కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విలాసవంతమైన భవనాలు, పెద్దపెద్ద కట్టడాలు నీనెవె నగరంలో ఉండేవి

మీకు తెలుసా?

మీకు తెలుసా?

యోనా కాలం తర్వాత నీనెవె నగరానికి ఏమైంది?

సుమారు క్రీ.పూ. 670లో, అష్షూరు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా తయారైంది. అది “పశ్చిమ దిక్కులో ఉన్న కుప్ర నుండి తూర్పు దిక్కున ఉన్న ఇరాన్‌ వరకు, అలాగే ఒక సమయంలో ఈజిప్టు వరకు విస్తరించింది” అని బ్రిటీష్‌ మ్యూజియంకు సంబంధించిన ఒక వెబ్‌సైట్‌ చెప్తుంది. అష్షూరు రాజధాని నీనెవె ప్రపంచంలోనే అత్యంత పెద్ద నగరంగా ఉండేది. అక్కడ ఎన్నో అందమైన ఉద్యానవనాలు, విలాసవంతమైన భవనాలు, అలాగే పెద్దపెద్ద గ్రంథాలయాలు (లైబ్రరీలు) ఉండేవి. ప్రాచీన నీనెవెలోని గోడల మీదున్న రాతల్ని బట్టి, ఇతర అష్షూరు రాజుల్లాగే రాజైన అష్షూర్‌బనిపాల్‌ తనను తాను “ప్రపంచానికి రాజు” అని చెప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ సమయంలో అష్షూరుని, నీనెవె నగరాన్ని జయించడం అసాధ్యంగా అనిపించింది.

ప్రపంచ ఆధిపత్యమైన అష్షూరు ఆ సమయంలో భూమ్మీద అతిపెద్ద సామ్రాజ్యంగా ఉండేది

అయితే అష్షూరు చాలా శక్తివంతంగా తయారైనప్పుడు దేవుని ప్రవక్తయిన జెఫన్యా ఇలా ప్రవచించాడు: “[యెహోవా] . . . అష్షూరును నాశనం చేస్తాడు, నీనెవెను నిర్మానుష్యం చేస్తాడు, ఎడారిలా ఎండిపోయేలా చేస్తాడు.” దానితోపాటు ప్రవక్తయిన నహూము కూడా ఇలా రాశాడు: “వెండిని, బంగారాన్ని కొల్లగొట్టండి! . . . నగరం ఖాళీగా, నిర్మానుష్యంగా ఉంది; అది పాడైపోయింది! . . . నిన్ను చూసే ప్రతీ ఒక్కరు నీ దగ్గర నుండి పారిపోయి, ఇలా అంటారు: ‘నీనెవె పాడైపోయింది!’” (జెఫ. 2:13; నహూ. 2:9, 10; 3:7) ఆ ప్రవచనాల్ని విన్న ప్రజలు ఆశ్చర్యపోయి, ‘అసలు అలా జరుగుతుందా? శక్తివంతమైన అష్షూరును ఎవరైనా జయించగలరా?’ అని అనుకొని ఉంటారు. అది వాళ్లకు అసాధ్యంలా అనిపించివుంటుంది.

నీనెవె నిర్మానుష్యంగా, పనికిరాని స్థలంగా తయారైంది

ప్రజలు అస్సలు ఊహించనిదే జరిగింది! క్రీ.పూ. 600 సంవత్సరానికి కాస్త ముందు బబులోనీయులు అలాగే మాదీయులు అష్షూరును జయించారు. ఆ తర్వాత నీనెవె నిర్మానుష్యంగా మారింది. ప్రజలు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. మెట్రోపోలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ ఒక పత్రికలో ఇలా రాసింది: “ఆ నగరం నిర్మానుష్యంగా మారి, లేకుండాపోయింది. ప్రజలకు నీనెవె గురించి కేవలం బైబిలు ద్వారానే తెలిసింది.” బిబ్లికల్‌ ఆర్కియాలజీ సొసైటీ ఇలా చెప్తుంది: “ఎంతో పేరు పొందిన అష్షూరు రాజధాని పూర్వం ఉండేదని ఎవ్వరికీ తెలీనుకూడా తెలీదు.” కానీ 1845లో పురాతన వస్తువుల్ని పరిశోధించే ఆస్టెన్‌ హెన్రీ లాయార్డ్‌, నీనెవె శిథిలాలను తవ్వడం మొదలుపెట్టాడు. ఆ తవ్వకాల్లో నీనెవె ఒక గొప్ప నగరంగా ఉండేదనీ కనుగొన్నాడు.

నీనెవె గురించిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరడాన్ని బట్టి, నేడున్న రాజకీయ శక్తులు నాశనమౌతాయని చెప్తున్న బైబిలు ప్రవచనాలు కూడా తప్పకుండా నెరవేరుతాయనే మన నమ్మకం బలపడుతుంది.—దాని. 2:44; ప్రక. 19:15, 19-21.