కంటెంట్‌కు వెళ్లు

“భూమధ్య రేఖ మీదున్న పచ్చరాయి”లోని బధిరులకు సహాయం చేయడం

“భూమధ్య రేఖ మీదున్న పచ్చరాయి”లోని బధిరులకు సహాయం చేయడం

భూమధ్య రేఖ మీదున్న పచ్చరాయి అని పిలవబడే ఇండోనేషియాలో లక్షలమంది బధిరులు నివసిస్తున్నారు. ఈ ప్రజలకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఇండోనేషియన్‌ సంజ్ఞా భాషలో ఎన్నో బైబిలు ఆధారిత ప్రచురణల్ని, విద్యా కార్యక్రమాల్ని రూపొందిస్తున్నారు. సాక్షులు చేస్తున్న ఈ కృషిని కొంతమంది గుర్తించారు.

సంజ్ఞా భాష సమావేశం

2016లో, ఉత్తర సుమాత్రలోని మేడాన్‌లో యెహోవాసాక్షులు ఇండోనేషియన్‌ సంజ్ఞా భాషలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతపు భద్రత అధికారుల్లో ఒక ముఖ్య అధికారి మన సమావేశానికి వచ్చాడు. యెహోవాసాక్షులు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా ఇలాంటి విద్యా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్లను మెచ్చుకున్నాడు. అక్కడ చూసిన వాటిని బట్టి ఆయన ఎంత కదిలించబడ్డాడంటే, ప్రేక్షకులతో కలిసి సంజ్ఞలు చేస్తూ పాట పాడడం మొదలుపెట్టాడు.

ఆ స్థలం మేనేజర్‌ సమావేశం గురించి ఇలా చెప్పాడు: “అది చాలా సురక్షితంగా, చక్కగా జరిగింది. బధిరులైన మా పొరుగువాళ్ల కోసం సాక్షులు ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.” అంతేకాదు ఆ సమావేశం బధిరుల కోసం ఏర్పాటు చేశారని ఆ స్థలం యజమానికి తెలిసినప్పుడు, “ఆయన సాక్షులకు ఏదైనా చేయాలని కోరుకున్నాడు. అందుకే, హాజరైన [మొత్తం 300] మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయమన్నాడు” అని ఆ మేనేజర్‌ చెప్పాడు.

సంజ్ఞా భాష వీడియోల పట్ల మెప్పుదల

బైబిలు సందేశాన్ని పంచుకోవడం కోసం యెహోవాసాక్షులు బధిరుల్ని వ్యక్తిగతంగా కూడా కలుస్తారు. ప్రజలు ఆనందంగా, సంతృప్తిగా జీవించడానికి సహాయం చేసేలా రూపొందించిన ఇండోనేషియన్‌ సంజ్ఞా భాషలోని వీడియోలను సాక్షులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

సెంట్రల్‌ జావాలోని సమారాంగ్‌ నగరానికి చెందిన “ఇండోనేషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద వెల్ఫేర్‌ ఆఫ్‌ ద డెఫ్‌” రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అయిన మాహెంద్ర టగూ ప్రిస్వంటో ఇలా చెప్పాడు: “బధిరుల పట్ల, వాళ్ల అవసరాల పట్ల శ్రద్ధతో మీరు చేస్తున్న పని నిజంగా మెచ్చుకోదగినది. ఉదాహరణకు, ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం అనే వీడియో ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పని ఇలాగే కొనసాగాలని మేం ఆశిస్తున్నాం.”

వాళ్లు “ప్రేమ చూపిస్తారు”

యంటి అనే బధిర స్త్రీ యెహోవాసాక్షులు చేస్తున్న ఈ పని చూసి ఎంతో ముగ్ధురాలైంది. ఆమె ఇలా చెప్తుంది: “ప్రజలు తరచూ బధిరులను ఎగతాళి చేస్తుంటారు, కానీ యెహోవాసాక్షులు వాళ్ల మీద ప్రేమ చూపిస్తారు. వినికిడి లోపం లేని చాలామంది సాక్షులు సంజ్ఞా భాష నేర్చుకుని బధిరులు తమ సృష్టికర్తను తెలుసుకునేలా, తమ జీవితాల్ని మెరుగుపర్చుకునేలా సహాయం చేస్తుంటారు. వాళ్లు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నాలు నన్ను ఎంతో కదిలించాయి.”

యంటి యెహోవాసాక్షి అయి ఇండోనేషియన్‌ సంజ్ఞా భాషలో సంజ్ఞా భాష వీడియోలను రూపొందించే అనువాద టీంలో పని చేస్తుంది. ఆమె ఇలా చెప్తుంది: “మేం రూపొందించిన వీడియోలు సంజ్ఞా భాష అంతగా రానివాళ్లు ఆ భాషను నేర్చుకోవడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు అవి సంతోషకరమైన, అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో కూడా ప్రజలకు బోధిస్తాయి.”