కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల సంస్థ స్థాపకుడు ఎవరు?

యెహోవాసాక్షుల సంస్థ స్థాపకుడు ఎవరు?

 ఆధునిక కాలంలో, యెహోవాసాక్షుల సంస్థ 19వ శతాబ్దం చివర్లో మొదలైంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో, పిట్స్‌బర్గ్‌కు దగ్గర్లో నివసించిన కొంతమంది బైబిలు విద్యార్థులు బైబిలును ఒక క్రమపద్ధతిలో పరిశీలించడం మొదలుపెట్టారు. చర్చీలలో బోధించే సిద్ధాంతాలను బైబిలు నిజంగా బోధించే వాటితో పోల్చి చూశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలను పుస్తకాల్లో, వార్తాపత్రికల్లో, కావలికోట—యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అనే పత్రికలో ప్రచురించడం మొదలుపెట్టారు. కావలికోట పత్రికకు అప్పట్లో వేరే పేరు ఉండేది.

 చిత్తశుద్ధిగల ఆ బైబిలు విద్యార్థుల్లో ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ ఒకరు. అప్పట్లో బైబిలు విద్యా పనికి ఆయనే నాయకత్వం వహించినా, కావలికోట పత్రికకు ఆయనే మొదటి సంపాదకుడు అయినా ఆయన ఒక కొత్త మత స్థాపకుడు మాత్రం కాదు. రస్సెల్‌, ఇతర బైబిలు విద్యార్థులు (అప్పట్లో వాళ్లను అలా పిలిచేవారు) యేసుక్రీస్తు బోధలను వ్యాప్తి చేయడం, మొదటి శతాబ్ద క్రైస్తవ సంఘంలోని పద్ధతులను పాటించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రైస్తవ మత స్థాపకుడు యేసు కాబట్టి, మా సంస్థ స్థాపకుడు కూడా ఆయనే అని మేము పరిగణిస్తాం.—కొలొస్సయులు 1:18-20.