కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు పాత నిబంధనను నమ్ముతారా?

యెహోవాసాక్షులు పాత నిబంధనను నమ్ముతారా?

 అవును. యెహోవాసాక్షులు బైబిలంతా ‘దైవావేశం వల్ల కలిగిందని, ప్రయోజనకరమైందని’ నమ్ముతారు. (2 తిమోతి 3:16, 17) ప్రజలు సాధారణంగా “పాత నిబంధన,” “కొత్త నిబంధన” అని పిలిచే రెండూ బైబిల్లో ఉన్నాయి. యెహోవాసాక్షులు వాటిని “హీబ్రూ లేఖనాలు,” “క్రైస్తవ గ్రీకు లేఖనాలు” అని అంటుంటారు. అలా మేము, బైబిల్లోని కొన్ని భాగాలు పాతవి, పనికిరానివి అనే ఆలోచన ఇతరుల్లో కలిగించకుండా జాగ్రత్తపడతాం.

క్రైస్తవులకు పాత నిబంధన, కొత్త నిబంధన రెండూ ఎందుకు అవసరం?

 క్రైస్తవ అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరేపణతో ఇలా రాశాడు: “పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమీయులు 15:4) అంటే, హీబ్రూ లేఖనాల్లో మనకు ఉపయోగపడే ఎంతో విలువైన సమాచారం ఉంది. ఇతర విషయాలతో పాటు చారిత్రక వృత్తాంతాలు, ఆచరణాత్మక సలహాలు వాటిలో ఉన్నాయి.

  •   చారిత్రక వృత్తాంతాలు. హీబ్రూ లేఖనాల్లో, సృష్టి ఎలా జరిగింది? మానవులు పాపంలో ఎలా పడిపోయారు? అనే విషయాల గురించిన సవివరమైన సమాచారం ఉంది. ఒకవేళ ఆ సమాచారమే లేకపోతే, మనం ఎక్కడి నుండి వచ్చాం? మనుషులు ఎందుకు చనిపోతున్నారు? వంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు ఎప్పటికీ తెలుసుకోలేం. (ఆదికాండము 2:7, 17) అంతేకాక, మనలాంటి కష్టసుఖాలే అనుభవించిన ప్రజలతో యెహోవా దేవుడు వ్యవహరించిన తీరు గురించి కూడా హీబ్రూ లేఖనాల్లో ఉంది.—యాకోబు 5:17.

  •   ఆచరణాత్మక సలహాలు. హీబ్రూ లేఖనాల్లోని సామెతలు, ప్రసంగి పుస్తకాల్లో అన్నికాలాల్లోనూ ఉపయోగపడే జ్ఞానవంతమైన సలహాలున్నాయి. ఉదాహరణకు, కుటుంబ జీవితంలో సంతోషం పొందాలంటే ఏం చేయాలి? (సామెతలు 15:17) ఉద్యోగం పట్ల మన ఆలోచనా తీరు ఎలా ఉండాలి? (సామెతలు 10:4; ప్రసంగి 4:6) యౌవనులు తమ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవచ్చు? (ప్రసంగి 11:9–12:2) వంటివాటికి సంబంధించిన సలహాలు ఆ పుస్తకాల్లో ఉన్నాయి.

 అంతేకాక, తోరహ్‌ (బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు) అని కూడా పిలిచే మోషే ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కూడా మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. నేడు క్రైస్తవులు దాన్ని పాటించాల్సిన అవసరం లేకున్నా, మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడే చక్కని సూత్రాలు దానిలో ఉన్నాయి.—లేవీయకాండము 19:18; ద్వితీయోపదేశకాండము 6:5-7.