కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు కుటుంబాలను విడదీస్తారా?

యెహోవాసాక్షులు కుటుంబాలను విడదీస్తారా?

 యెహోవాసాక్షులుగా మేము మా కుటుంబాలతో పాటు తోటివాళ్ల కుటుంబాలను కూడా నిలబెట్టడానికే ప్రయత్నిస్తాం. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవున్ని గౌరవిస్తాం. (ఆదికాండము 2:21-24; ఎఫెసీయులు 3:14) కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలంగా ఉండడానికి, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడానికి సహాయం చేసే సూత్రాలను దేవుడు బైబిల్లో ఇచ్చాడు, అవి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి సహాయం చేశాయి.

కుటుంబ బంధాలను యెహోవాసాక్షులు ఎలా బలపరుస్తారు?

 బైబిలు ఇచ్చే సలహాలను పాటించడానికి మేము చేయగలిగినదంతా చేస్తాం. మంచి భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా ఉండడానికి అవి మాకు సహాయం చేస్తాయి. (సామెతలు 31:10-31; ఎఫెసీయులు 5:22-6:4; 1 తిమోతి 5:8) కొన్నిసార్లు ఒకే కుటుంబంలో వేర్వేరు మతనమ్మకాలున్న వాళ్లు కూడా ఉంటారు. బైబిల్లోని జ్ఞానం వాళ్లకు కూడా సహాయపడుతుంది. (1 పేతురు 3:1, 2) యెహోవాసాక్షులుగా మారిన తమ భార్య లేదా భర్త గురించి వాళ్ల భాగస్వాములు ఏమంటున్నారో చూడండి:

  •   “పెళ్లయిన మొదటి ఆరేళ్లు మేము గొడవలు పడుతూనే ఉండేవాళ్లం, చాలా చిరాకుగా ఉండేది. కానీ నా భార్య ఈవెటీ యెహోవాసాక్షిగా మారినప్పటి నుండి ఆమెలో ప్రేమ, సహనం మరింత పెరిగాయి. ఆమె చేసుకున్న మార్పులు మా కుటుంబాన్ని నిలబెట్టాయి.”—క్లాయీర్‌, బ్రెజిల్‌.

  •   “యెహోవాసాక్షులు కుటుంబాల్ని విడదీస్తారని నేను అనుకున్నాను. అందుకే నా భర్త ఛాన్సా, యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకుంటుంటే వద్దని చెప్పాను. అయితే బైబిలు నుండి తను నేర్చుకున్న విషయాలు మా ఇద్దర్నీ ఇంకా దగ్గర చేశాయి.”—ఆగ్నెస్‌, జాంబియా.

 బైబిల్లో ఉన్న జ్ఞానం మనకు ఎలా సహాయం చేస్తుందో మేము పరిచర్యలో కలిసినవాళ్లకు చెప్తాం. ఉదాహరణకు,

మతం మారడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయా?

 కొన్నిసార్లు వస్తాయనే చెప్పాలి. ఉదాహరణకు, సోఫ్రెస్‌ అనే పరిశోధనా కంపెనీ 1998లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం భార్యాభర్తల్లో కేవలం ఎవరో ఒక్కరు మాత్రమే యెహోవాసాక్షిగా మారిన కుటుంబాల్లో 5 శాతం మంది, మతం మారడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు.

 తన బోధల్ని పాటించేవాళ్లు కొన్నిసార్లు కుటుంబ కలహాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 10:32-36) రోమా సామ్రాజ్యంలో, “క్రైస్తవత్వం కుటుంబాల్ని విడదీస్తుంది అనే ఆరోపణ” ఉందని చరిత్రకారుడైన విల్‌ డ్యూరంట్‌ చెప్పాడు. a నేడు కూడా యెహోవాసాక్షుల్లో కొందరు అలాంటి ఆరోపణల్నే ఎదుర్కొంటున్నారు. అంటే దానర్థం కుటుంబంలో గొడవలకు కారణం సాక్షులేనా?

యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు (ECHR)

 యెహోవాసాక్షులు కుటుంబాల్ని విడదీస్తారు అనే ఆరోపణ మీద తీర్పు ఇస్తున్నప్పుడు యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు ఇలా చెప్పింది, “సొంత మతాన్ని అనుసరించే, ప్రచారం చేసే విషయంలో తమ కుటుంబ సభ్యునికి/సభ్యురాలికి ఉన్న స్వేచ్ఛను మతం పట్ల ఆసక్తిలేని కుటుంబ సభ్యులు గౌరవించలేకపోవడం, దాన్ని తిరస్కరించడమే గొడవలకు అసలు కారణం.” కోర్టు ఇంకా ఇలా చెప్పింది, “వేర్వేరు మతనమ్మకాలున్న భార్యభర్తలందరి మధ్య ఈ సమస్య ఉంది, యెహోవాసాక్షులు దానికి మినహాయింపేమీ కాదు.” b యెహోవాసాక్షులుగా మేము మతపరమైన హింస ఎదుర్కొంటున్నా, “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు ... శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అనే బైబిలు సూత్రాన్ని పాటించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం.—రోమీయులు 12:17, 18.

యెహోవాసాక్షులు తమ మతం వాళ్లనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు?

 మేము “ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అనే బైబిలు సలహాను పాటిస్తాం. అందుకే మా మతంలో ఉన్నవాళ్లనే పెళ్లి చేసుకుంటాం. (1 కొరింథీయులు 7:39) బైబిల్లో ఉన్న ఈ సలహాను పాటించడం తెలివైన పని అని చెప్పవచ్చు. ఉదాహరణకు, “భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మతాన్ని, ఆచారాల్ని, నమ్మకాల్ని పాటించే వాళ్లయితే” ఆ భార్యాభర్తలిద్దరి బంధం చాలా బలంగా ఉంటుంది అని జర్నల్‌ ఆఫ్‌ మ్యారేజ్‌ అండ్‌ ఫ్యామిలీ అనే పత్రిక 2010 సంచికలో వచ్చిన ఆర్టికల్‌ చెప్పింది. c

 అంతేకాదు, యెహోవాసాక్షికాని తమ భర్త లేదా భార్య నుండి విడిపొమ్మని యెహోవాసాక్షులు అస్సలు చెప్పరు. బైబిలు ఇలా చెప్తుంది: “ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.” (1 కొరింథీయులు 7:12, 13) యెహోవాసాక్షులుగా మేము ఈ ఆజ్ఞను పాటిస్తాం.

a సీజర్‌ అండ్‌ క్రైస్ట్‌ పుస్తకంలో 647వ పేజీ చూడండి.

b జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ మాస్కో అండ్‌ అదర్స్‌ v. రష్యా కేసులో ఇచ్చిన తీర్పులో 26-27 పేజీల్లో 111వ పేరా చూడండి.

c జర్నల్‌ ఆఫ్‌ మ్యారేజ్‌ అండ్‌ ఫ్యామిలీ వాల్యూమ్‌ 72, నం. 4, (ఆగస్టు 2010) చూడండి.