కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

వడ్రంగి చీమ స్పర్శ అవయవం ఎలా శుభ్రం అవుతుంది?

వడ్రంగి చీమ స్పర్శ అవయవం ఎలా శుభ్రం అవుతుంది?

 ఏదైనా కీటకం ఎగరాలన్నా, ఎక్కడికైనా ఎక్కాలన్నా, చుట్టు పక్కల వాటిని పసిగట్టాలన్నా అది శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, చీమకున్న స్పర్శ అవయవాలు (తలమీద ఉండే కొమ్ములు లాంటివి) మురికిగా ఉంటే, దారి తెలుసుకోవడం, సంభాషించడం, వాసనలు పసిగట్టడం లాంటి వాటిని అది సరిగ్గా చేయలేదు. కాబట్టి “మురికిగా ఉండే కీటకాలు మీకు ఎక్కడా కనబడవు, అవి ఉపరితల కాలుష్యం నుండి ఎలా బయటపడాలో తెలుసుకున్నాయి” అని జంతుశాస్త్ర నిపుణుడైన అలెగ్జాండర్‌ హ్యాక్‌మన్‌ చెప్తున్నారు.

 ఆలోచించండి: హ్యాక్‌మన్‌, అతనితోపాటు పనిచేసే వాళ్లు వడ్రంగి చీమల్లో (క్యాంపనొటస్‌ రూఫిఫిమర్‌) ఒక జాతి చీమలు వాటి స్పర్శ అవయవాలను (antennae) శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని అధ్యయనం చేశారు. ఆ చీమ తన కాలును ఒక కొక్కెంలా వంచి, ఆ కొక్కెం ద్వారా ప్రతి స్పర్శ అవయవాన్ని లాగుతూ, వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కణాలను తీసేసుకుంటుందని వాళ్లు కనుగొన్నారు. ఆ కొక్కెంలో ఉండే గరుకు వెంట్రుకలు అన్నిటికన్నా పెద్ద మురికి కణాలను తీసేస్తాయి. కాస్త చిన్నగా ఉన్న మురికి కణాలను ఆ కొక్కెంలో ఉన్న ఒక సన్న దువ్వెన తీసేస్తుంది. ఆ దువ్వెన పళ్లు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉంటాయో, చీమ స్పర్శ అవయవం మీదున్న వెంట్రుకలు కూడా ఒకదానికొకటి ఖచ్చితంగా అంతే దూరంలో ఉంటాయి. ఆ తర్వాత, అతి చిన్న కణాలను అంటే దాదాపు మనిషి వెంట్రుక నడిమికొలతలో 1/80వ వంతు మందం ఉన్న కణాలను ఇంకా సున్నితమైన బ్రష్‌ వెంట్రుకలు తీసేస్తాయి.

 వడ్రంగి చీమ తన స్పర్శ అవయవాలను శుభ్రం చేసుకోవడం చూడండి

 చీమలు తమ స్పర్శ అవయవాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగించే ఈ పద్ధతిని పరిశ్రమల్లో ఉపయోగించవచ్చని హ్యాక్‌మన్‌, అతని బృందం భావిస్తున్నారు. ఉదాహరణకు, సున్నితంగా ఉండే సూక్ష్మ ఎలక్ట్రానిక్‌ భాగాలను, సెమీకండక్టర్లను తయారు చేసేటప్పుడు వాటికి కొంచెం మురికి ఉన్నా వాటిలో లోపాలు రావచ్చు. కాబట్టి ఈ వస్తువులను శుభ్రంగా ఉంచడానికి ఇలాంటి పద్ధతులు ఉపయోగపడతాయి.

 మీరేమంటారు: వడ్రంగి చీమ స్పర్శ అవయవాన్ని అంత చక్కగా శుభ్రం చేసే పద్ధతి దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా తయారు చేశారా?