కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

కుక్కకు ఉన్న వాసనచూసే సామర్థ్యం

కుక్కకు ఉన్న వాసనచూసే సామర్థ్యం

కుక్కలు వాసనచూసే సామర్థ్యంతో వేరే కుక్కల వయసును, ఆడ-మగ తేడాను, మూడ్‌ను గుర్తించగలవని పరిశోధకులు అంటున్నారు. పేలుడు పదార్థాల్ని, చట్టవిరుద్ధమైన మత్తుపదార్థాల్ని కనిపెట్టేలా కూడా వాటికి శిక్షణ ఇవ్వవచ్చు. తమ చుట్టూ ఉన్నవాటిని అర్థంచేసుకోవడానికి మనుషులు ముఖ్యంగా కళ్లను ఉపయోగిస్తారు, అయితే కుక్కలు వాసనచూసే సామర్థ్యాన్ని ఉపయోగిస్తాయి. ఒకవిధంగా, అవి వాటి ముక్కుతో “చదువుతాయి.”

ఆలోచించండి: వాసనచూసే విషయంలో కుక్కకు ఉన్న సామర్థ్యం మనకన్నా వేల రెట్లు ఎక్కువ. యూ.ఎస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రకారం, కుక్క “కొన్ని పదార్థాలు లక్ష కోట్లలో ఒక వంతు ఉన్నా గుర్తుపట్టగలదు. ఇది, ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పావు టీస్పూన్‌ చక్కెర కలిపితే దాని రుచిని పసిగట్టడం లాంటిది.”

కుక్కకు ఇంత అద్భుతమైన వాసనచూసే సామర్థ్యం ఎలా వచ్చింది?

  • కుక్క ముక్కు తడిగా ఉంటుంది కాబట్టి వాసన కణాల్ని తేలిగ్గా పట్టుకోగలదు.

  • కుక్క ముక్కులో రెండు గాలిమార్గాలు ఉంటాయి; ఒకటి ఊపిరి తీసుకోవడానికి, ఇంకొకటి వాసన చూడడానికి. కుక్క గాలి పీల్చినప్పుడు అది, ముక్కులో వాసన గ్రాహకాలు ఉన్న భాగంలోకి వెళ్తుంది.

  • కుక్క ముక్కులో ఉన్న వాసనచూసే భాగం 130 చదరపు సెం.మీ. (20 చదరపు అంగుళాలు) లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది; కానీ మనుషుల్లో అది కేవలం 5 చదరపు సెం.మీ. (0.8 చదరపు అంగుళాలు) ఉంటుంది.

  • కుక్కలకు మనకన్నా దాదాపు 50 రెట్లు ఎక్కువ వాసన గ్రాహకాలు ఉంటాయి.

వీటన్నిటి వల్ల కుక్కలు ఒక సంశ్లిష్ట వాసనలోని వేర్వేరు భాగాల్ని గుర్తుపట్టగలవు. ఉదాహరణకు, మనం సూప్‌ వాసన చూడగలం, కానీ కుక్కలు అందులో ఉన్న ప్రతీ పదార్థాన్ని గుర్తుపట్టగలవని కొందరు పరిశోధకులు అంటున్నారు.

కుక్క మెదడు, ముక్కు కలిసి “ఈ గ్రహం మీదున్న అత్యంత అధునాతన వాసనచూసే పరికరంలా” పనిచేస్తాయని పైన్‌ స్ట్రీట్‌ ఫౌండేషన్‌ అనే కాన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దగ్గర పనిచేసే పరిశోధకులు అంటున్నారు. పేలుడు పదార్థాల్ని, స్మగ్లింగ్‌ చేసేవాటిని, క్యాన్సర్‌ని, జబ్బుల్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్‌ “ముక్కుల్ని” (పరికరాల్ని) రూపొందిస్తున్నారు.

మీరేమంటారు? కుక్కకు ఉన్న వాసనచూసే సామర్థ్యం దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా ఆ సామర్థ్యంతో దాన్ని తయారుచేశారా?