కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ఫిలిప్పును కలిసినప్పుడు ఇతియోపీయుడైన అధికారి ఏ వాహనంలో ప్రయాణిస్తున్నాడు?

కొత్త లోక అనువాదం బైబిల్లో “రథం” అని ఉపయోగించిన పదం, మూలభాషలో చాలారకాల వాహనాల్ని సూచించవచ్చు. (అపొ. 8:28, 29, 38) అయితే, ఇతియోపీయుడైన అధికారి మిలిటరీలో లేదా పందాల్లో ఉపయోగించే రథం కాకుండా చాలా పెద్ద వాహనంలో ప్రయాణించి ఉండవచ్చు. అలా చెప్పడానికి గల కొన్ని కారణాల్ని ఇప్పుడు చూద్దాం.

ఇతియోపీయుడు చాలా దూరం ప్రయాణించిన ఒక ఉన్నతాధికారి. ఆయన “రాణియైన కందాకే కింద పనిచేసేవాడు. అతను రాణి ఖజానా అంతటినీ చూసుకునేవాడు.” (అపొ. 8:27) మనకాలంలోని సూడాన్‌ అలాగే ఈజిప్ట్‌లోని దక్షిణ భాగం ఒకప్పటి ఇతియోపియాలో భాగంగా ఉండేది. బహుశా, ఆ ఇతియోపీయుడు తన ప్రయాణమంతటిలో ఒకేరకమైన వాహనంలో ప్రయాణించి ఉండకపోవచ్చు. అలాగే చాలా దూరం ప్రయాణించాడు కాబట్టి తనతోపాటు ఎక్కువ సామాన్లు తీసుకొని వెళ్లుండవచ్చు. మొదటి శతాబ్దంలో ప్రయాణించడానికి, నాలుగు చక్రాలు ఉండి పైకప్పు ఉన్న కొన్ని వాహనాల్ని ఉపయోగించేవాళ్లు. “అలాంటి వాహనాలు సామాన్లు పెట్టుకోవడానికి, ప్రయాణికులు సౌకర్యంగా ఉండడానికి, చాలా దూరాలు ప్రయాణించడానికి వీలుగా ఉండేవి” అని యాక్ట్స్‌—ఆన్‌ ఎక్సిజిటికల్‌ కామెంటరీ అనే పుస్తకం చెప్తుంది.

ఫిలిప్పు తనను కలిసే సమయానికి ఇతియోపీయుడు చదువుతున్నాడు. “ఫిలిప్పు రథం పక్కనే పరుగెత్తుతూ, ఆ వ్యక్తి [ఇతియోపీయుడైన అధికారి] యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతుండడం” విన్నాడు అని ఆ వృత్తాంతం చెప్తుంది. (అపొ. 8:30) సాధారణంగా, మనుషులు ప్రయాణించడానికి ఉపయోగించే రథాలు మెల్లగా వెళ్లేవి. అలా మెల్లగా వెళ్లడం వల్ల ఇతియోపీయుడైన అధికారి చదవగలిగాడు, ఫిలిప్పు కూడా ఆ రథాన్ని అందుకోగలిగాడు.

ఆ ఇతియోపీయుడు “ఫిలిప్పును రథం ఎక్కి తనతోపాటు కూర్చోమని వేడుకున్నాడు.” (అపొ. 8:31) సాధారణంగా, పందాల్లో ఉపయోగించే రథంలో కూర్చోవడానికి స్థలం ఉండేదికాదు. దాన్ని నడిపే వ్యక్తి నిల్చోవాల్సి వచ్చేది. కానీ మనుషులు ప్రయాణించడానికి ఉపయోగించే రథాల్లో ఇతియోపీయుడు అలాగే ఫిలిప్పు కూర్చోవడానికి సరిపడా స్థలం ఉండింది.

అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చెప్తున్న దాన్నిబట్టి, అలాగే చరిత్రలో ఉన్న మిగతా వాస్తవాల్ని బట్టి, మన ప్రచురణల్లో ఇతియోపీయుడైన అధికారి మిలిటరీలో లేదా పందాల్లో ఉపయోగించే చిన్న రథంలో కాదుగానీ పెద్ద రథంలో ప్రయాణించినట్టు చూపించే చిత్రాల్ని ఉపయోగించారు.