కంటెంట్‌కు వెళ్లు

“నేను చేయగలిగింది నేను చేస్తాను”

“నేను చేయగలిగింది నేను చేస్తాను”

జర్మనీలో నివసిస్తున్న అర్మ అనే ఆమెకు దాదాపు 90 సంవత్సరాలు. రెండు పెద్ద ప్రమాదాలు, చాలా ఆపరేషన్లు జరగడం వల్ల ఆమె ఇదివరకులా ఇంటింటికి వెళ్లి పరిచర్య చేయలేకపోతుంది. అర్మ ఇప్పుడు తన విశ్వాసం గురించి బంధువులకు, తెలిసినవాళ్లకు ఉత్తరాలు రాయడం ద్వారా చెప్తుంది. అర్మ ప్రోత్సహిస్తూ రాసే ఉత్తరాలు, ప్రియమైనవాళ్లు చనిపోయిన బాధలో ఉన్నవాళ్లను ఓదారుస్తూ రాసే ఉత్తరాలంటే వాటిని పొందినవాళ్లకు ఎంతో ఇష్టం. తర్వాత ఉత్తరం ఎప్పుడు వస్తుందో అడగడానికి వాళ్లు ఆమెకు ఫోన్‌ చేస్తారు. కృతజ్ఞతలు చెప్తూ, మళ్లీ రాయమని అడిగే ఉత్తరాలు కూడా ఆమెకు చాలా వస్తాయి. “ఇదంతా నాకు చాలా సంతోషాన్ని తెస్తుంది, ఆధ్యాత్మికంగా నన్ను చురుకుగా ఉంచుతుంది” అని అర్మ చెప్తుంది.

అర్మ వృద్ధ ఆశ్రమాల్లో ఉండేవాళ్లకు కూడా ఉత్తరాలు రాస్తుంది. అర్మ ఇలా చెప్తుంది, “ఒక పెద్ద వయసు ఆవిడ నాకు ఫోన్‌ చేసి ఆమె భర్త చనిపోయాక నా ఉత్తరం ఆమెకు చాలా ఓదార్పును ఇచ్చిందని చెప్పింది. ఆ ఉత్తరాన్ని ఆమె తన బైబిల్లో పెట్టుకుని సాయంత్రాలు తరచుగా చదువుకుంటూ ఉంటుంది. ఇంకొక ఆమె భర్త కూడా ఈ మధ్యకాలంలోనే చనిపోయాడు. ఆమె, నేను రాసిన ఉత్తరం పాస్టర్‌ ఇచ్చిన ప్రసంగం కన్నా ఎక్కువ సహాయం చేసిందని చెప్పింది. ఆమె చాలా ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకుంటుంది కాబట్టి తనను కలవడానికి వీలౌతుందేమో అని అడిగింది.”

అర్మకు తెలిసినవాళ్లలో సాక్షికాని ఒకావిడ వేరే దూర ప్రాంతానికి వెళ్లిపోయినప్పుడు ఆమె అర్మను తనకు ఉత్తరాలు రాయమని అడిగింది. అర్మ ఇలా చెప్తుంది, “ఆమె నా ఉత్తరాలన్నీ దాచిపెట్టుకుంది. ఆమె చనిపోయాక ఆమె కూతురు నాకు ఫోన్‌ చేసింది. నేను వాళ్ల అమ్మకు రాసిన ఉత్తరాలన్నీ తను చదివిందని చెప్పింది. వీలైతే దయచేసి ఆమెకు కూడా బైబిలు గురించిన ఉత్తరాలు రాయమని అడిగింది.”

అర్మ పరిచర్యను పూర్తిగా ఆనందిస్తుంది. “యెహోవాను సేవించే బలాన్ని నాకు ఇస్తూ ఉండమని నేను ఆయన్ని బ్రతిమాలతాను. నేను ఇక ఇంటింటికి వెళ్లలేకపోయినా నేను చేయగలిగింది నేను చేస్తాను” అని చెప్తుంది.