరింథీయులు 4:7) అలా ప్రేమతో మనకోసం తన గొప్ప శక్తిని ఉపయోగించే దేవునికి దగ్గర అవ్వాలని మీకు అనిపించడం లేదా?

దేవుడు జ్ఞానంగలవాడు

“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి.”కీర్తన 104:24.

మనం దేవుడు సృష్టించిన వాటి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆయనకున్న తెలివిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోతాం. బయోమిమెటిక్స్‌ లేదా బయోమిమిక్రీ (ప్రకృతిని అనుకరించడం) అనే ఒక పరిశోధనా రంగం ఉంది. దానిలో శాస్త్రజ్ఞులు యెహోవా సృష్టిని పరిశీలించి, ప్రకృతిలో ఉన్న అంశాలను, నమూనాలను తెలుసుకుని వాళ్లు తయారు చేసిన వాటిని ఇంకా మెరుగుపరుస్తుంటారు. చిన్న జిప్‌ నుండి విమానాల తయారీ వరకు అన్నీ ప్రకృతిని చూసి చేసినవే.

మనిషి కన్ను సృష్టిలో ఉన్న ఒక అద్భుతం

దేవుని తెలివి ఎంత అద్భుతమైనదో మనిషి శరీరాన్ని చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు కడుపులో శిశువు ఎలా తయారవుతుందో ఆలోచించండి. ఈ ప్రక్రియ మొదట ఫలదీకరణ జరిగిన ఒక కణంతో మొదలవుతుంది. అందులోనే అవసరమైన జన్యుపరమైన నిర్దేశాలన్నీ ఉంటాయి. ఆ కణం ఒకేలా ఉండే ఎన్నో కణాలుగా విడిపోతుంది. కానీ సరిగ్గా, సరైన సమయంలో, ఆ కణాలన్నీ వేర్వేరుగా తయారవ్వడం మొదలుపెట్టి కొన్ని వందల వేర్వేరు రకాలుగా అవుతాయి. అంటే రక్త కణాలు, నాడీ కణాలు, అస్థికణాలు అవుతాయి. త్వరలో అవయవ వ్యవస్థలు ఏర్పడి పని చేయడం మొదలుపెడతాయి. కేవలం తొమ్మిది నెలల్లో, మొదట ఏర్పడిన ఒక్క కణం కొన్ని కోట్ల కణాలున్న పూర్తి శిశువుగా వృద్ధి అవుతుంది. ఇలాంటి దాన్ని తయారు చేయడంలో ఉన్న జ్ఞానాన్ని చూసి చాలామంది బైబిలు రచయిత అన్న ఈ మాటలతో ఏకీభవిస్తారు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.”—కీర్తన 139:14.

దేవుని జ్ఞానం నుండి మనమెలా ప్రయోజనం పొందుతాము? మనం సంతోషంగా ఉండడానికి ఏమి కావాలో సృష్టికర్తకి తెలుసు. ఆయనకున్న విస్తారమైన జ్ఞానం, అవగాహన శక్తి నుండి, ఆయన మనకు తెలివైన మాటలను తన వాక్యమైన బైబిలు ద్వారా ఇస్తున్నాడు. ఉదాహరణకు, “మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి” అని బైబిలు మనకు చెప్తుంది. (కొలొస్సయులు 3:13) అవి తెలివైన మాటలు కావా? అవును. పరిశోధన ద్వారా తెలిసిన విషయం ఏంటంటే క్షమించే లక్షణం ఉంటే హాయిగా నిద్రపడుతుంది, బి.పి తగ్గుతుంది. అంతేకాదు డిప్రెషన్‌, ఇంకా మిగతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. దేవుడు ఒక తెలివైన మంచి స్నేహితునిలా మనకు ఎప్పుడూ సహాయపడే, ఉపయోగపడే సలహాలను ఇవ్వడం మానడు. (2 తిమోతి 3:16, 17) మీరు అలాంటి స్నేహితుడు కావాలని అనుకోవడం లేదా?

దేవుడు న్యాయం గలవాడు

“యెహోవా న్యాయమును ప్రేమించువాడు.”కీర్తన 37:28.

దేవుడు ఎప్పుడూ సరైనదే చేస్తాడు. నిజానికి “దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” (యోబు 34:10) ఆయన తీర్పులన్నీ న్యాయములు, కీర్తనకర్త యెహోవా గురించి ఇలా చెప్తున్నాడు: “న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు.” (కీర్తన 67:3) ఎందుకంటే “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును,” ఆయన్ని ఎవరూ వేషధారణతో మోసం చేయలేరు, ఆయన ఎప్పుడూ సత్యాన్ని కనిపెట్టి ఖచ్చితమైన తీర్పులు ఇవ్వగలడు. (1 సమూయేలు 16:7) అంతేకాదు, దేవుడికి భూమి మీద జరుగుతున్న ప్రతీ అన్యాయం, అక్రమం గురించి తెలుసు. త్వరలో ఆయన “భక్తిహీనులు దేశములో నుండకుండ” నిర్మూలం అవుతారని వాగ్దానం చేశాడు.—సామెతలు 2:22.

అయినప్పటికీ దేవుడు, శిక్షించడానికి తొందరపడే కఠినమైన జడ్జి కాదు. అవసరమైనప్పుడు ఆయన కరుణ కూడా చూపిస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది: చెడ్డవాళ్లు కూడా నిజంగా పశ్చాత్తాప పడితే వాళ్లపట్ల “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు.” ఇది నిజమైన న్యాయం కాదా.—కీర్తన 103:8; 2 పేతురు 3:9.

దేవుని న్యాయం నుండి మనమెలా ప్రయోజనం పొందుతాము? అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ దేశంలో, దేవునికి భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు. (అపొస్తలుల కార్యాలు 10:34, 35) మనం దేవుని న్యాయం నుండి ప్రయోజనం పొందుతాము ఎందుకంటే ఆయనకు పక్షపాతం లేదు, ఆయన ఒకర్ని ఎక్కువగా ఒకర్ని తక్కువగా చూడడు. మనం ఏ జాతికి, దేశానికి చెందినవాళ్లమైనా, ఎంత చదువుకున్నా, సమాజికంగా ఏ హోదాలో ఉన్నా ఆయన మనల్ని చేర్చుకుంటాడు, మనం ఆయన ఆరాధకులుగా ఉండవచ్చు.

దేవుడు పక్షపాతం లేనివాడు, ఆయన నిష్పక్షపాతం వల్ల మనం ఏ జాతివాళ్లమైనా, సామాజికంగా ఏ స్థానంలో ఉన్నా ప్రయోజనం పొందవచ్చు

మనం ఆయన న్యాయాన్ని అర్థం చేసుకుని ప్రయోజనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనకు మనస్సాక్షిని ఇచ్చాడు. మనస్సాక్షి మన “హృదయాల్లో రాసివుందని,” మనం చేసే పనులు మంచివో చెడ్డవో అది చూపిస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. (రోమీయులు 2:15) దీనివల్ల మనకున్న ప్రయోజనం ఏంటి? చక్కగా శిక్షణ ఇస్తే మన మనస్సాక్షి, చెడుపనులకు, అన్యాయానికి దూరంగా ఉండేలా మనల్ని నడిపిస్తుంది. ఇంకా మనం ఒకవేళ తప్పు చేస్తే, అది మనల్ని పశ్చాత్తాపపడేలా మన ప్రవర్తనను సరిదిద్దుకునేలా కూడా మనకు సహాయం చేయగలదు. నిజంగా, దేవునికున్న న్యాయమైన మనసుపై మంచి అవగాహన కలిగి ఉండడం మనకు సహాయం చేస్తుంది, ఆయనకు దగ్గర చేస్తుంది.

దేవుడు ప్రేమ

“దేవుడు ప్రేమ.”1 యోహాను 4:8.

దేవుడు శక్తిని, తెలివిని, న్యాయాన్ని చూపిస్తాడు, కానీ బైబిల్లో ఎక్కడా దేవుడు శక్తి అని, తెలివి అని, న్యాయం అని చెప్పడం లేదు. అయితే, దేవుడు ప్రేమ అని చెప్తుంది. ఎందుకు? ఎందుకంటే దేవుని శక్తివల్ల ఆయన చర్య తీసుకోవడానికి వీలౌతుంది, ఆయన న్యాయం, తెలివి ఆయన ఎలా చర్య తీసుకుంటాడనే విషయాన్ని నిర్దేశిస్తాయి. కానీ యెహోవా ప్రేమ ఆయన చర్య తీసుకునేలా కదిలిస్తుంది. ఆయన చేసే ప్రతీదాన్ని ప్రేమే ప్రభావితం చేస్తుంది.

యెహోవాకు ఏదీ తక్కువ కాదు, కానీ ఆయన ప్రేమ పరలోకంలో, భూమి మీద తెలివైన ప్రాణుల్ని చేసేలా ఆయనను కదిలించింది, వాళ్లు ఆయన ప్రేమని, శ్రద్ధని అనుభవిస్తారు, వాటి నుండి ప్రయోజనం పొందుతారు. ఆయన నిస్వార్థంగా తాను చేసిన మానవకోటికి భూమిని అనువైన ఇల్లుగా తయారు చేశాడు. ఇంకా ఆయన “అందరి మీద అంటే దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు.” అలా మనుషులందరికీ తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు.—మత్తయి 5:45.

దాంతోపాటు, యెహోవా దేవుడు అనురాగాన్ని ఎంతో సున్నితంగా చూపిస్తాడు, ఆయన కరుణామయుడు. (యాకోబు 5:11) ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయనకు దగ్గర అవ్వడానికి నిజాయితీగా ప్రయత్నించే వాళ్లకు ఆయన తన అనురాగాన్ని చూపిస్తాడు. అలాంటి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు. నిజానికి “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది.”—1 పేతురు 5:7.

దేవుని ప్రేమ నుండి మనమెలా ప్రయోజనం పొందుతాము? మనం సూర్యాస్తమయంలో ఉన్న అందాన్ని ఆనందిస్తాము. పసిపిల్లల చిరునవ్వు వినడం మనకు ఎంతో ఇష్టం. మనకు సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల ప్రేమను మనం ఎంతో అమూల్యంగా చూస్తాం. ఇవన్నీ నిజంగా అవసరం కాకపోవచ్చు, కానీ అవి మన జీవితానికి మరింత అందాన్ని తెస్తాయి.

దేవుని ప్రేమకు నిదర్శనంగా ఉన్న మరో విషయం ద్వారా కూడా మనం ప్రయోజనం పొందుతాము. అది ప్రార్థన. బైబిలు ఇలా చెప్తుంది: “ఏ విషయంలోనూ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.” ఒక ప్రేమగల తండ్రిలా, మనకున్న అత్యంత అవసరమైన విషయాల్లో కూడా సహాయం కోసం ఆయన వైపు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు యెహోవా, ఆయనకున్న నిస్వార్థమైన ప్రేమతో ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతిని’ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు.—ఫిలిప్పీయులు 4:6, 7.

దేవునికున్న ముఖ్యమైన లక్షణాలైన శక్తి, జ్ఞానం, న్యాయం, ప్రేమ గురించిన ఈ చిన్న చర్చ దేవుడు ఎలాంటివాడో చక్కగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేసిందా? దేవుని గురించి మీరు ఇంకా అర్థం చేసుకోవడానికి, ఆయన మీ ప్రయోజనం కోసం ఏమి చేశాడు, ఇంకా ఏమి చేస్తాడు అనే విషయాల గురించి తెలుసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

దేవుడు ఎలాంటివాడు? యెహోవా అందరికన్నా శక్తిమంతుడు, తెలివి గలవాడు, న్యాయవంతుడు. కానీ ఆయనకున్న అత్యంత ప్రీతికరమైన లక్షణం ఆయన ప్రేమ