కంటెంట్‌కు వెళ్లు

జోసెఫ్‌కు పోలీసులు సహాయం చేయడం

జోసెఫ్‌కు పోలీసులు సహాయం చేయడం

మీరు ఒక యెహోవాసాక్షయితే, స్వయంగా పోలీసులే మిమ్మల్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లి మంచివార్త ప్రకటించడానికి సహాయం చేయడం జరిగే పనే అంటారా? అలాంటి అనుభవం 2017లో జోసెఫ్‌ అనే సహోదరునికి మైక్రోనేషియాలో ఎదురైంది. ఆయన ముగ్గురు సాక్షులతో కలిసి ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక మారుమూల ద్వీపంలో ప్రకటించడానికి బయల్దేరాడు.

మధ్యాహ్నం కావస్తుండగా, ఈ నలుగురు సాక్షులు దాదాపు 600 మంది జనాభా ఉన్న ఒక పగడపు దీవి చేరుకున్నారు. అక్కడి మేయరు వాళ్లను ఒడ్డు దగ్గర కలిసి పలకరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తూ జోసెఫ్‌ ఇలా అన్నాడు: “మాకోసం ఒక పోలీసు జీపు ఏర్పాటు చేసి అందులో ప్రతీ ఇంటికి తీసుకెళ్తారని మేయరు చెప్పాడు. ఆయన మాటలకు మేం ఆశ్చర్యపోయాం, కానీ వద్దని గౌరవపూర్వకంగా చెప్పాం. ఎందుకంటే, మనం ఎప్పుడూ చేసేలానే స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలవాలని అనుకున్నాం.”

కాబట్టి వీలైనంత ఎక్కువమందిని కలవాలనే లక్ష్యంతో ప్రచారకులందరూ నడవడం మొదలుపెట్టారు. ఆ ప్రచారకులు ఇలా చెప్తున్నారు, “అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు, మనం చెప్పే సందేశాన్ని ఆసక్తిగా విన్నారు. దాంతో ప్రతీ ఇంట్లో మేం అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం గడిపాం.”

ఆ రోజు ఒక పోలీసు జీపు రెండుసార్లు జోసెఫ్‌ను దాటుకుంటూ వెళ్లింది, మూడోసారి ఆయన దగ్గర ఆగింది. అందులో ఉన్న ఒక పోలీసు, మిగతా ఇళ్లకు జీపులో తీసుకెళ్లమంటారా అని జోసెఫ్‌ను అడిగాడు. తర్వాత ఏం జరిగిందో జోసెఫ్‌ ఇలా చెప్తున్నాడు, “నేను వద్దని చెప్పాను, కానీ ఈసారి వాళ్లు ఊరుకోలేదు. ‘మీకింకా కొంచెం సమయమే మిగిలివుంది, అందుకే మిమ్మల్ని మిగతా ఇళ్లకు మేం తీసుకెళ్తాం’ అని బలవంతపెట్టారు. వాళ్ల మాట కాదనలేకపోయాను, ఎందుకంటే నిజంగానే మేం ఇంకా చాలా ఇళ్లకు వెళ్లాలి. మేం ఒక్కో ఇంటికి వెళ్లినప్పుడు అందులో ఉండేవాళ్ల ఇంటిపేరును పోలీసులు నాకు చెప్పేవాళ్లు; ఒకవేళ ఎవ్వరూ బయటికి రాకపోతే సైరన్‌ మోగించి వాళ్లను బయటికి రప్పిస్తామని అన్నారు.

“ఆరోజు వాళ్లు అందించిన సహాయం వల్ల ద్వీపంలోని ప్రతీ ఇంటికి వెళ్లగలిగాం. అంతేకాదు ఎన్నో ప్రచురణల్ని ఇచ్చాం, ఆసక్తి ఉన్నవాళ్లను కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నాం.”

ప్రచారకులతో కలిసి ‘మంచివార్త ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని’ పోలీసులు జోసెఫ్‌తో చెప్పారు. సాయంత్రం సాక్షులు వెళ్లిపోతున్నప్పుడు, పోలీసులు ఒడ్డు దగ్గర నిలబడి ముఖంలో చిరునవ్వుతో, చేతిలో ప్రచురణలతో వీడ్కోలు చెప్పారు.