కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“నేను పనికిరాని వాడిననే భావన ఇప్పుడు నాలో లేదు”

“నేను పనికిరాని వాడిననే భావన ఇప్పుడు నాలో లేదు”
  • పుట్టిన సంవత్సరం: 1963

  • దేశం: మెక్సికో

  • ఒకప్పుడు: వీధుల్లో పెరిగాడు, ఇతరుల కన్నా తక్కువవాడినని భావించేవాడు

నా గతం

 నేను ఉత్తర మెక్సికోలో, స్యూతాత్‌ ఓబ్రేగాన్‌ నగరంలో పుట్టాను. మేం మొత్తం తొమ్మిదిమందిమి, నేను ఐదోవాడిని. మా నాన్నకు నగర శివార్లలో ఒక పొలం ఉండేది, మా ఇల్లు కూడా అక్కడే ఉండేది. అక్కడ చాలా ప్రశాంతంగా, అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్లం. కానీ నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు వచ్చిన ఒక తుఫాను వల్ల మా పొలం నాశనమైంది, దాంతో వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది.

 నాన్న బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. అదేసమయంలో ఆయన తాగుడుకు బానిసయ్యాడు. దానివల్ల అమ్మానాన్నల మధ్య గొడవలు మొదలయ్యాయి, ఆయన చెడు ప్రభావం పిల్లలమైన మా మీద కూడా పడింది. మా నాన్నకు తెలియకుండా ఆయన సిగరెట్లు తీసుకుని కాల్చేవాళ్లం. నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మద్యం తాగాను. కొంతకాలానికే అమ్మానాన్న విడిపోయారు, నేను వ్యసనాలకు మరింత బానిసయ్యాను.

 తర్వాత అమ్మ వేరే వ్యక్తితో జీవించేది, మమ్మల్ని కూడా తన దగ్గరే పెట్టుకుంది. అయితే ఆయన అమ్మకు డబ్బులిచ్చేవాడు కాదు, అమ్మ సంపాదనేమో మా అందరికీ సరిపోయేది కాదు. ఇక నేనూ, నా తోబుట్టువులూ చేతనైన పనులు చేసుకుంటూ ఉండేవాళ్లం; వచ్చే డబ్బు మా కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. నేను బూట్లు పాలిష్‌ చేసేవాణ్ణి; బ్రెడ్‌, న్యూస్‌పేపర్లు, బబుల్‌ గమ్‌లు, ఇతర వస్తువులు అమ్మేవాణ్ణి. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ధనవంతుల ఇంటి ముందున్న చెత్త డబ్బాలు వెతుకుతూ నగరమంతా తిరిగేవాణ్ణి.

 నాకు పదేళ్లు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి నాకు చెత్త యార్డులో పని ఇస్తానన్నాడు. స్కూలు, ఇల్లు వదిలేసి ఆ పనిలో చేరాను. ఆ వ్యక్తి నాకు రోజుకు 10 మెక్సికన్‌ పెసోలను, చెత్త డబ్బాల్లో దొరికిన ఆహారాన్ని ఇచ్చేవాడు. వాటితో జీవిస్తూ, చెత్తలో దొరికిన వస్తువులతో కట్టుకున్న గుడిసెలో ఉండేవాణ్ణి. నా చుట్టూ ఉన్నవాళ్లు బూతులు మాట్లాడేవాళ్లు, విచ్చలవిడిగా జీవించేవాళ్లు. వాళ్లలో చాలామంది డ్రగ్స్‌కు, మద్యానికి బానిసలయ్యారు. నా జీవితం చాలా దుర్భరంగా ఉండేది, రోజూ రాత్రి భయంతో ఏడుస్తూ పడుకునేవాణ్ణి. డబ్బూ, చదువూ లేని నేను ఎందుకూ పనికిరాని వాడిని అనుకునేవాణ్ణి. అలా దాదాపు మూడేళ్లపాటు ఆ యార్డులోనే జీవించాను. కొంతకాలానికి మెక్సికోలో మరో రాష్ట్రానికి వెళ్లిపోయాను. అక్కడ తోటల్లో పనిచేస్తూ పూలు, పత్తి, చెరుకు, బంగాళదుంపలు కోసేవాణ్ణి.

ఇలాంటి చెత్త యార్డులో మూడేళ్లు జీవించాను

 నాలుగేళ్ల తర్వాత మళ్లీ స్యూతాత్‌ ఓబ్రేగాన్‌కు వెళ్లిపోయాను. అక్కడ భూత వైద్యురాలైన మా మేనత్త ఇంట్లో ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు రోజూ రాత్రి పీడకలలు వచ్చేవి, కొన్నిసార్లయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఒకరోజు రాత్రి దేవునికి ప్రార్థిస్తూ, “దేవా, నువ్వు నిజంగా ఉంటే, నీ గురించి తెలుసుకోవాలని ఉంది, జీవితాంతం నిన్ను ఆరాధిస్తాను. నిజమైన మతం ఏదైనా ఉందేమో చూపించు” అని అడిగాను.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

 దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకెప్పుడూ ఉండేది. చిన్నతనంలో వేర్వేరు చర్చీలకు కూడా వెళ్లాను, కానీ ఏవీ నచ్చలేదు. అక్కడ బైబిలు గురించి ఎక్కువ చెప్పేవాళ్లు కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి నాకు సహాయం చేసేవాళ్లు కాదు. బదులుగా కొన్నిచోట్ల చందాల గురించే ఎక్కువ చెప్పేవాళ్లు, ఇంకొన్ని చోట్ల లైంగిక పాపాలు చేసేవాళ్లు ఎక్కువమంది ఉండేవాళ్లు.

 నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు, విగ్రహాల్ని ఆరాధించడం గురించి బైబిలు ఏం చెప్తుందో యెహోవాసాక్షులు తనకు వివరించారని మా అక్క భర్త చెప్పాడు. ఆయన నాకు నిర్గమకాండము 20:4, 5 వచనాల్ని చదివి వినిపించాడు. విగ్రహాల్ని చేసుకోకూడదని అందులో ఉంది. 5వ వచనంలో ఇలా ఉంది: ‘వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.’ తర్వాత మా బావగారు నన్నిలా అడిగాడు, “దేవుడు విగ్రహాల ద్వారా అద్భుతాలు చేసేవాడైతే లేదా వాటిని పూజించాలని కోరుకునే వాడైతే, వాటిని చేసుకోవద్దని ఎందుకు చెప్తాడు? ఆ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ఆ తర్వాత చాలాసార్లు వేర్వేరు బైబిలు అంశాల గురించి చర్చించుకున్నాం. ఆ విషయాలు ఎంత ఆసక్తికరంగా అనిపించేవంటే సమయం ఎలా గడుస్తుందో కూడా తెలిసేది కాదు.

 తర్వాత ఆయన నన్ను యెహోవాసాక్షుల కూటానికి తీసుకెళ్లాడు. అక్కడ చూసినవి, విన్నవి నన్ను చాలా ఆకట్టుకున్నాయి. యౌవనులు కూడా స్టేజీ మీద నుండి చక్కగా బోధించారు! ‘ఇక్కడ వీళ్లకు ఎంత చక్కని శిక్షణ దొరుకుతోందో’ అనుకున్నాను. నేను పొడవు జుట్టుతో, చూడడానికి అపరిశుభ్రంగా ఉన్నా సాక్షులు నన్ను ఆప్యాయంగా పలకరించారు. ఒక కుటుంబం అయితే కూటం తర్వాత నన్ను భోజనానికి ఆహ్వానించింది.

 యెహోవా దేవుడు ఒక ప్రేమగల తండ్రి అనీ; మన ఆర్థిక స్థితి, సామాజిక స్థాయి, జాతి, తెగ, చదువు ఏదైనప్పటికీ ఆయన మన మీద శ్రద్ధ చూపిస్తాడనీ యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకున్నాక తెలుసుకున్నాను. ఆయనకు ఏమాత్రం పక్షపాతం ఉండదు. (అపొస్తలుల కార్యాలు 10:34, 35) చివరికి నా ఆధ్యాత్మిక అవసరాలు తీరడం మొదలయ్యాయి. జీవితంలో ఏదో వెలితి ఉందనే భావనే కూడా నెమ్మదిగా తగ్గింది.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

 ఒక్కసారిగా నా జీవితం మారిపోవడం మొదలైంది! సిగరెట్‌ తాగడం, మద్యం అతిగా తాగడం, బూతులు మాట్లాడడం ఆపేశాను. చిన్నప్పటి నుండి వేధించిన నిరాశానిస్పృహలు, భయంకరమైన పీడకలలు అన్నీ పోయాయి. చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల, సరిగ్గా చదువుకోకపోవడం వల్ల నాలో బలంగా పాతుకుపోయిన పనికిరాని వాడిననే భావాన్ని తీసేసుకోగలిగాను.

 యెహోవాను ప్రేమించే భార్యను పొందాను, ఆమె నాకు ఎంతో అండగా ఉంటుంది. ఇప్పుడు నేనొక ప్రయాణ పర్యవేక్షకునిగా ఎన్నో సంఘాలను సందర్శిస్తూ నా ఆధ్యాత్మిక సహోదరసహోదరీల్ని ప్రోత్సహిస్తుంటాను, వాళ్లకు బోధిస్తుంటాను. బైబిలు ఎంతో ఊరటనిచ్చింది, దేవుడు అద్భుతమైన శిక్షణ ఇస్తున్నాడు. దానివల్ల, నేను పనికిరాని వాడిననే భావన ఇప్పుడు నాలో లేదు.

నేను పొందిన లాంటి సహాయాన్ని ఇతరులకు అందించడమంటే నాకూ, నా భార్యకు ఇష్టం