కంటెంట్‌కు వెళ్లు

వాళ్లు ఆగి సహాయం చేశారు

వాళ్లు ఆగి సహాయం చేశారు

 కెనడాలో ఉన్న అల్బర్టాలో బాగా చల్లగా, గాలులు వీస్తున్న ఒక రోజు బాబ్‌ అనే అతను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వ్యాన్‌ను నడుపుతున్నాడు. అప్పుడు వెనక టైర్‌ పంక్చర్‌ అయింది. ఏమి జరిగిందో మొదట బాబ్‌కు తెలీలేదు, కాబట్టి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి ఆగకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

 స్థానిక యెహోవాసాక్షుల సంఘానికి రాసిన ఉత్తరంలో తర్వాత ఏమి జరిగిందో బాబ్‌ వివరించాడు. ఆయన ఇలా రాశాడు, “వేరే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు నా పక్కకు వచ్చి వాళ్ల కిటికీ అద్దాన్ని దించారు. వ్యాన్‌ టైర్‌ పంక్చర్‌ అయిందని నాకు చెప్పారు. మేము మా వాహనాలను పక్కకు ఆపుకున్నాక, వాళ్లు టైర్‌ని మారుస్తామని అడిగారు. వేరే టైర్‌ గానీ, జాక్‌ గానీ ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు. నేను హైవే పక్కనే నా చక్రాల కుర్చీలో కూర్చుని ఉండగా, వాళ్లు వ్యాన్‌ కిందకి వెళ్లి అక్కడ అదనంగా ఉన్న టైర్‌ని, జాక్‌ని తీసి, టైర్‌ మార్చారు. గడ్డ కట్టిపోయేంత చల్లగా ఉంది, మంచు కురుస్తూ ఉంది. వాళ్లు చాలా మంచి బట్టలు వేసుకుని ఉన్నారు, కానీ వాళ్లు టైర్‌ మార్చి, నేను చక్కగా మళ్లీ వెళ్లగలిగేలా సహాయం చేశారు. నేను ఒక్కడినే ఆ పని చేయగలిగే వాడిని కాదు.”

 “నాకు సహాయం చేసిన ఆ ఐదుగురు పిల్లలకు చాలా థాంక్స్‌. వాళ్లు ఆ ప్రాంతంలో ప్రజలకు ప్రకటించడానికి వెళ్తూ దారిలో ఉన్నారు. ఈ పిల్లలు వాళ్లు చెప్పిన విషయాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. వాళ్లు నన్ను చాలా పెద్ద కష్టం నుండి బయట పడేశారు. నేను వాళ్లకు నిజంగా రుణపడి ఉంటాను. ఆ రోజు హైవేలో అలాంటి యువ దేవదూతలు ఉంటారని ఎవరికి తెలుసు?”