కంటెంట్‌కు వెళ్లు

అతను ఖైదీల నుండి నేర్చుకున్నాడు

అతను ఖైదీల నుండి నేర్చుకున్నాడు

2011లో, ఒకతను ఎరిట్రియ నుండి నార్వేకు శరణార్థిగా వచ్చాడు. యెహోవాసాక్షులు అతన్ని కలిసి మాట్లాడినప్పుడు, తను ఎరిట్రియలో ఉన్నప్పుడే యెహోవాసాక్షుల్ని కలిశానని చెప్పాడు. అతను అక్కడ మిలిటరీలో పనిచేసేటప్పుడు, తమ విశ్వాసం కారణంగా సాక్షులు జైలు పాలవ్వడం చూశాడు. సాక్షుల్ని ఎంత బలవంతం చేసినా, చాలా కఠినంగా ప్రవర్తించినా వాళ్లు సైన్యంలో చేరలేదు.

అనుకోని పరిస్థితుల వల్ల అతను కూడా జైలు పాలయ్యాడు. అక్కడ అతను పౌలోస్‌ ఈయాసూ, నెగెడె టెక్లెమార్యామ్‌, ఈసాక్‌ మోగోస్‌ అనే ముగ్గురు సాక్షుల్ని కలిశాడు. వాళ్లు తమ విశ్వాసం కారణంగా 1994లో జైల్లో వేయబడ్డారు. అప్పటినుండి వాళ్లు జైల్లోనే ఉన్నారు.

ఈ వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు, యెహోవాసాక్షులు తాము బోధించేదానికి అనుగుణంగా జీవిస్తారని స్వయంగా గమనించాడు. వాళ్లు నిజాయితీగా ఉండడం, తమ ఆహారాన్ని తోటి ఖైదీలతో పంచుకోవడం అతను చూశాడు. తన తోటి ఖైదీలైన ఆ సాక్షులు ప్రతీరోజు కలిసి బైబిలు చదవడం, దానికి ఇతరుల్ని కూడా ఆహ్వానించడం అతను గమనించాడు. తమ విశ్వాసాన్ని విడిచిపెడుతున్నామని సంతకం పెడితే జైలు నుండి విడుదల చేస్తాం అని చెప్పినప్పుడు, వాళ్లు అందుకు ఒప్పుకోలేదు.

ఆ అనుభవం అతని మనసుపై చెరగని ముద్ర వేసింది. దాంతో అతను నార్వేకు వెళ్లిన తర్వాత, అసలు యెహోవాసాక్షులు ఎందుకంత బలమైన విశ్వాసం కలిగివుంటారో తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి యెహోవాసాక్షులు అతన్ని కలిసినప్పుడు, వెంటనే బైబిలు అధ్యయనం తీసుకుని, కూటాలకు రావడం మొదలుపెట్టాడు.

సెప్టెంబరు 2018లో, అతను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాడు. ఎరిట్రియ, సూడాన్‌ ప్రజలతో బైబిలు అధ్యయనం చేయడానికి, బలమైన విశ్వాసం పెంపొందించుకునేలా సహాయం చేయడానికి ఇప్పుడు అతను శాయశక్తులా కృషిచేస్తున్నాడు.