కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

ఒట్టు వేయడాన్ని యేసు ఎందుకు ఖండించాడు?

ధర్మశాస్త్రం ప్రకారం యూదులు కొన్ని నిర్దిష్టమైన సందర్భాల్లో, “దేవుని మీద ఒట్టేస్తున్నాను” లేదా “యెహోవా పేరుమీద ఒట్టేస్తున్నాను” అని చెప్పడం తప్పుకాదు. అయితే యేసు కాలంనాటికి ఆ పద్ధతి ఎంత సర్వసాధారణం అయిపోయిందంటే యూదులు ప్రతీ మాటకు ఒట్టు వేస్తుండేవాళ్లు. వాళ్లు చెప్పేది నిజమని అవతలి వ్యక్తిని బలంగా నమ్మించడం కోసం అలా చేసేవాళ్లు. కానీ అలాంటి పనికిరాని ఆచారాన్ని యేసు రెండుసార్లు ఖండించాడు. అంతేకాదు ఆయనిలా నేర్పించాడు, ‘మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టే ఉండాలి.’—మత్త. 5:33-37; 23:16-22.

థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ చెప్తున్నట్లు, ఒట్టు వేయడం లేదా తాము చెప్తున్నది నిజమని ప్రమాణం చేయడం యూదులకు ఎంత అలవాటుగా మారిందో అర్థంచేసుకోవడానికి టాల్ముడ్‌ సహాయం చేస్తుంది. ఎందుకంటే ఒట్టు వేసిన వాటిలో వేటికి ఖచ్చితంగా కట్టుబడాలో, వేటికి కట్టుబడకపోయినా ఫర్వాలేదో టాల్ముడ్‌లో చాలా వివరంగా ఉంటుంది.

ఈ తప్పుడు ఆచారాన్ని ఖండించింది యేసు మాత్రమే కాదు. ఉదాహరణకు, ఒట్టు వేయడాన్ని ఖండించిన ఒక యూదా తెగ గురించి యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ రాశాడు. ఒట్టు వేయడమనేది అబద్ధం చెప్పడంకన్నా ఘోరమైనదని ఆ తెగకు చెందినవాళ్లు నమ్మేవాళ్లు. అంతేకాదు తాను చెప్తున్నది నిజమని ఎదుటివాళ్లను నమ్మించడం కోసం ఒక వ్యక్తి ఒట్టేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా అబద్ధాలకోరు అయ్యుంటాడని వాళ్లు అనుకునేవాళ్లు. యూదుల పుస్తకమైన విజ్‌డమ్‌ ఆఫ్‌ సిరాక్‌ ఇలా చెప్తోంది, ‘ఒట్టువేసే వ్యక్తి వట్టి నీతిలేనివాడు.’ ప్రతీ చిన్న విషయానికి ఒట్టు వేయడాన్ని యేసు ఖండించాడు. మనం ఎప్పుడూ నిజమే మాట్లాడితే మనం చెప్పేది నిజమని నమ్మించడానికి ఒట్టు వేయాల్సిన అవసరం రాదు.